Thursday, April 3, 2025
spot_img

చదువు భుక్తి కోసం మాత్రమే కాదు

Must Read

చదువు కేవలం మార్కుల, ర్యాంకుల కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుంది. కష్టపడి చదవడం కన్నా ఇష్టపడి చదివితేనే విషయం ఎక్కువ కాలం గుర్తుండిపోతుందన్న వాస్తవాన్ని నేటి విద్యార్థులు గమనించలేక పోతున్నారు. మన దేశంలోని విద్యార్థులకు సరైన విజ్ఞానం అందించలేకపోవడంతో, వారు ఇతర దేశాల్లో ఉత్పత్తి అయ్యే పరిజ్ఞానంపై ఆధారపడవలసి వస్తుంది. దీని వల్ల మన డిజిటల్ రంగం పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. మౌలిక సదుపాయాల కొరత, బోధనలో నాణ్యత లోపించడం లాంటి అనేక ఇతర సమస్యలు నూతన ఆవిష్కరణలకు అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. మన దేశంలో ఎంతమంది విద్యావేత్తలు ఉన్నా.. కొందరి చదువు దేశానికి, ఇరుగుపొరుగు వారికి ఉపయోగపడడం లేదనడంలో సందేహం లేదు. అయితే తాము నేర్చుకున్నది సమాజానికి, పదిమందికి ఉపయోగపడేలా చదువుకునే వారు కొందరైతే, నేర్చుకున్న ప్రతి అక్షరం కొత్త ఆవిష్కరణల కోసమే అన్నట్లుగా సంకల్ప బలం ఉన్నవారు మరికొందరు. అలాంటి వారిలో ముంబై ఐఐటీకి చెందిన సుశీల్ రెడ్డి ఒకరు.

సుశీల్ IIT బాంబే పూర్వ విద్యార్థి 2008 – 2013 బ్యాచ్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. సోలార్ ఎనర్జీ గురించి అధ్యాపకులు చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అవగతం చేసుకుని సూర్యుని శక్తి యొక్క అద్భుతాల గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలియజేయాలనే సంకల్పంతో సౌరశక్తి పై తనకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు బొంబాయిలోని సోలార్ స్టార్టప్‌లో రెండేళ్లపాటు పనిచేశాడు. అతను అక్కడ ఉన్న సమయంలో భారతదేశంలో సౌరశక్తి యొక్క అవగాహన పై అనేక అంతర్దృష్టులను పొందారు. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు మరియు ఎలక్ట్రిక్ వాహనాలలో సాధారణంగా ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ లు కూడా విషపూరితమైనవని కొద్ది మందికి తెలుసు. ఈ రెండు మానవాళికి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయని గ్రహించి సుశీల్, భవిష్యత్తును పర్యావరణ అనుకూలమైనది మరియు కాలుష్య రహితంగా మార్చాలనే విప్లవాత్మక ఆలోచనలో భాగంగా 2016లో “ది సన్‌పెడల్ రైడ్” అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. ఈ ప్రాజెక్ట్ పెట్రోల్, డీజిల్ లేదా బ్యాటరీ ని ఉపయోగించకుండా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్. ప్రారంభ దశలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నం చేసి విజయం సాధించాడు. ప్రాజెక్ట్ యొక్క మొదటి ప్రయాణం పాక్షికంగా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్‌పై భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ స్థానికులతో సంభాషిస్తూ పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో సౌరశక్తి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ 79 రోజులలో 7000 కిలోమీటర్లు ప్రయాణించారు. భారతదేశంలోనే కాకుండా 2017లో ఫ్రాన్స్‌లో 30 రోజుల్లో 2000 కి.మీ ప్రయాణం, అదే సంవత్సరంలో USA లోని కాలిఫోర్నియాలో 15 రోజుల్లో 1500 కి.మీ, 2021-2022 లో USA లో 150 రోజులలో 11,800 కిమీ ప్రయాణించి ప్రపంచ స్థాయిలో అనేకమందికి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్ పై పూర్తి అవగాహన కల్పించారు. అతనికి అంతర్జాతీయ గుర్తింపు రావడమే కాకుండా సౌరశక్తితో నడిచే సైకిల్‌పై సుదీర్ఘ ప్రయాణం చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సంపాదించాడు, ఆ తర్వాత సోలార్ సైకిల్‌పై సుదీర్ఘ ప్రయాణం చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు.

