(ఉత్తుత్తి నోటీసులు ఇచ్చి..చేతులు చాపిన ఇరిగేషన్ అధికారులు)
- జెర్ర వాగును కాపాడండి… సారు.! అనే శీర్షికతో ఆదాబ్ లో వార్త
- రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు
- మిగులు భూమిని కబ్జా చేసిన సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ
- పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు
- ఆదాబ్ వార్తతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం
- సుభిషి కంపెనీకి ఇరిగేషన్ ఏఈ గోవింద్ నాయక్ పూర్తి సహకారం
- ఎన్ఓసీ లేకుండా వాగులో అడ్డుగా అక్రమంగా నిర్మాణాలు
- చర్యలు మరిచిన మహేశ్వర మండల ఇరిగేషన్ అధికారులు
జెర్ర వాగును కాపాడండి… సారు.! అనే శీర్షికతో ఆదాబ్ లో బుధవారం (10వ తేదీ) నాడు పత్రికలో వార్త ప్రచురణ చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం కదిలింది.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామ పరిసరాల్లో నల్లచెరువు నుంచి చౌటకుంట కు వాగు ప్రవహిస్తూ వయా పాల్మాకుల్ లోకి ప్రవహిస్తుంది. ఓవర్ ఫ్లో అయితే ఇక్కడి నుండి హిమాయత్ సాగర్‌లోకి ప్రవహిస్తుంది. అయితే ఏండ్లుగా ఉన్న సాగునీటి కాల్వ కబ్జాకు గురైంది. సుభిషి గ్రూపు ఆఫ్ కంపెనీ (రియల్ ఎస్టేట్) పెద్ద మొత్తంలో పంట పొలాలు కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా మార్చి భూములు సేల్ చేస్తున్నారు. అందులో భాగంగా పక్కనే ఉన్నా పంటపొలాలకు వెళ్ళే సర్వే నెంబర్. 62/అ, 76/అ లో ఉన్న సాగునీటి కాల్వను కబ్జా చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న మిగులు భూమి సుమారు రెండు నుండి మూడు ఎకరాలను కూడా కబ్జా చేయడం జరిగింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఆదాబ్ లో క్లీయర్ గా ప్రచురించడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామ పరిధిలో నల్లచెరువు నుండి చౌటకుంట సుభిషి వరకు వచ్చే వాగుకు చివరి బౌండరీ మట్టితో కూడిపి, తర్వాత ఎగ్జిట్ బౌండరీ నుండి వాగు కొనసాగుతుంది. ఈ మధ్యలో మట్టితో వాగును పూడ్చివేశారు. ఇరిగేషన్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా 30 పీట్ల వరకు వాగు వెళ్లే విధంగా నిర్మాణ పనులు చేపట్టారు. ఆదాబ్ లో వచ్చిన కథనానికి ఇరిగేషన్ ఏఈ గోవింద్ నాయక్ పరిశీలించారు. అక్రమంగా వాగుకు అడ్డుగా నిర్మాణం చేపట్టిన వారితో రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇస్తాం.. దానిని బట్టి నిర్మాణం చేపట్టండి అని సుభిషి గ్రూప్‌కు హామీ ఇచ్చారు. మండల సర్వేయర్ అందరికీ నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా సర్వే చేసి ప్రైవేట్ సంస్థకు లాభం చేకూర్చే విధంగా సర్వే చేయడంపై గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వాగును పూడ్చివేయడంపై, నిర్మాణ పనులు చేపట్టడంపై ఇరిగేషన్ అధికారి ఏఈ గోవింద్ నాయక్ ప్రశ్నించక పోవడం శోచనీయం.
అంతేకాకుండా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సుభిషి నిర్మాణ సంస్థకు ఏఈ గోవింద్ నాయక్ నోటీసులు ఇచ్చి నెల రోజులు గడుస్తున్న యధావిధిగా పనులు కొనసాగుతున్నాయి. నోటీసులు ఇచ్చి, నిర్మాణ సంస్థ నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకొని, నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఎన్‌ఓసీ జారీ చేయలేదు. నిర్మాణ సంస్థ అప్లికేషన్ పెట్టుకున్నారని ఏఈ గోవింద్ నాయక్ ఆదాబ్ కు వివరించారు. అప్లికేషన్ ఇచ్చినంత మాత్రాన నిర్మాణ సంస్థకు ఎన్ోసీ జారీ చేసినట్లు కాదు కదా..? అలాంటప్పుడు నిర్మాణ పనులు ఎలా కొనసాగుతున్నాయి. నోటీసులు జారీ చేసిన అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేదు. రెండు, మూడు రోజుల్లో ఎన్‌ఓసీ ఇస్తామని నిర్మాణ సంస్థకు తెలుపడంతో ఇరిగేషన్ శాఖ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. స్థానికుల నుండి ఫిర్యాదులు అందుతున్న ఇరిగేషన్ అధికారులు ఎన్‌ఓసీ ఎలా ఇస్తారు అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు.
నోటీసులు అందలేదు.. సర్వే ఎలా చేశారు :
మహేశ్వరం మండలంలోని మండల సర్వేయర్ తో కాకుండా ప్రైవేట్ సర్వేయర్‌తో సర్వే చేయించడం వెనుక ఆంతర్యం ఏంటి..? సర్వే నెంబర్లు 30, 55, 56, 60, 61, 62, 76 చుట్టూ ఉన్న సుదర్శన్, జి. రవి, భిక్షపతి, వి. శంకరయ్య, ఎం. చంద్రయ్య, తిరుపతి లకు మాత్రమే నోటీసులు జారీ చేశారు. కానీ సర్వే నెంబర్ 59 లోని వి. రాఘవేందర్, వి. శ్రీనివాస్ ( లేట్ వి. పుల్లయ్య), వి. శ్రవణ్‌కుమార్, వి.శ్రీనివాస్, వి. మధుసూదన్ గౌడ్ లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తుతుంది. సర్వే నెంబర్ 62, 76 లో మిగులు భూమి 2 నుండి 3 ఎకరాల వరకు ఉంటుంది. ఈ విషయంపై సర్వేయర్ స్పష్టత ఇవ్వకుండా సర్వే అయినట్లు తెలపడం గమనార్హం. ఈ మిగులు భూమి సుభిషి వారు అక్రమించారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మిగులు భూమితో గ్రామ పంచాయతీ సంక్షేమంకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవహారంపై కలెక్టర్ జ్యోకం చేసుకొని తిరిగి సర్వే చేయించాలని, అదేవిధంగా కబ్జాకు గురవుతున్న వాగును కాపాడాలని స్థానిక గ్రామస్థులు కోరుతున్నారు.