Friday, September 20, 2024
spot_img

ప్ర‌భుత్వ భూమిలో అక్రమ నిర్మాణం

Must Read

స‌ర్కార్ భూమిలో య‌ధేచ్ఛ‌గా నిర్మాణాలు చేప‌డుతున్న భూ ఆక్ర‌మ‌దారుడు ఎం. రోహిత్‌రెడ్డి

  • ముడుపులు తీసుకొని అనుమ‌తులిచ్చిన అప్ప‌టి సిటీ ప్లాన‌ర్
  • సర్కారు భూమిని ఎన్‌క్రోజ్‌మెంట్ చేసినందుకు నోటీసుల‌చ్చిన ఎమ్మార్వో గౌత‌మ్‌కుమార్
  • ఏపీ లాండ్ యాక్ట్ ఎన్‌క్రోజ్‌మెంట్ 111/1905 ప్రకారం చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఎమ్మార్వో వార్నింగ్
  • ఎఫ్ఐఆర్ నమోదైనా.. చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని పోలీసులు, రెవెన్యూ శాఖ‌
  • గవర్నమెంట్ భూమిని కాపాడ‌లేని ఉప్ప‌ల్ త‌హ‌సిల్దార్‌
  • అవినీతికి పాల్ప‌డ్డ రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల‌పై చ‌ర్య‌లకు డిమాండ్‌

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అయినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ సపోర్ట్ తో కొందరూ రెచ్చిపోతున్నారు. ‘దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు’ అవినీతి అధికారులకే పెద్ద పోస్టులు రావడం.. వాళ్లూ రాజకీయ, డబ్బు పలుకుబడి ఉన్నోళ్ల వద్ద నుంచి మాముళ్లు తీసుకొని ఇట్టే పనిచేసి పెట్టడం సర్వ సాధారణం. తెలంగాణలో కొంద‌రి ప్ర‌భుత్వ అధికారుల అవినీతి అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తుతున్నారు. ‘నాది కాదు.. నా అత్త గారి సొమ్ము కదా నాకేంది’ అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఉంటుంది.

పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ మూడు శాఖల అధికారులు అక్రమార్కులతో అంటకాగుతూ ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. తహసిల్దార్ ఆఫీస్ నుంచి సెక్రటరియేట్ వరకు, జోనల్ ఆఫీస్ నుంచి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వరకు తెలిసి కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే వాళ్లను టచ్ చేయలేకపోవడం గమనార్హం. ఉప్పల్ కల్సలో ప్ర‌భుత్వ భూమిలో అక్ర‌మంగా అనుమ‌తులు తీసుకొని య‌దేచ్ఛ‌గా 7అంతస్తుల భ‌వ‌నం 90శాతం ప‌నులు పూర్తి అయ్యే వ‌ర‌కు ప్ర‌భుత్వ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు.

పూర్తి వివరాల్లోకి వెళితే… మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలం లక్ష్మీ నారాయణ కాలనీ, ఉప్ప‌ల్‌ కల్స లో గ్రామంలోని సర్వే నెంబర్ 581/01లో రెవెన్యూ రికార్డు ప్ర‌కారం పూర్తి విస్తీర్ణం 217 ఎక‌రాల 34 గుంట‌లు ఉంది. త‌న భూమికి ఆనుకొని ఉన్న ప్ర‌భుత్వ భూమిని మురుగంటి రోహిత్ రెడ్డి.. సుమారు 28గుంట‌ల స్థ‌లాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆక్ర‌మించేసుకున్నాడు. అయితే ఈ విషయంపై స్థానిక ప్ర‌జ‌లు ఉప్ప‌ల్ త‌హ‌సిల్దార్‌, మేడ్చ‌ల్ మల్కాజ్ గిరి జిల్లా క‌లెక్ట‌ర్‌కు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన అప్పటి జిల్లా క‌లెక్ట‌ర్… ఉప్ప‌ల్ త‌హసిల్దార్‌కు భూ ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. క‌లెక్ట‌ర్ ఆదేశాల ప్ర‌కారం తేది. 31 మార్చి 2022న లెట‌ర్ నెంబ‌ర్ నెం.బి/95/2013 నోటీస్ అండ‌ర్ సెక్ష‌న్ 7, ఏపీ లాండ్ యాక్ట్ ఎన్‌క్రోజ్‌మెంట్ 111/1905 ప్రకారం ఎం. రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయ‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసినందుకు వారిపై జరిమానా, సామాగ్రి జ‌ప్తు, చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోబ‌డున‌ని నోటీసు ఇవ్వ‌డం జ‌రిగింది. అప్ప‌టి ఎమ్మార్వో గౌత‌మ్ కుమార్, రోహిత్ రెడ్డికి స‌హ‌క‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు సైతం ఉన్నాయి.. ఎమ్మార్వో గౌత‌మ్ కుమార్ పూర్తి స‌హ‌కారం అందించ‌డంతో బ‌రితెగించిన‌ ఎం. రోహిత్ రెడ్డి ప్ర‌భుత్వ స్థ‌లంలో జీహెచ్ఎంసీ అధికారుల‌కు ముడుపులు అప్పగించి, ఇచ్చి స్టిల్ +7కు అనుమ‌తులు తీసుకోవ‌డం, శ‌ర‌వేగంగా నిర్మాణ ప‌నులు పూర్తి చేయ‌డం జ‌రుగుతోంది…