పెట్రోల్,డీజిల్ వాడకం వల్ల పర్యావరణానికి హాని:

పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పర్టిక్యులేట్ పదార్థం వంటి వాయువులు విడుదలై పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా మానవులలో ఊపిరితిత్తులు మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవడం గాక హానికరమైన UV-కిరణాలు వాతావరణంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఓజోన్ పొరను కూడా దెబ్బతీస్తుంది. అధిక పెట్రోల్, డీజిల్ వాడకం వల్ల విపరీతమైన ఖర్చు పెరుగుతుంటుంది దాంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పర్యావరణానికి హానికరం.

ఎలక్ట్రిక్ వాహనాలు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణంగా బ్యాటరీ సౌకర్యంతో పనిచేస్తాయి. ఈ బ్యాటరీ లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ లు కూడా విషపూరితమైనవని కొంత మందికి తెలుసు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ మరియు డీజిల్ ధర కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, బ్యాటరీ ల నుండి లిథియం, కోబాల్ట్, నికెల్ మరియు మాంగనీస్ వంటి పదార్థాలు విడుదల చేయడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది, వాటిని సరిగ్గా పార వేయకపోతే మానవ ఆరోగ్యం, వన్యప్రాణులు మరియు పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నప్పటికీ ఫలితం అంతంత మాత్రమే. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు అంటుకున్న సందర్భాలు భద్రతా సమస్యలను ఏర్పడుతునే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ప్రభుత్వం ఈవీ లలో ఉపయోగించే బ్యాటరీల కోసం కొత్త నాణ్యత నియంత్రణ చర్యలు చేపట్టింది. అయినా సరే కొన్నిచోట్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పర్యావరణం తో పాటు, ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగిస్తుంది.

సుశీల్ రెడ్డి సోలార్ సైకిల్ ప్రదర్శన:

ఈ సైకిల్ ని తొక్క వలసిన అవసరం లేదు. సౌర ఫలకాల ద్వారా సూర్యుని నుండి గ్రహించబడిన సౌర శక్తి ని విద్యుత్ శక్తి గా మార్చి మోటార్ సహాయంతో పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి పర్యావరణ కాలుష్యం, శబ్దం ఉండదు. ఈ విద్యుత్ ను సెల్‌ఫోన్లు, బల్బులు లకూ కూడా ఉపయోగించుకోవచ్చు. సైకిల్ కు అమర్చే సోలార్ పీవీ ప్యానెళ్ల సహాయంతో డీసీ బ్యాటరీ సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను గ్రహిస్తుంది. దానితో సైకిల్ వెనుక చక్రానికి అమర్చిన డీసీ మోటార్ పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ అయితే 50-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎండ బాగా ఉన్న చోట ఒకేసారి 60 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. సోలార్ ఎనర్జీ వాడటం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా విద్యుత్తును పొందే అవకాశం ఉంటుంది.

సౌరశక్తి ఉపయోగాలు:

సోలార్ ఉత్పత్తుల ధర ఎక్కువగా ఉండటం మరియు సౌర విద్యుత్ గురించి తెలియకపోవడంతో చాలా మంది ఈ ఉత్పత్తులను వినియోగించడం లేదు. ఈ ఉత్పత్తుల గురించి ప్రజలలో ప్రత్యేక అవగాహన కల్పించినట్లయితే ప్రతి ఒక్కరు సౌర విద్యుత్ ను వినియోగించడానికి ఇష్టపడుతారు. ఇప్పకే వివిధ రకాల సౌర ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయన్న విషయం అతికొద్ది మందికి తెలుసు. వీధిలైట్లు, ఇంటి లైటింగ్ సిస్టమ్స్, వాటర్ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అపార్ట్‌మెంట్లలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇందుకోసం న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీలు మీ అపార్ట్ మెంట్ ను పరిశీలించి ఎన్ని వాట్ల విద్యుత్ అవసరమో అంచనా వేసి అందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలియజేస్తారు తర్వాత ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఒక కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. సోలార్ ఎమర్జెన్సీ లైట్‌ను 6 గంటల పాటు ఎండలో ఉంచితే మూడు గంటల పాటు బల్బు నిరంతరం వెలుగుతుంది. రాత్రిపూట అకస్మాత్తుగా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు వాటిని దీపాలుగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా సోలార్ హీటర్, ఇన్వర్టర్లు కూడా ఎంతో ఉపయోగపడతాయి.

పర్యావరణ కాలుష్యం నివారించాలంటే ప్రభుత్వం సౌర విద్యుత్ వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిన అవసరముంది. అందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి.

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎందరో భారతీయులు విదేశాల్లో సెటిలవుతున్నారు. కానీ ముంబై ఐఐటీకి చెందిన సుశీల్ రెడ్డి మాత్రం మాతృదేశం లోనే ఉంటూ మన దేశ గొప్పతనాన్ని విదేశాలలో ప్రచారం చేయడం గర్వించదగిన విషయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS