- సీఎం రేవంత్ రెడ్డి
2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి మద్దతుగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటింగ్ లో పాల్గొన్నది నిజం కదా అని ప్రశ్నించారు.అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల రద్దును స్వాగతించారని అన్నారు.గొప్ప నిర్ణయమని పొగడ్తలతో ముంచెత్తింది బీఆర్ఎస్ కదా అని నిలదీశారు.రాష్ట్రపతి ఎన్నిక,ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి అండగా నిలబడింది బీఆర్ఎస్ పార్టీ కదా అని ప్రశ్నించారు.అన్నిట్లో బీజేపీకి మద్దతు పలికి ఇప్పుడు పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ట్రిపుల్ తలాక్ విషయంలోనూ బీజేపీకి అనుకూలంగా ఉండేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని,రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో కూడా బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు.సాగు చట్టాల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అండగా నిలిచిందని గుర్తుచేశారు.కేంద్రం నుంచి నిధులు కాదు,మోదీ ప్రేమ ఉంటే చాలని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారని అన్నారు.ఆదానీ,అంబానీలతో చీకట్లో కుమ్మక్కు అయ్యే అవసరం మాకు లేదని పేర్కొన్నారు.రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పాలన అని విమర్శించారు.