- స్థానిక ఎన్నికలకు,కులగణనకు–హాట్ టాపిక్‌గా మారిన “బీసీ కమిషన్”
- కొత్త కమిషన్ పేరిట ప్రయోగంకు ఇది సమయం కాదు – న్యాయ నిపుణులు
- కొత్త వారితో అవగాహనకు తప్పని మరింత సమయం
- ఎన్నికలకు,కుల సర్వేకు అనివార్యంగా తప్పని జాప్యం-రాజకీయ విశ్లేషకులు
- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాలని పెరుగుతున్న డిమాండ్.
- కుల గణన నిర్వహించి,స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి- బీసీ సంఘాలు
ప్రస్తుతం రాష్ట్రంలో కులగణన నిర్వహించాలి,స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.ఈ అంశంలో జాప్యం జరుగుతున్నప్పటికి,వివిధ వర్గాల ప్రతినిధులు,బీసి,ప్రజా సంఘాలు,రాజకీయ పక్షాల నుండి డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో “బీసి కమిషన్” పాత్ర హాట్ టాపిక్ గా మారింది.వకుళాభరణం కమిషన్‌తో నివేదికనా? లేదా కొత్త కమిషన్ ద్వారా నివేదికను ప్రభుత్వం తీసుకుంటుందా? కుల సర్వే పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలా? ముందే ఎన్నికలా ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించాలని అఖిల పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.బీసి మంత్రి పొన్నం ప్రభాకర్ కుల సర్వే అయ్యాకే ఎన్నికలు అని ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పష్టత కొరవడడంతో ఈ అంశాలపై గడిచిన కొన్ని రోజులుగా పత్రికలలో ప్రధాన శీర్షికలతో వార్త కథనాలు,టీవీలలో ప్రత్యేక చర్చా కార్యక్రమాల ప్రసారాలు జోరందుకున్నాయి.ఇదిలా ఉండగా వకుళాభరణం కమిషన్ పదవి కాలం గడువు ఆగస్ట్ 31తో ముగిసింది.కొత్త వారిని కమిషన్ చైర్మన్,సభ్యులుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.వకుళాభరణం కమిషన్ గత మూడేళ్ళుగా ఈ అంశాలపై విశేషంగా అనుభవం గడించింది.నిబద్దతగా కృషి చేసింది.ఈ కమిషన్‌కు మరో 06 నెలల గడువును పొడగించినట్లైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం నియమించిన వారిని కొనసాగించడానికి ఇష్టపడకపోతే,కొత్తగా బీసి కమిషన్‌ను ఏర్పాటు చేయాలి అనుకుంటే,అనుభవజ్ఞుడైన వకుళాభరణం విషయంలో పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని,ఆయనకు చైర్మన్ గా అవకాశం కల్పిస్తూ,ముగ్గురు కొత్త సభ్యులతో కొత్త కమిషన్ పునరుద్దరణ చేస్తే సరిపోతుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అలాంటప్పుడు నివేదికలు సమర్పించడం సులువు అవుతుందని,ఇప్పటికే పలువురు మంత్రులు,పార్టీ సీనియర్లు,ఉన్నతఅధికారులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి ముందు స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రంలో ఇప్పటికే గ్రామపంచాయతీల పాలక మండలాలకు గడువు ముగిసి ఏడు నెలలు అవుతుంది.మండల పరిషత్,జిల్లా పరిషత్‌లకు కూడా గడువు జూలై నెలలో ముగిసింది.వచ్చే ఏడాది జనవరిలో మున్సిపాలిటీల గడువు ముగుస్తుంది.అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్దపడటం లేదనే సర్వత్ర విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది.గ్రామ పంచాయతీలకు ఎన్నికల జాప్యం కారణంగా కేంద్రం నుండి నిధుల విడుదలను నిలుపుదల చేసింది.మిగతా స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు సకాలంలో నిర్వహించని ఎడల వాటికి కూడా కేంద్రం నుండి నిధులు నిలిచిపోతాయి.
గ్రామాలలో ఇప్పటికే పాలన పడకేసింది.ఎక్కడికక్కడ చెత్తాచెదారం తొలగించేవారు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక తల్లడిల్లిపోతున్నారు.స్పెషల్ ఆఫీసర్ల పాలనతో జవాబిదారితనం లేకుండా పోయింది.ప్రజలు ప్రతిరోజూ ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.వెరశి ప్రభుత్వంపై నిరసన సెగలు క్రమంగా పెరుగుతున్నాయి.ఎన్నికల జాప్యంతో తమకు పోటీ చేసే అవకాశం ఎంతకు రాకపోవడంతో పార్టీ కార్యకర్తలలో కూడా రోజురోజుకు నిరాశ,అసహనం పెరిగిపోతున్నదని,ఇలాంటి పరిస్థితులు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పరిణామం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాగా ప్రస్తుతం కీలకంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలలో 42 % రిజర్వేషన్ల అంశంలో సమగ్రంగా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.సమగ్ర నివేదికలు ఎంత అవసరమో,భవిష్యత్ లో ఉత్పన్నమయ్యే న్యాయ సమస్యలను కూడా అధిగమించడం అంతే అనివార్యమైనది.ఇలాంటి నేపధ్యంలో వకుళాభరణం కృష్ణ మోహన్ లాంటి నిపుణుడు బీసి కమిషన్ చైర్మన్ గా కొనసాగడం అవసరమని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.