- నామినేటెడ్ పోస్టుల భర్తీపైన కసరత్తు
ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కొత్త కార్యవర్గం.. నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన హైకమాండ్ కసరత్తు చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో హైకమాండ్ అలర్ట్ అయింది. దీంతో, పదవుల విషయంలో కీలక నిర్ణయానికి సిద్దమైంది. మంత్రి పదవుల ఖరారు పైన కొత్త ఫార్ములా అమలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేసింది. హైకమాండ్ తో చర్చలు ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ ముఖ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. పార్టీ నేత కేసీ వేణుగోపాల్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. కుల గణన పైన నివేదికను సమర్పించారు. కాగా, మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కార్యవర్గంతో పాటుగా నామినేటెడ్ పదవుల పైన చర్చ చేసారు. దీంతో, హైకమాండ్ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆరా తీసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు.. హామీల అమలు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రివర్గం విస్తరణ కోసం ఆశావాహులు చాలా కాలంగా నిరీక్షిస్తున్న విషయం పైన చర్చ జరిగింది. పార్టీ ముఖ్య నేతలు చర్చించి.. తమకు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహాశ్ గౌడ్ తో పాటుగా పార్టీ ఇంఛార్జ్ సైతం ఢిల్లీలోనే ఉన్నారు.