- ఆయన మరణం తీరని లోటు: జగన్
మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం పులివెందులలోని తన నివాసంలో జగన్ మాట్లాడుతూ పదేళ్లపాటు దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణల తో దేశ పురోభివఅద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్ గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి అని కొనియాడారు. ఏ బాధ్యత నిర్వహించినా ప్రతి చోటా తనదైన ముద్ర కనబరిచారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని అన్నారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందని చెప్పారు.