- బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
- అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం ?
- వారు పరిపాలించిన పదేండ్ల పాలనలో ఎలా వరించింది ?
- అధికారంలో ఉన్నపుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ఎలా..?
- కాళేశ్వరం, సింగరేణి సంస్థల నిర్మాణాలకు ఊర్లు మాయం కాలేదా.?
- పార్టీని కాపాడుకునేందుకే అధికారపార్టీపై విమర్శలు చేస్తుందా ?
- తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ ప్రత్యేక రాజకీయ కథనం..
మూసి ఆక్రమణల కూల్చివేతలు,ఆరు గ్యారంటీల అమలుపై జాప్యం కారణంగా రేవంత్ సర్కార్‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ప్రచారం బోగస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తశుద్దిగా విడతల వారీగా పథకాలు అమలు చేస్తామని, కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మరోపక్క హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ జోన్ గా ఏర్పడబోతుందని అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రజల మద్దతు పెరిగిందని అందుకే సీఎం రేవంత్ ఇంకా దూకుడుగా వెళ్తున్నారని గులాబీ ప్రచారానికి దీటైన జవాబు చెబుతున్నారు హస్తం నేతలు, అయితే వీరు ఇద్దరిలో ఎవరు చెబుతున్నది నిజం ? అన్నది పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 10 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి నేడు అనేక అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తుల విమర్శలు, అధికార దుర్వినియోగం వంటి సవాళ్లు ఎదుర్కొంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు సామాన్య జీవితం గడిపిన బీఆర్ఎస్ పెద్దలు పది ఏండ్ల పాలన అనంతరం కోట్లు కూడబెట్టడంపై కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో 2023, 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు గట్టి ఎదురుదెబ్బను రుచి చూపించారు. ఓటమి చూపిన పాఠంతో మూడు నెలలు సైలెంట్ గా ఉన్న గులాబీ నేతలు తర్వాత అధికార పార్టీపై చిందులు వేయడం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పార్టీని.. పార్టీ కి చెందిన ముఖ్య నాయకులను, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం గులాబీ అధిష్టానానికి సవాలుగా మారింది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం కేసీఆర్,కేటీఆర్ కు మింగుపడని అంశంగా మారిపోయింది.. దీంతో పటిష్టమైన సోషల్ మీడియాను నిర్మాణం చేసుకుని అధికార పార్టీ పై విమర్శలు ఎక్కుపెట్టింది. సందు దొరికితే చాలు అధికార పార్టీకి కునుకులేకుండా చేయాలనీ సర్వ శక్తులు ఒడ్డుతుంది. తన పార్టీ నాయకులను కాపాడుకోవడం ఒక లక్ష్యమైతే, అధికార పార్టీ గత ప్రభుత్వ హయాంలో చెసిన తప్పులను, స్కాములను బయటికి తీసి ముఖ్య నేతలను జైలుకు పంపితే సింపతీ సంపాదించుకోవాలనే తపనతో అధికార పార్టీ ఫై విమర్శల దాడిని ఎక్కుపెట్టింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన రాజకీయం ఆసక్తిగా మారిపోయింది.
అధికారంలో ఉన్నపుడు ఒకలా ..అధికారం లేనప్పుడు మరోలా ఎలా ప్రవర్తిస్తారు..?
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్ ఏకపక్ష దాడి కొనసాగిస్తుందన్నది కొట్టిపారేయలేని నిజం. అయితే ఈ దాడిని కాంగ్రెస్ ముఖ్య నేతలు తప్ప మిగతావారెవరు ఖండించకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వంపై చిన్నపాటి వ్యతిరేకతను కూడా ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడం అనేది నానుడి నుంచి వస్తున్న ఒక రాజకీయ సంప్రదాయం. అయితే ఈ బాధ్యతను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంది అనడంలో సందేహమే లేదు. కానీ మూసి వ్యవహారాన్ని మానవీయ కోణంలో చూడమని ప్రభుత్వం చెబుతుండగా. కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తామని, అందివచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోలేమని బీఆర్ఎస్ తెగేసి చెబుతోంది.
