జూలై 28, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా
మానవ జన్మకు పరమార్ధం మహిలో ఉన్నతంగా జీవించడమే. ఉన్నత జీవనమంటే కోట్లు గడించడం కాదు.వ్యక్తిత్వంతో వికసించడం. మూలాలను మరచి పోయి,సంస్కారం లోపించి,కృతజ్ఞత మరచి జీవించడం వలన జీవితానికి సార్ధకత చేకూరదు. జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. సకల జీవరాశుల్లో మానవ జన్మకున్న విశిష్టత ఏ ఇతర జీవరాశులకు లేదు. ఇలాంటి ఉత్కృష్టమైన మానవ జన్మకు సార్ధకత చేకూరాలి. మనుషులుగా పుట్టి, ఏదో విధంగా బ్రతికేసి, చివరికి మట్టి పాలు కావడం వలన ఫలితమేమి? నిండైన వ్యక్తిత్వంతో, మానవీయ విలువలతో, మానవ సంబంధాల మధ్య జీవించడం లోనే మానవ జన్మకు సార్ధకత సమకూరుతుంది. మన జన్మకు పరిపూర్ణత చేకూర్చిన వారిని మరవడం అమానవీయం. నేడు మనం అనుభవిస్తున్న జీవితం, సకల సుఖాలు ఎవరి వల్ల ప్రాప్తించాయో, వారిని కూరలో కరివేపాకులా తృణీకరించి,ఆవలికి గెంటడం దుర్మార్గం. జన్మ ప్రదాతలను జ్ఞాన ప్రదాతలను గౌరవించడంలోనే మన వ్యక్తిత్వం వికసిస్తుంది.కనిపెంచిన దైవాలను నిర్లక్ష్యం చేయడం అమానుషం. కనిపించని దైవం కంటే కని పెంచిన వారే మిన్న. తల్లిదండ్రుల్లో ఒకరెక్కువ, ఒకరు తక్కువ అనే భావం తగదు. అమ్మ విలువ, నాన్న బాధ్యత పిల్లల ఉన్నతికి దోహదం చేస్తాయి. “నాస్తి మాతృ సమం దైవం”అన్న మాట అక్షరసత్యం.అవనికి అందం “అమ్మ”. బొమ్మలాంటి మనల్ని మనిషిగా మార్చిన “అమ్మ”ను తృణీకరించి,తూలనాడడం తగునా? అమ్మలేనిదే మానవ జన్మ శూన్యం.నవమాసాలు మోయడమే కాదు,నడకనేర్పి,నడత నేర్పి,ఆలనా పాలనాచూసి, లాలించి,గోరు ముద్దలు తినిపించి మన బ్రతుకుకొక అర్దం చెప్పి,బ్రతుకు దెరువు కు మార్గం చూపించి మరబొమ్మలాంటి మనల్ని మనిషిగా తీర్చిదిద్దే మహిమాన్విత శక్తి కేవలం అమ్మ కే స్వంతం.తల్లితో పాటు తండ్రి స్థానం మరువరాదు. బాల్యంలో తప్పటడుగులను సరిచేసిన తల్లి దండ్రులు తమ బిడ్డలు యవ్వనదశలో వేసే తప్పుటడుగులను సరిదిద్దలేదు కదా! అడ్డాలనాడే బిడ్డలు గాని గడ్డాలొచ్చాక బిడ్డలు కారు కదా!!పెంచి,పెద్దవారిని చేసి, విద్యాధికులను చేసి,తన బిడ్డ గొప్పవాడైతే చూడాలని తపించే తల్లిదండ్రులను నడిరోడ్డు పాలు చేసి,నగుబాటు చేయడం తగునా? పెరిగి పెద్దయ్యాక,సమాజంలో మనకంటూ ఒక స్థానం కల్పించిన తల్లిదండ్రులు తమ స్థోమతకు సరితూగరని త్యజించడం అత్యంత అమానవీయం.తృణమో పణమో చెల్లించి కన్నవారిని వదిలించుకోవాలని చూసే ప్రబుద్ధులు మానవత్వానికే మాయని మచ్చ.వార్ధక్యంలో వృద్ధాశ్రమాలకు అంకితమిచ్చి తామూ మనుషులమేనంటూ వారిని గౌరవిస్తున్నామనే భ్రమ కలిగిస్తూ ఏడాదికోసారి వారిని సందర్శించి, హడావిడి చేస్తే చేసిన పాపం పోతుందా?”వైతరణి” వదిలి పెడుతుందా? తల్లిదండ్రులను హింసించడం అమానవీయం. జన్మ ప్రధాతల హృదయఘోష మానవాళికే శాపం. వారిని వేధించకూడదు-మానవత్వంతో మెలగాలి.మాతృదినోత్సవం,పితృదినోత్సవం ఒక పాశ్చాత్య సంస్కృతి.