- అభివృద్ధిపై దృష్టి సారించకుండా.. విమర్శలకే అంకితం
- హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నించండి
- మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన అండగా ఉంటాం
- తప్పుడు కేసులకు భయపడవద్దు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయారని, ఇప్పుడు ప్రజలు అది గ్రహిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం న్యూ టౌన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. గ్రామాలలోకి నాయకులు వెళ్ళినప్పుడు, కాంగ్రెస్ ఎందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారో అడగాలని పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సంతోషమే కానీ జిల్లాకు ఆయన చేసిందేమి లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తైంది. మరో 10 శాతం పనులు పూర్తి చేస్తే జిల్లాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మహబూబ్ నగర్ లో తప్పుడు ప్రచారం ద్వారా గెలిచినా, ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయారు. గెలిచిన తర్వాత అభివృద్ధి పనులు పక్కన పెట్టి విమర్శలకే పరిమితం అయ్యారు” అని విమర్శించారు. తమ మీద కోపంతో అభివృద్ధి పనులు ఆపొద్దని.. కేసీఆర్‌ను తిడితే ప్రజలు మెచ్చుకుంటారని అనుకోవద్దని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, ప్రారంభం కానీ పనులపై సమీక్షించి అభివృద్ధిని వేగవంతం చేయాలని, చేసిన పనులకు, గతంలో శంకుస్థాపనలు చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ప్రజల ముందు అబాసుపాలు కావొద్దని హితవు పలికారు.
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే నిధులు వస్తాయని ప్రజలు అనుకున్నారు. కొల్లాపూర్ వచ్చి ఏం ప్రకటన చేయకుండానే వెళ్లినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణాధ్యక్షుడు శివరాజ్, మాజీ ఎంపీపీ సుధా శ్రీ, పార్టీ మహబూబ్ నగర్ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.