తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య “హైడ్రా” ( హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఎచ్.ఎం.డి.ఏ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండడంతో చెరువుల పరిరక్షణ అనే అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది.దాదాపు 200 కట్టడాలను కూల్చివేయడం,అందులో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ కూడా ఒకటి కావడంతో ఈ విషయం బాగా చర్చనీయాంశమైంది.రెవెన్యూ,ఇరిగేషన్,మున్సిపల్ అధికారుల నుండి వందలాదిమందికి ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు అందుతున్నాయి. తెల్లారే సరికే ఇండ్లు నేలమట్టం అవుతున్నాయి.ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.ఏదైనా ఆపద వస్తే పోలీసులను ఆశ్రయిస్తారు ప్రజలు. కానీ వందలాది మంది పోలీసులే దగ్గరుండి మరీ ఇండ్లను కూల్చివేయిస్తుంటే ఎక్కడికెళ్లాలో,ఎవరితో చెప్పుకోవాలో తెలియని ప్రజలు గుండెలు బాదుకుంటుంన్నారు.
ఒకసారి నేపథ్యంలోకి వెళ్తే,పూర్వ కాలంలో ప్రజలు వాగులు,చెరువుల వద్ద నివాసం ఉండే వారు.ఎందుకంటే మనిషి బ్రతకడానికి గాలి తరువాత కావాల్సింది నీరు.నీరు లేకుండా ఒక్కరోజు కూడా గడవదు.చెరువులు,కుంటలు,వాగులు ప్రజలకు తాగు నీరు,సాగు నీరు అందించడంతో పాటు మానవ జీవనానికి అవసరమయ్యే బహుళ ప్రయోజనాలు చేకూరుస్తాయి.చెరువులు ఎండిపోయి కరువు కాటకాలతో ప్రజలు చనిపోయి ఊళ్లకు ఊళ్లే నిర్మానుష్యమైన ఉదంతాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి.తరువాతి కాలంలో ప్రాపంచీకరణ,పారిశ్రామికీకరణ నేపథ్యంలో క్రమక్రమంగా నగర జనాభాలు పెరుగుతుండడం,తదునుగుణంగా నిర్మాణాలు చేపట్టడం అదే క్రమంలో చెరువులు,నీటి కుంటలు వాటి ఉనికిని కోల్పోవడం మొదలైంది.వాటి సంఖ్యతో పాటు వాటి విస్తీర్ణాలు కూడా తగ్గిపోయాయి.చెరువుల స్థానంలో మంచినీటి బావులు,వ్యవసాయ బావులు కొంతకాలం నడిచాయి.ఆ తరువాత అవి బోర్లుగా మారిపోయాయి.
గతంలో తెలంగాణా ప్రాంతంలో సుమారుగా 3800 చెరువులు ఉండేవని చెప్తున్నారు.వాటిలో దాదాపుగా 3000 చెరువులు అదృశ్యమైపోయాయి.ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా అన్ని చెరువులు ఉండేవా అని అనిపిస్తుంది కదా.అవును మరి ఆ కాలంలో నీటి అవసరాలు తీర్చడానికి అవే కదా ఆధారం.వర్షపు నీటితో చెరువులు నిండితేనే మానవ మనుగడ సాధ్యమయ్యింది.ఇప్పుడైతే చెరువులు, కుంటలు తగ్గిపోవడంతో వాన నీళ్లు వృధాగా పోతున్నాయి.నీటి నిల్వలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి కొరత ఏర్పడుతున్నది.పైగా కొద్దిపాటి వానలకే హైదరాబాదు నగరం పూర్తిగా చెరువులా మారిపోతుంది.గత ప్రభుత్వాలు సరియైన ప్రణాళికలు రచించని కారణంగా విచ్చలవిడిగా వెలసిన కట్టడాలు నీటి ప్రవాహానికి అడ్డుపడి నగరవాసులకు చాలా తలనొప్పిగా మారుతున్నది.ప్రభుత్వాలు వరదలొచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప వరదల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించే శాశ్వత మార్గాలను వెతకడంలేదు.అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను ఆక్రమించిన అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
అయితే ఈ అక్రమ కట్టడాలుగా పరిగణిస్తున్న వాటిని తొలగించే విషయంలో ప్రభుత్వానికి కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి.ఒకవైపు హైడ్రా కూల్చివేతలను కొంతమంది ప్రశంసిస్తున్నప్పటికీ మరోవైపు విమర్శలూ వెల్లువెత్హుతున్నాయి.హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించుకొని కట్టిన వేలాది ఇళ్లను,అపార్టుమెంట్లను కూల్చివేయడం సాధ్యమా. ఒకవేళ కూలిస్తే వాటిలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైతే వారి భవిష్యత్తు ఏమిటి.వారు ఆ ఇళ్ల పై వెచ్చించిన డబ్బు ఎవరు తిరిగి ఇస్తారు.వారు నష్టపోవాల్సిందేనా. వారికి పునరావాసాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. రెసిడెన్షియల్ లే అవుట్లలో ఇళ్లు కట్టుకుందామని స్థలం కొనుక్కున్నవారు ఇప్పుడు అవి ఎఫ్. టి.ఎల్. మరియు బఫర్ జోన్ లో ఉన్నాయి కాబట్టి వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు అంటే మరి ఆ లే అవుట్లకు ప్రభుత్వం అనుమతులు ఎందుకు ఇచ్చినట్టు.
ఎఫ్.టి.ఎల్. (ఫుల్ ట్యాంక్ లెవల్) మరియు బఫర్ జోన్ అనే మాటలు ఇప్పుడు అందరికీ కొత్తగా వినబడుతున్న పదాలు.ఎఫ్.టి.ఎల్. అంటే చెరువు పూర్తిగా నిండినప్పుడు దాంట్లోని నీటిమట్టం ఎత్తు.బఫర్ జోన్ అంటే ఎఫ్.టి.ఎల్.చుట్టూ కొన్ని మీటర్ల వరకు ( చెరువు విస్తీర్ణాణ్ణి బట్టి) వ్యాపించి ఉన్న స్థలం.వీటిలో వ్యవసాయం చేసుకోవాలి తప్ప ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు.మరి అలాంటి పరిస్థితుల్లో వాటిలో నిర్మాణాలకు ప్రభుత్వం పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి.ఆ నిర్మాణాలకు దశాబ్దాల పాటు ఇంటిపన్ను,ఎలక్ట్రిసిటీ, ఫోన్ మరియు ఇతరత్రా పన్నులు ఎందుకు వసూలు చేశారు.ఇప్పుడు అవి ఉన్నట్టుండి అక్రమ నిర్మాణాలు ఎలా అయ్యాయి.దీనికి ఎవరు బాధ్యులు. సంవత్సరాల తరబడి మధ్యతరగతి జీవులు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న స్థలాలు,కట్టుకున్న ఇళ్లు వ్యర్ధమేనా. వారి బతుకులు చిద్రమేనా. ఇక పాత హైదరాబాద్ నగరం విషయానికి వస్తేనగరంలో సగానికి పైగా నాలాల మీద నిర్మించబడింది అని వాటి ఆనవాళ్లు తెలిసిన వారు చెబుతున్నారు.ఇది నిజమే అయితే మరి వాటి ప్రక్షాళన నిజంగా సాధ్యమా. ఇవన్నీ కూడా నివాసాలు కోల్పోయిన మరియు కోల్పోబోతున్న వారి ఆవేదన.
ఒక్క విషయం ఆలోచించండి. ఒకప్పుడు ప్రజలకు జీవనాధారంగా ఉన్న వేలాది చెరువులు మాయమైనప్పటికీ ప్రస్తుత ప్రజాజీవనం ఎలా నడుస్తుంది. రాష్ట్రాలు, దేశం అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి కదా. అంటే నీటి వనరుల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పడ్డాయన్నమాటే కదా. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేపటి ప్రజా జీవనం ఎలా ఉండాలి అనే విషయంలో మేధోమధనం జరగాలి. మనదేశంలో మేధావులకు కొదువ లేదు. ఇప్పుడున్న చెరువులను పరిరక్షించుకోవడంతో పాటు ఇతర మార్గాలూ వెతకాలి . ప్రతి నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి వాటిని అధ్యయనం చేయాలి.చెరువులను కాపాడాలని సుప్రీంకోర్టుసూచించిన విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే అయినప్పటికీ మానవతా కోణంలో కూడా ఆలోచించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, ప్రజల ఆస్తి నష్టం జరుగకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నది ప్రజల అభ్యర్థన .
డా.రవిశంకర్ ప్రజాపతి
ఇ.ఎన్.టి.స్పెషలిస్ట్
9440768894