పరిరక్షించాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
నల్లగొండ జిల్లాలో మండల కేంద్రమైన గుడిపల్లి శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం, గుడిపల్లి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారంనాడు గుడిపల్లి పరిసరాల్లో కొండగట్టులపై, పంట పొలాల్లో క్రీ.పూ. 2000-1000 సం.ల మధ్య కాలానికి చెందిన సమాధి గదులు, నిలువురాళ్లు వద్ద జరిపిన విస్తృత పరిశోధనల్లో ఆసక్తికర పురావస్తు విశేషాలు వెలుగు చూశాయన్నారు. ఊరి వెలుపల చీనీ తోటల్లో గల అనేక నిలువురాళ్లు (మరణించిన వారికి గుర్తుగా నిలిపే స్మారక శిలలు) ఒక్కొక్కటిగా కనుమరుగయ్యి ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలి ఉన్నాయనీ, గుడిపల్లి శింగరాజుపల్లి రోడ్డుకు కుడివైపున గల ఎల్లమ్మ బండపై గల గూడు సమాధులు నిర్మాణ సామాగ్రి సేకరణలో భాగంగా కంకర రాళ్లౌతున్నాయని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిలువురాయి ఏడడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు, అడుగు మందంతో ఉన్నాయన్నారు. ఎల్లమ్మ బండపైగల ఇంకా మిలిగి ఉన్న ఒక గూడు సమాధి, నిర్మాణ పరంగా అరుదైనదని, అటూఇటూ గల రెండు రాతివరుసలపై మామూలుగా నిలిపే దీర్ఘ చతురస్రాకారపు కప్పురాయి స్థానంలో, ఒక పెద్దగుండు రాతిని అమర్చారని, ఇలాంటి ఆధారం వెలుగు చూడటం తెలంగాణా రాష్ట్రంలోనే అరుదైన విషయమని శివనాగిరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా పురాచరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలైన ఈ ఆనవాళ్లను కాపాడుకొని, ఇప్పటికి దాదాపు 4000 సం.ల చరిత్ర చిహ్నాలను భావితరాలకు అందించాలని గుడిపల్లి గ్రామస్తులకు శివనాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు, దేవరకొండ వారసత్వ కార్యకర్త, యూనస్ పర్హాన్, గుడిపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి, పడాల సైదులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఇలా గూడు సమాధిపైన గుండురాతిని అమర్చిన విషయం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొందని, వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాలని కొత్త తెలంగాణా చరిత్ర బృందం, కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్, కోకన్వీనర్, డా. భద్రగిరీష్ అభిప్రాయపడినట్లు శివనాగిరెడ్డి చెప్పారు.