ప్రజల మద్దతుతోనే అధికార పార్టీ దూకుడు పెంచిందా ..?
రోజు రోజుకు పెరుగుతున్న నగర జనాభా, దానికి తోడు గాలి,నీరు కాలుష్యం నగర జీవితం విషతుల్యంగా మారిపోయింది. గాలి కాలుష్యం, నీరు కాలుష్యంతో నగర ప్రజలు,ముఖ్యంగా చిన్న పిల్లలు పలు రోగాల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో భావి, భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నగా మారే సంకట పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మూసి ప్రక్షాళన చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలోనే మూసి ఆక్రమణల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కారణంగా కొంతమంది ప్రజలకు నిర్వాసితులకు ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని ప్రభుత్వం కూడా అంగీకరించింది. బాధితుల పక్షాన నిలబడి వారికీ అండగా నిలబడి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా కేటాయించింది. మరికొన్ని ఇండ్లను కూడా అవసరమైన మేరకు త్వరలోనే కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చింది. అయినా ఇవేమి పట్టించుకోని బాధ్యతలేని ప్రతిపక్షం గగ్గోలుపెట్టడం చర్చకు దారితీసింది.
కాళేశ్వరం, సింగరేణి సంస్థల నిర్మాణాలకు ఊర్లు మాయం కాలేదా:
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని గ్రామాలను కనుమరుగు చేసిందో ఎంతమంది రైతులకు సంబందించిన భూములను అభివృద్ధి పేరుతొ లాగేసుకుందో మరిచిపోయి నేడు రంకెలు వేయడం విచిత్రమనిపిస్తోంది. సింగరేణి సంస్థకు చెందిన ఓపెన్ కాస్టుల నిర్మాణం కోసం కోల్ మైన్ ఏరియా లోని చాలా గ్రామాలు ఇప్పటికే కనుమరుగయ్యాయి . రాబోయే రోజుల్లో మరి కొన్ని గ్రామాలూ కూడా తుడిచిపెట్టుకోబోనున్నాయి. రాబోవు తరాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు, సంస్థలు చేపడుతున్న నిర్మాణాత్మక నిర్ణయాలకు కొంతమేరకు సవరణలు తప్పవు. అంత మాత్రం చేత ప్రభుత్వంపై దూషణలకు దిగడం ఎంతవరకు సరైందో గులాబీ దళపతులే చెప్పాలి. ప్రతిపక్షాలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి. హుందాగా వ్యవహరించాలి కానీ ఇలా చిల్లర పనికిమాలిన రాజకీయాలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సరి అయ్యిందో వారి విజ్ఞతకే తెలియాలి.
అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం ?
వారు పరిపాలించిన పదేండ్ల పాలనలో ఎలా వరించింది ?
మాకు స్వంత ఇల్లు లేదు. కారు కూడా లేదు అనిచెప్పుకుని తిరిగిన గులాబీ పెద్దలకు ఇప్పుడు కోట్ల రూపాయల సంపద, రాజభోగాలు ఎక్కడ నుంచి వచ్చిపడ్డాయో చెప్పగలరా.? బీఆర్ఎస్ కార్యాలయానికి వారికి నచ్చని వ్యక్తులు , చాన్నాళ్లు,పత్రికలు వస్తే దొబ్బోయి అని అన్నారని మాటలు అని తరిమే గులాబీ నేతలు, వారి పెద్దల స్వంత ఆస్తులతో బీఆర్ఎస్ కార్యాలయం కట్టలేదన్న వాస్తవాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు. కేవలం తమకున్న అహంకారంతోనే అధికారం కోల్పోయామన్న నిజాన్ని గులాబీ పెద్దలు ఇప్పటికి ఎందుకు గుర్తించలేపోతున్నారు. వారు పరిపాలించిన పదేండ్ల పాలనలో, గుర్తుకురాని ప్రజలు,సామాన్య కార్యకర్తలు ,నాయకులు ఇప్పుడు గుర్తొచ్చారు సరే వాళ్ళు మిమ్ములను ఇప్పుడు నమ్ముతారని ఎలా గాలిలో లెక్కలు వేస్తున్నారు.