- ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా ను
కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర హోంశాఖ అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యలు, రాష్ట్రానికి ఐపీఎస్ ల కేటాయింపు వంటి పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ. 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కోరారు. వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది మృతి చెందారని, లక్షకుపైగా పశువులు, ఇతర మూగ జీవాలు మృతి చెందాయని తెలిపారు. 4.15 లక్షల ఎకరాల్లో పంటతో పాటు రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి ఆ జాబితాలో చేర్చాలని కోరారు. అదే విధంగా తెలంగాణ పోలీస్ శాఖలో కొత్తగా నియమితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో శిక్షణ ఇప్పిస్తున్నమని, అందుకోసం అవసరమైన అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.