- రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే పక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సొమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు గాను రూ.530 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ‘కొత్త కార్డుల్లో 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేస్తాం. తొలి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం. పాత రేషన్ కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది పేర్లు చేర్చారు. 501 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభమైంది. మొదటి రోజు 20,336 మంది భూమిలేని కూలీలకు నిధులు విడుదలయ్యాయి‘ అని తెలిపారు. ఈ ఏడాది రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు..