- అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు
- పట్టించుకోని సంబంధిత అధికారులు
మండలంలో ఇష్టారాజ్యంగా అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. పాలకవీడు మండలంలోని మూసి ఒడ్డు సింగారం గ్రామ శివారు ప్రభుత్వ భూమి నుండి రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నాసంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భారీ యంత్రం సహాయంతో టిప్పర్ల ద్వారా అక్రమ మట్టిని తరలిస్తున్నారు. టిప్పరు మట్టిని రూ 10 వేలు నుండి రూ 12 వేలకు అమ్ముతున్నట్లు సమాచారం. మట్టి తవ్వకానికి ముందుగా సంబంధిత రెవిన్యూ, గనుల శాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోరు. అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. అధికారుల వ్యవహార శైలి కారణంగానే మట్టి తవ్వకాలు యదేచ్చగా సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అక్రమ మట్టి తరలింపు పై చర్యలు తీసుకుంటాం
తహసిల్దార్ కమలాకర్. అక్రమంగా మట్టి తరలించే వారిపై, వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాలకవీడు మండల తహసీల్దార్ కమలాకర్ అన్నారు.