పోచారం మునిసిపల్ కమిషనర్ కూడా ఆ సంస్థ మోచేతి నీళ్లే తాగుతున్న వైనం
హెచ్‌ఎండీఏ లేఔట్ ప్రకారం దారిని ఓ సర్వే నంబర్‌లో చూపించిప్రభుత్వ స్థలం పైగా రైతుల పొలాల మీదగా రోడ్డు వేస్తున్న జక్కా వెంకట్ రెడ్డి..
పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి పైరవీలతోనే…వారు కడితే సక్రమం.. మేం కడితే అక్రమమా?
పేదోడికో న్యాయం.. ధనవంతుడికో న్యాయమా!పోచారం మునిసిపల్ పరిధిలోని సర్వే నం-35లో అక్రమ నిర్మాణం
బహుళ అంతస్తుల భవనం కడుతున్నా పట్టించుకోని తహశీల్దార్పేదోడు కడితే మాత్రం వెంటనే కూల్చి.. కేసు నమోదు చేసిన అధికారులు
తహశీల్దార్ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు

అదో ప్రభుత్వ స్థలం. అక్కడ ఎవరు నిర్మాణాలు చేసినా అది అక్రమమే. కానీ.. అందులో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే.. పేదోడు కట్టిన నిర్మాణాలు అక్రమమంటూ వెంటనే కూల్చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అక్కడే ధనవంతుడు కడితే మాత్రం ఎలా సక్రమం అయిందో ఆర్థంకాని పరిస్థితి. మరి, రాజ్యాంగంలో పేదోడికో న్యాయం.. ధనవంతుడికో న్యాయం ఉందా అనే విషయం అధికారులే చెప్పాలి.

మేడ్చల్ జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు ఎవరు చేపట్టినా ఒకేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించడం విడ్డురంగా ఉంది. పేదోడు కడితే మాత్రం అక్రమమంటూ వెంటనే చర్యలు తీసుకునే అధికారులు ధనవంతుడు కడితే మాత్రం చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందనేదే ప్రశ్న. పోచారం మునిసిపల్ కార్యాలయానికి నాలుగు అడుగుల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం..

మునిసిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్-35లో పలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా తహశీల్దార్ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించడంలో అంతర్యమేంటో అర్థంకావడం లేదు. ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ రజని.. కబ్జాదారులకు దన్నుగా నిలుస్తున్నారని చెప్పడానికి ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే ఉదాహరణ. ఘట్కేసర్ మండలం పోచారం మునిసిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వే నంబర్-35లో ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో ఓ సామాన్య వ్యక్తి అక్రమ నిర్మాణం చేపట్టారనే విషయం తెలుసుకున్న తహశీల్దార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతోపాటు సదరు వ్యక్తి పై కేసు కూడా నమోదు చేశారు. కానీ.. అదే సర్వే నంబర్‌లో సరిగ్గా పది అడుగుల దూరంలో ఓ ధనవంతుడు చేపడుతున్న అక్రమ నిర్మాణం పై మాత్రం సదరు తహశీల్దార్ కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరం.

సర్వే నంబర్-35లో నిల్‌గిరిహైట్ అనే పేరుతో మోడీ ప్రాపర్టీస్ సంస్థ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టింది. బాధ్యత గల తహశీల్దార్‌గా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు మోడీ ప్రాపర్టీస్‌పై మాత్రం చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సదరు బిల్డర్ తహశీల్దార్‌ను మేనేజ్ ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా అక్కడి వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమి ప్రభుత్వ స్థలం అంటూ గతంలోనే రెవెన్యూ అధికారులు తేల్చారు. అయినా కూడా ఇంత బాహాటంగా అక్రమ నిర్మాణం జరుగుతున్నా తహశీల్దార్‌కు మాత్రం కనిపించకపోవడంలో అంతర్యమేంటో ఆమే చెప్పాలి. ఇపుడు ఈ విషయాలను సాక్ష్యాలతో ఆదాబ్ హైదరాబాద్ ప్రజల ముందుకు తీసుకువస్తున్న తరుణంలో దీనిపై అధికారులు నోటీసులతో సరిపెడతారా లేదా స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారా అనే విషయం వేచి చూడాలి.