- ఆదివాసీ గూడాల్లో ఆనందం
- తమ పోరాటం ఫళించందని సంబరం
ఎక్కడో ఒకచోట పులి జాడలుకనిపిస్తేనే వణికిపోయిన గిరజనం ఇప్పుడు.. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ జోన్ ప్రకటనతో చలించిపోయింది. తాము ఉన్న ఊళ్లు వదలాల్సి వస్తుందని ఆందోళన చెందారు. అందుకు జీవో 49కి వ్యతిరేకంగా ఉద్యమించారు. జిల్లా బంద్ చేపట్టారు. జీవో 49ని రద్దు చేయాలని ఆదివాసీ, తుడుందెబ్బ సంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్‌లో ఆదివాసీ, ఇతర సంఘాల నాయకులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. కాగజ్‌నగర్‌లో ర్యాలీ తీశారు. మిగతా మండలాల్లో ఆదివాసీ, తుడుందెబ్బ నాయకులు నిరసనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివాసీ, గిరిజన సంఘాలు రాస్తారోకో చేపట్టాయి. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నెన్నెలలో జీవో ప్రతులను దహనం చేశారు. కాసిపేట మండలంలో బంద్ నడిచింది. ఆదిలాబాద్‌లో ప్రధాన వీధుల గుండా ఆదివాసీ నేతలు ర్యాలీలు నిర్వహించి దుకాణాలను మూసి వేయించారు. బస్టాండ్, బస్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. గుడిహత్నూర్, ఉట్నూర్ మండల కేంద్రాల్లో వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు జివోను రద్దు చేసేలా చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న టైగర్ కన్జర్వేషన్ జోన్ విషయంలో సర్కారు వెనక్కి తగ్గింది.
సుమారు 330 గ్రామాలను ప్రభావితం చేయనున్న ఈ పులుల సంరక్షణ కేంద్రంపై ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టైగర్ రిజర్వ్ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో 49ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జీవో 49 విషయంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ నుంచి సేకరించిన తాజా నివేదిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ రేంజ్‌లో లక్షా 49 వేల హెక్టార్లను టైగర్ రిజర్వ్‌లోకి మారుస్తూ గత నెల 30న ప్రభుత్వం జీవో 49ని ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో 330 ప్రభావిత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమగ్ర వివరాలను సేకరించారు. వాస్తవ పరిస్థితులను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో జీవో 49ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, జీవో 49 నిలుపుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలపడంతో పాటు సన్మానించారు. సహకరించిన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండాసురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కు.. ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కృతజ్ఞతలు తెలిపారు.