ఇది అనాదిగా వస్తున్న మన మానవీయ విలువలను ధ్వంసం చేసే ఆధునిక ప్రక్రియ. బ్రతికుండగానే తల్లిదండ్రులను అప్యాయతతో మనశ్శాంతిగా జీవించే విధంగా తగిన వాతావరణం కల్పించాలి. బ్రతికుండగానే మానసికంగా చంపేసి,చనిపోయాక గొప్పలకోసం శిలా విగ్రహాలు పెట్టి తల్లిదండ్రులను స్మరించడం భావ్యం కాదు. తల్లిదండ్రుల మీద మమకారం లేని వారిని పుట్టలోని చెదలతో పోల్చిన వేమన శతకపద్యం నేటి యువతకు శిరోధార్యం. పొలంలోని కలుపు మొక్కలు పంటకు నష్టం…పెద్దలకు విలువ నీయని యువతరం ధరిత్రికే భారం. సమాజంలో మానవత్వం నశించింది. కుటుంబ వ్యవస్థలో దానవత్వం ప్రబలింది. అడుగడుగునా అమానవీయ కోణం ఆవిష్కరింపబడింది. ఇలాంటి పరిణామాల ఫలితమే మనుషుల మనసులు శిలా సదృశంలా ఘనీభవించడానికి మూలకారణం.కుటుంబ వ్యవస్థలో మమకారాలు నశించాయి.రక్త సంబంధాలు గాడి తప్పాయి. పెద్దల పట్ల గౌరవం సన్నగిల్లింది. మనలో మానవత్వపు ఛాయలు మటుమాయమైన ఫలితమే వృద్ధాశ్రమాల ఆవిర్భావానికి మూలకారణం. మానవీయ విలువలు నేర్పని చదువులు నిరర్ధకం. విదేశీ వ్యామోహంలో,పరిపక్వత లేని ప్రేమల మాయా మోహంలో పడి తల్లిదండ్రులను,పెద్దలను అగౌరవ పరిచే ప్రబుద్ధులు తయారైనారు. తమకోసం అహర్నిశలూ శ్రమించిన పెద్దలను పూచిక పుల్లల్లా తీసిపారేసే నైజం ప్రబలింది. పెళ్లిళ్ళు కాగానే మాయామోహంలో చిక్కుకుని, పెద్దలను ‘ప్రైవసీ’ పేరుతో అత్యంత అమానవీయమైన రీతిలో నిర్లక్ష్యం చేస్తున్న యువతను చూస్తున్నాం.జీవిత చరమాంకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనాథలు గా వదిలివేసే వారు కొందరైతే- తమ అ(నాగరికత) కు సరితూగరనే భ్రమలో, పెద్దలను బలవంతంగా వదిలించుకుని అత్యంత అవమానకరమైన రీతిలో వారిని వృద్ధాశ్రమాలకు తరలించే వారు మరికొందరు.విదేశీ సంస్కృతి ని అలవరచుకుని, మాతృదినోత్సవం- పితృదినోత్సవం అనే పేర్లతో సంవత్సరానికొక సారి మొక్కుబడిగా వారిని పరామర్శించడం అనాగరిక పోకడలకు నిదర్శనం. అవసానదశలో అవయవాలు పనిచేయక ,దిక్కూమొక్కూ లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో దారితెన్నూ దొరకని నైరాశ్యంలో అనాథలై ఆత్మహత్యల పాలౌతున్న అభాగ్యులకు వృద్ధాశ్రమాలే దిక్కవడం కడు శోచనీయం. వృద్ధాశ్రమాలు తిండి పెట్టగలవేమో గాని,తమ స్వంత ఇంట్లో ఉన్న సంతృప్తి వృద్ధాశ్రమాల్లో లభిస్తుందా?తమ కోసం సర్వం త్యాగం చేసి,చివరకు మెడబట్టి గెంటించుకునే దుస్థితి హృదయశల్యమే కదా!అత్తలు,కోడళ్ళు,కూతుళ్ళు,కొడుకులు ఎవరికి వారే స్వార్ధబుద్ధులతో, సంకుచితమైన మనస్తత్వాలతో ప్రవర్తించడం అత్యంత హేయం. కన్నబిడ్డల మీద మమకారం పోరాదు.మానవీయ కోణం మానవ జన్మకు ప్రధానం.ఎన్నో కష్టాలను అనుభవించి,తమ జీవితాలను ధారవోసి,చివరికి కన్నీళ్ళతో చెలిమి చేసి,కఠినాత్ముల చేతుల్లో కాలధర్మం చేస్తున్న వర్తమాన మానవ వికృత చర్యలను చూసి హృదయమున్న,చలనమున్న స్పందించే గుణమున్న ప్రతీ ఒక్కరూ చలించక తప్పదు. ప్రతీ ఒక్కరూ చక్కని వ్యక్తిత్వం కలిగి ఉండాలి.విచక్షణతో కూడిన స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సమర్ధత కలిగి ఉండాలి. ఇతరుల దర్శకత్వంలో నడుస్తూ, భ్రష్టులుగా, అసమర్ధులుగా మిగిలి పోయి,సమాజం దృష్టిలో చులకన కావడం వంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో నేటి ఆధునిక మానవ సమాజంలో చోటు చేసుకుంటున్నాయి.