సర్వే నెం. 584లో 2021 సంవ‌త్స‌రంలో నిర్మాణం కోసం ఎం. రోహిత్ రెడ్డి అనుమ‌తులు తీసుకున్నాడు. కానీ, సర్వే నెం. 581/01లో సుమారు 28 గుంటల ప్ర‌భుత్వ స్థ‌లంలో నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఈ నిర్మాణ ప‌నులు చేప‌డుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ప‌లు అనుమానాలు తలెత్తుతున్నాయి. అప్పటి అధికారులు సదరు యజమాని వద్ద ఎన్ని కోట్లు తీసుకున్నారో అని ఆరోప‌ణ‌లు సైతం వెల్లువెత్తున్నాయి.. గవర్నమెంట్ ల్యాండ్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణంపై ఓ సామాజిక కార్య‌క‌ర్త ఆర్టీఐ ద్వారా స‌మాచారం తీసుకోవ‌డంతో ఈ అవినీతి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది.. నిర్మాణం చేప‌డుతున్న స్థ‌లం ప్ర‌భుత్వ భూమిగా నిర్దార‌ణ కావ‌డం జ‌రిగింది.

కాగా, దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉప్ప‌ల్ తహాసిల్దార్, జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. మరోవైపు అప్పట్లో దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ మూడు శాఖలు సదరు వ్యక్తికి వంతపాడుతున్నాయి. మరోవైపు ఇదీ ధరణిలో కూడా గవర్నమెంట్ ల్యాండ్ గా చూపిస్తుంది. మీరు ఎవరికి చెబుతారో చెప్పుకోండి అంటూ ఉప్పల్ బగాయత్ ఓనర్స్, బిల్డర్స్ స్థానిక ప్రజలపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది.

మావద్దకు ఎవరూ రారు.. మా నిర్మాణాలను అడ్డుకునే అధికారి ఎవరూ లేరంటూ.. అంద‌రికి ముట్ట‌జెప్పాల్సిన‌వి ముట్ట‌జెప్పాం.. బ‌హిరంగంగానే చెప్ప‌డం వెనుక అధికార‌ల నిర్లక్ష్యం వ‌హించ‌డం చూస్తుంటే భూ ఆక్ర‌మ‌దారుని మాట‌ల‌కు బ‌లం చేకూరుతుంది.. పిల్లర్స్ స్టేజీలో ఉన్నప్పుడు ఫిర్యాదుచేస్తే బిల్డింగ్ దాదాపు 90శాతం ప‌నులు పూర్తి కావొస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యామేంటో తెలువడం లేదు.

అప్ప‌టి జిల్లా క‌లెక్ట‌ర్ లోకాయుక్త‌కు సర్వే నెంబర్ 581/01లో ఆక్ర‌మించి ఎం. రోహిత్ రెడ్డి నిర్మాణం చేప‌డుతున్న భూమి, సర్కారు భూమి అని నిర్ధారిస్తు నివేదిక స‌మ‌ర్పించారు. కాగా, ఈ వ్య‌వ‌హారంపై ఓ సామాజిక కార్య‌క‌ర్త పూర్తి ఆధారాల‌తో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా క‌లెక్ట‌ర్‌కు, ఉప్ప‌ల్ త‌హ‌సిల్దార్‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోకపోవడం గమనార్హం. కొంద‌రు ప్రభుత్వ అధికారులే పైసలకు కక్కుర్తిపడి అక్ర‌మార్కుల‌కు వంత‌పాడుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించిన వారిపైన ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో మురుగంటి రోహిత్ రెడ్డి, గొబ్బుర్ వెంకటేష్, జూపల్లి రాజశేఖ‌ర్ రావుల‌పై ఎఫ్ఐఆర్ నెం. 999/2022 తేదీ 12 సెప్టెంబ‌ర్ 2023న ఐపీసీ సెక్ష‌న్ 420, 506, 156(3), సీఆర్‌పిసి కింద కేసు న‌మోదు కావ‌డం జ‌రిగింది. ఈ ఎప్ఐఆర్ కూడా కోర్టు ఆదేశాల ప్ర‌కారం న‌మోదు చేశారు. అయినా ఇప్పటికీ ప్ర‌భుత్వ స్థ‌లాన్ని స్వాధీన ప‌ర్చుకోకుండా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ ఉన్న‌తాదికారులు స‌మ‌గ్రంగా విచారించి అవినీతికి పాల్ప‌డి ప్ర‌భుత్వ స్థ‌లంలో నిర్మాణ‌ అనుమ‌తులను ర‌ద్దుచేసి, స‌ర్కార్ స్థ‌లాన్ని స్వాధీనం చేసుకొని, అవినీతిప‌రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This