మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నెల 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) 05 గ్యారంటీలతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం ముంబయిలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆ రాష్ట్రంలోనీ మహిళలకు నెలకు రూ.3000 ఆర్థిక సాయం, ఒక్కో పేద కుటుంబానికి ఏడాదికి రూ.3 లక్షల ఆర్థిక ప్యాకేజీ, మహిళా సాధికారత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు 06 గ్యాస్ సిలిండర్లు, మహిళాల భద్రతకు పటిష్టమైన చట్టాలు, 09-16 ఏళ్లలోపు బాలికలకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, మహిళలకు ప్రతి నెల రెండు రోజులు పీరియాడ్ లీవ్ వంటి హామీలను మేనిఫెస్టోలో పొందపరిచారు.
అదే విధంగా సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రూ.50,000 ఆర్థిక ప్రోత్సాహకం, పంటలకు సరైన మద్దతు ధర, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 పెన్షన్, విద్యార్థులకు స్కాలర్షిప్ పథకాలు, కుల గణన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు వంటి హామీలను మేనిఫెస్టోలో చేర్చారు.