ఇక నైనా మనం మేల్కొని, రేపు మన గతి కూడా ఇంతేనన్న స్ఫృహ తో మెలగవలసిన అవసరం ఎంతైనావుంది. నేటి యువతరమే రేపటి వృద్ధతరమన్న కనీస పరిణితి నెలకొనాలి. విద్యార్ధిదశలోనే పెద్దలను ఎలా గౌరవించాలో, తల్లిదండ్రులను అవసాన దశలో ఎలా సంరక్షించాలో పాఠ్యాంశాలలో చేర్చాలి- నేర్పాలి. ఏడాదికోసారి జరిగే మొక్కుబడి ప్రహసనాలు తల్లిదండ్రుల వేదన కు పరిష్కార మార్గాలు కావు. బిడ్డల భవిష్యత్తు కోసం తపించి,శ్రమించిన తొలి గురువులు జన్మప్రధాతలు. “అలాంటి వారికి ముదిమి వయసులో జరుగుతున్న పరాభవాలు,ఈసడింపులు నీతిబాహ్యమైనవి. చదువుకున్న వారే పెద్దలను గౌరవించక, విస్మరించి,అనాథలుగా అవతలికి గెంటేయడం అత్యంత హేయం. నేటి సమాజంలో అడుగడుగునా ఇలాంటి దృశ్యాలే కనబడుతున్నాయి. ఒక వైపు వార్ధక్యం…మరో వైపు అనారోగ్యం. ఇంకో వైపు ఆర్ధిక బాధలు వెంటాడుతుంటే ఒంటరి జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, బిడ్డలు ఉచ్ఛస్థితిలో ఉన్నా, తిండిలేక భిక్షాటన చేస్తున్న తల్లిదండ్రులెంతో మంది మనకు తారసపడుతున్నారు. కనిపెంచిన వారు క్లేశాలు పడుతుంటే,తన వారిని ఏడిపించి,పరుల చెంత ఢాంబికాలు పోవడ మెందుకు? సమాజంలో గొప్పల కోసం ప్రాకులాడడం ఎందుకు? ఇలాంటి వింత ప్రవర్తనను సమాజం గుర్తిస్తుందా? గౌరవమిస్తుందా? పెద్దలను గౌరవించని చదువులు,ఉద్యోగాలు శుద్ధదండగ. మనిషిని మనిషిగా గౌరవించని అవివేకం వ్రేళ్ళూనుకోవడం దురదృష్టకరం.ఇదొక సామాజిక రుగ్మత.ఇలాంటి రుగ్మతలను నివారించడం నేటి యువత కనీస సామాజిక బాధ్యత. ఈ సందేశాన్ని నేటి యువతరానికి అందించాలి. మనిషి మరణించినా మనిషి ఆశయాలు సజీవంగా బ్రతకాలి.బ్రతుకుతూ మరణించడం కంటే మరణించి జీవించడం మేలు.భావి తరాలకు వెలుగు నిచ్చే అనుభవ పాఠాలు పెద్దల వద్దనున్న నిగూఢమైన అస్తిపాస్తులు. భావితరాలకు ప్రతినిధులైన నేటి విద్యార్థులను సరైన దారిలో తీర్చిదిద్దే విద్యాధనం ఉపాధ్యాయుల వద్ద పుష్కలంగా ఉంది. జీవిత అనుభవాల సారాంశాన్ని ప్రబోధించే విలువైన సంపద పెద్దల వద్ద మెండుగా ఉంది.విద్యార్థులకు సరైన మార్గాన్ని నిర్దేశించి,వారిని క్రమశిక్షణ గల సైనికులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు,గురువులు బాధ్యత తీసుకోవాలి. మనం చెప్పే విషయాలేవీ విద్యార్థుల చెవికెక్కకపోవచ్చు.అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా మన వంతు ప్రయత్నం చేయాలి.మన ప్రయత్నం కాలక్రమంలో సుమథుర ఫలాలనివ్వడం తథ్యం. ఆనాడే తల్లిదండ్రుల పేరుతో జరుగుతున్న మనసులేని మనుషులు జరిపే కృత్రిమమైన ప్రచార ఆర్భాటాలకు స్వస్తి వాక్యం చెప్పగలము. గతించిన వారిని కలలో స్మరించండం కాదు- ఇలలో పూజించాలి. అందరినీ సమాన హృదయంతో ప్రేమించే తత్వం తల్లి తండ్రుల్లో కూడా నెలకొనాలి.ఎదిగిన బిడ్డలు కూడా తల్లిదండ్రుల హృదయాంతరంగాన్ని స్ఫృశించాలి. వారి ప్రేమానురాగాలతో జీవితాన్ని సార్ధకత చేసుకోవాలి.
- సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటి వేషనల్ స్పీకర్ )
మొ:9704903463
చిరునామా:
సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడెం,
తూ.గో.జిల్లా
ఆంధ్రప్రదేశ్