- ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని హుకుం
- ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా
కళాశాలలో చేరేటప్పుడు విద్యార్థులతో మాట్లాడిన ఫీజ్ ఒప్పందంకు భిన్నంగా, ఫీజులు చెల్లించాలని ఎస్వి కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఎస్‌వి డిగ్రీ కళాశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడుదని యాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ కళాశాలలో పేద బలహీన వర్గాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, వీరంతా ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నారన్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల దగ్గరికి వెళ్లి మా కళాశాలలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలతో విద్యాబోధన జరుగుతుందని ఎలాంటి కళాశాల ఫీజులు మీరు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి జాయిన్ అయ్యాక ప్రభుత్వం నుండి విడుదల కావలసిన ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఖచ్చితంగా విద్యార్థులు ఫీజులు చెల్లించాలని లేనిపక్షంలో పరీక్షలకు అనుమతించబోమని యాజమాన్యం విద్యార్థులకు నోటీసులు పంపించి విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఫీజులను చెల్లించలేని విద్యార్థులను తరగతి గదిలో నుండి బయటకు పంపిస్తున్నారని, ఫీజులు చెల్లించకుంటే పరీ క్షలు రాయకుండా చేసి ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. గతంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పరీక్ష ఫీజులు తప్ప కళాశాల ఫీజులు చెల్లించలేరని విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం చెల్లించినప్పుడు తీసుకోవాలని వినతిపత్రం అందజేసి విద్యార్థుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకుపోయిన కనికరం చూపించకపోవడం సరైంది కాదన్నారు. విద్యార్థులు పరీక్షలకు దూరం అవుతామని భయంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారని, తక్షణమే విద్యార్థులను ఇంటర్నల్ పరీక్షలకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం, ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కినపల్లి వినయ్, ఎస్వీ కళాశాల ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరామ్, దీపక్, రేణుక, ఓయూ విద్యార్థి సంఘం జేఏసీ నాయకుడు భారీ అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కీర్తి, దేవి ప్రియ, రాహుల్ సతీష్ అఫ్రోజ్, విగ్నేశ్వర్, శివ భరత్ నాగరాజు గణేష్, దామోదర్ పాల్గొన్నారు.