Sunday, November 24, 2024
spot_img

రాబోయే రోజుల్లో ఎవరిది పైచేయి

Must Read

ఒక దశాబ్దకాలంగా మా ప్రభుత్వానికి తిరుగులేదనే ఉత్సాహంతో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన బిజెపి పార్టీ ఒకవైపు, రెండు పర్యాయాలలో ఘోరమైన ఓటమిని చవిచూసి ఒక అస్తిత్వం లేకుండా చెల్లాచెదురైన నాయకత్వం వహిస్తు కాంగ్రెస్ పార్టీ మరోవైపు.
దాదాపు 100 రోజులు మార్చి 30 నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా పార్టీల ముఖ్య కార్యకర్తలు, నాయకులు అలుపెరగకుండా ఎన్నికల సమరానికి చేరుకొని ఒకరిపై ఒకరు ఎక్కుపెట్టిన అస్త్రాలు ఎన్నో ఉన్నాయి. 2014లో బిజెపి ప్రధానంగా వంశపార్యంపర పాలన అంతమొందాలని, నల్లధనం తిరిగి తేవాలంటే, దేశంలో జరిగే కుంభకోణాలు, అవినీతి నాయక పాలన అంతం కావాలంటే బిజెపియే ప్రత్యామ్నాయ మార్గమని ప్రజల్లోకి వెళ్లి సక్సెస్ అయింది. మళ్లీ 2019లో ‘పుల్వామా దాడులు’ జరిగాక దేశం ఒకటిగా నిలబడితేనే ప్రపంచ దేశాలని ఎదుర్కోగలం అనే నినాదంతో ముందుకెళ్ళింది. ఆర్థిక శక్తిలో ప్రపంచ చిత్రపటంలో ముందు వరుసలో నిలబడాలంటే బిజెపి వల్లనే సాధ్యమని నినదించడంతో మరోసారి ప్రజలు ఘనమైన సంఖ్యని ఇచ్చి అందలం ఎక్కించారు.

కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు భంగపడి కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయింది. మూడో పర్యాయం కూడా మొదట చతికిలబడినట్లే కనిపించింది. కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలను భుజాన వేసుకొని దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ యాత్ర చేస్తూ దేశ జిడిపి గురించి, నిరుద్యోగం గురించి, మతవ్యాప్తి గురించి, విద్వేష ప్రసంగాల గురించి విమర్శానాస్త్రాలు గుప్పిస్తూనే తిరిగాడు. దేశంలోని రాష్ట్రాలతో, ప్రాంతీయ పార్టీల చర్చలు జరుపుతూ ‘ఇండియా’కూటమి పేరుతో ఒక్కతాటిపైకి వచ్చి పోరాడేందుకు సన్నద్ధమయ్యారు. అనూహ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో ఒక్కసారిగా బలం పుంజుకుంది.బిజెపి తమకు ఉత్తరాది రాష్ట్రాలపై ఎలాగా పట్టు ఉంది. దక్షిణాదిలో పాగవేయాలని ముందు నుంచే బలమైన వ్యూహాలతో పని చేస్తూనే వచ్చింది. ఈసారి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బోణి కొట్టి చార్ సౌ పార్ నినాదాన్ని నిజం చేయాలని కలలుగన్నది. పేరుకే ఎన్.డి.యే కూటమి తప్ప కూటమిలోని పార్టీలతో సంబంధం లేకుండానే విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటుతామని భ్రమపడింది. మరోపక్క ఇండియా కూటమి ఇవేమి లెక్కలు, పత్రాలు ఆలోచించకుండానే ప్రజలు మావైపు ఉంటే చాలనుకుంది. అధికారపార్టీ వ్యవహరించే ఒంటెద్దు పోకడలలోని ఆంతర్యాన్ని ప్రజలు గుర్తిస్తే చాలనుకుంది. ఈసారైనా ఇండియా కూటమికి అధికారం ఇస్తే దేశంలో సెక్యులరిజం వర్ధిల్లేటట్టు చేస్తామంది.నిరుద్యోగాన్ని తరిమేసి,పేదలకు ఉపాధి భద్రతను కల్పిస్తామని హామీలు ఇచ్చింది.

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరికి వారు సమాధానం చెప్పాల్సిన సమయంలో ఓటు రూపంలో ఇచ్చుకుంటూ వచ్చారు. ఎన్నికల తుది ఘట్టం జూన్ 1న (ఏడవ విడత) ముగియగానే ఓటర్ల నాడిని పసిగట్టామని ఈవీఎంలలో గూఢంగా ఉన్న రహస్యాన్ని మేము చేధించామని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు మినహా మిగతా అన్ని సర్వే సంస్థలు ముక్తకంఠంతో బిజెపియే 3.0 అధికారం చేపట్టబోతుందని, చార్ సౌ పార్ కు కొద్ది దూరంలో మార్కును అందుకోలేకపోతుందని చెప్పాయి. ఇక అధికారిక ఫలితాలు ఒకటే ఆలస్యమని నిర్ణయాన్ని ప్రకటించాయి.దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. ఒక్కో ఈవీఎం బాక్స్ బద్దలయ్యేకొద్దీ ఏకచత్రాధిపత్య సింహాసనం అధిష్టానం అనుకున్న బిజెపి కలలు ఆవిరి అయ్యాయి. మరొకసారి అంధఃపాతాళం తప్పదు అనుకున్న ఇండియా కూటమికి సానుకూలమైన జవాబు ఇచ్చి దాదాపు అధికారాన్ని చేపట్టే సత్తాకు ప్రజలు దగ్గరగా తీసుకురాగలిగారు. దేశంలో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో జతకట్టి కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని తప్పనిసరి చేశారు. ప్రజలు దేశంలో తటస్థమైన వైఖరిని వెల్లడించారు.

ఎన్.డి.యే కూటమి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో 3.0 అధికారాన్ని చేజిక్కించుకున్న, ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాలో బలంగా తయారైంది. ఇప్పటినుంచి మేం బలవంతులం, నేనేం చేసినా నడుస్తుందనే అపోహల నుంచి రెండు ప్రధాన పార్టీలు అనుకోవడానికి వీలు లేదు. ఏకపక్ష నిర్ణయాలకు అవకాశం లేదు. కేంద్రంలో రాష్ట్రాలకు కూడా సమప్రాధాన్యాన్ని ఇచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి రాష్ట్రానికి సరైన నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కూటమికి ఉన్నది. దేశంలో ఏ ప్రాంతం వెనుకబడి ఉన్న ప్రశ్నించే అవకాశం ఇండియా కూటమికి కూడా వచ్చింది.

రాబోయే కాలంలో రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు శ్రమించి ప్రాంతీయ పార్టీల కన్నా శరవేగంగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పార్టీలైనా ప్రజలు ఎప్పుడూ ఒకవైపే మొగ్గు చూపడం లేదనే వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. పంట కాలాన్ని లెక్కించినట్టే ఈ పంచకాలాన్ని గణిస్తున్నారు. పార్టీలు వేసే మీనమేషాలను కూడుతున్నారు. ఏ తప్పు చేసిన తీసివేతకు వెనుకాడడం లేదు. ఈ ఎన్నికలలో ప్రజలు ప్రశ్నించడానికి ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఇండియా కూటమికి సమాధానపడే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎన్డీఏ గత దశాబ్దకాలంలో నడిచిన ప్రభుత్వముగా కాకుండా ప్రతి పనికి ఆచితూచి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయాలి. ఇలా బాటలు పరిచిన పార్టీలనే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

బోగిని మహేష్

హైదరాబాద్ విశ్వవిద్యాలయం

8985202723

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS