Friday, September 20, 2024
spot_img

ఓర్వలేనితనం ఒక వింత మానసిక రోగం

Must Read

ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇతరులు బాగుంటే, చూసి ఓర్వలేక మానసికంగా కృశించి పోతున్న వారిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగక మానదు. విద్యావంతుల్లో కూడా ఇలాంటి నైజం పెరగడం విద్యకున్న విలువను తగ్గిస్తున్నది. నేటి చదువులు విలువలను నేర్పడం లేదు. ఈ కారణం వలనే ఇలాంటి పెడధోరణులు తలెత్తుతున్నాయి. ఇతరులకు పెట్టి తినాలనే జ్ఞానం నశించి, పరుల కడుపు కొట్టి తినాలనే దుర్మార్గం పెరిగింది. ఇలాంటి ధోరణులు పెరగడానికి గల కారణాలను కనిపెట్టి, సంస్కారవంతమైన సమాజం కోసం కృషి చేయాలి. విద్యావంతులు,మేథావులు,సంస్కర్తలు ఇందుకు తగిన కృషి చేయాలి. ఈ విషయంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత అధికం కావాలి.తన సృజనతో శిలను చెక్కి, దానికొక అందమైన రూపాన్ని కల్పించి, జీవకళ ఉట్టిపడేలా చేసిన శిల్పకారుడు ఎంతటి ప్రశంసనార్హుడో అలాగే ఈ సమస్త సృష్టిని తన మేథస్సుతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మేథావులంతా ప్రశంసాపాత్రులే. సృష్టికి ప్రతి సృష్టి చేసిన మానవుడే ఈ చరాచరజగత్తులో అత్యంత శక్తివంతుడు.మానవజాతి ఈ సృష్టిలో మహోత్కృష్ఠమైనది. ఆలోచనా జ్ఞానం,విచక్షణ వంటి పలు విశిష్ఠతలతో విలక్షణమైన లక్షణాలతో మానవ మేథస్సు సృష్టించబడింది. ఈ సృష్టిలో అద్భుతమైన శక్తిసంపదల సృష్టికి మానవ మేథస్సు నిలువెత్తు సాక్షీభూతం. కొన్ని జీవరాశులు మానవ జాతికంటే బలమైనవి అయినా వాటికి బుద్ధిబలం,విచక్షణా శక్తి లేకపోవడం పెద్దలోటు.అందుకే అన్ని విధాలా సకల జీవరాశులలో మానవుడే అత్యంత శక్తిసంపన్నుడు.పురాణకాలం నుండి నేటి కాలం వరకూ మానవజాతి ఔన్నత్యాన్ని గురించి అనేక ప్రాచీన గ్రంథాల్లో,తాళపత్రాలలో, ఆధునిక రచనల్లో విశదీకరించడం జరిగింది. అటువంటి మహిమాన్వితమైన మానవ శక్తి నిర్మాణాత్మకంగా ఉపయోగపడకుండా విధ్వంసకరంగా పరివర్తన చెందడం నేటి వ్యవస్థ చేసుకున్న పాప పరిహార ఫలితమేమో అనిపించక మానదు.వివేకం స్థానంలో మూర్ఖత్వం,విచక్షణ స్థానంలో విధ్వంస బీజాలు బలంగా నాటుకుపోయాయి. మానవ మేథస్సు వక్రమార్గంలో పయనిస్తుంది. మానవుని ఆలోచనా విధానం వక్రగతిలో పురోగతి చెందడం అనర్ధదాయకం- అటవికం.యుగాలు గడిచాయి. తరాలు అంతరించాయి. కొత్తనీరొచ్చి పాత నీరును ప్రక్కకు గెంటినట్టుగా పాతతరాన్ని,పాతతరపు ఆలోచనలను నవతరం ఎప్పటికప్పడు ప్రక్కకు నెడుతూ కొత్తొక వింత- పాతొక రోత గా మారుతూ, స్థానభ్రంశం చెందడం కాలానికున్న సహజలక్షణం. అయితే గతంలో ఒక తరం వారి ఆలోచనా విధానాలను అవగతం చేసుకుంటూ వారిని గౌరవిస్తూ వారు చూపిన బాటలో పయనించడానికే ప్రయత్నం చేసేవారు. విలువలకు పెద్ద పీటవేస్తూ, సమాజంలో ఎలాంటి అలజడులు,అశాంతి లేకుండా జీవించేవారు.కుల,మత,వర్గబేధాలు పాతకాలంలో ఉన్నప్పటికీ అందరూ కలసి మెలసి అరమరికలు లేని జీవన విధానం అనుసరించేవారు. పెద్దలను గౌరవించడం, విలువలను పాటిస్తూ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ, సాధ్యమైనంతవరకూ సుహృద్భావ వాతావరణం లోనే జీవించేవారు. నేటి కాలంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించవు. బలవంతులకే అగ్రతాంబూలం-డబ్బున్న వారికే సమాజంలో విలువ. డబ్బుంటే తప్పులన్నీ ఒప్పులుగా చెలామణీ అవుతున్న రోజులివి. మంచికి వంచన తప్ప విలువ లేదు. అవకాశవాదం వేయితలల విషవృక్షంగా అవతరించింది. మాటకు విలువ తగ్గింది. మనిషి సృష్టించిన నోటు మనిషినే కబళించే విడ్డూరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నోటుకున్న ప్రాధాన్యత నోటిమాటకు లేదు.స్నేహబంధాలు తెగిపోతున్నాయి- రక్తసంబంధాలు రావణకాష్ఠంలా రగిలిపోతున్నాయి.సమాజమంతా అసూయతో నిండిపోయింది. అహంకారపు పైత్యప్రకోపాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. దొడ్డిదారిలో ధనార్జనచేసి,పైకి రావడానికే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఎలా సంపాదించావన్నది కాదు,ఎంత సంపాదించావన్నదే ప్రధానంగా మారిపోయింది. ఎవరన్నా పలకరిస్తే మీ కెంతమంది సంతానం అని అడిగేవారు ఒకప్పుడు! మీకెంత ఆస్తి ఉంది? మీ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారా? ఎన్ని కోట్లు కూడబెట్టారు? అనే ప్రశ్నల పరంపర మొదలౌతున్నది నేటి కాలంలో!!

మానవ ఆయుఃప్రమాణం క్రొవ్వొత్తిలా కరిగి పోతున్నది. జీవించిన కొద్ది కాలంలో కూడా కడుపునిండా తినలేరు…కంటి నిండా నిద్రపోలేరు. రకరకాల రోగాలతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నా, మనిషిలో మార్పు కానరాదు. సక్రమంగా జీవించాలన్న ఆలోచన మచ్చుకైనా మస్తిష్కంలో జనించదు. అవయవాలన్నీ చెడిపోయి,అంపశయ్యపై ఉన్నా, ధనాశ చావదు…లోభత్వం నశించదు. లేవలేక మనిషి మంచం పాలైనా, తాను పోయినా తమ బిడ్డలకు కోట్లు కూడబెట్టాలనే వికృతమనస్తత్వాలు మారడం లేదు పోయేముందు కూడా!!మనసుని తీవ్ర కలతకు గురిచేసే పరిణామాలు నేటి సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. సమాజమంటే మనుషుల సమూహమే కదా.

“మనసు” లేని మనుషుల్లో అంకురించే అవాంఛనీయ,అమానవీయ,విధ్వంసకర బీజాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించమానవు.మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకైనా తెలుస్తుందా? కనీసం ఆలోచించే మనస్తత్వమైనా మనుషుల్లో నిక్షిప్తమై ఉందా? అంటే లేదనే సమాధానమే మనకు చటుక్కున తిరిగి వస్తుంది. ఇతరులను హింసించే వారు కొందరైతే, హింసతో సంతోషించే వారు మరికొందరు. పెట్టిన చేతులను నరికేవారు మరికొందరు. బంధాలనే బలవంతంగా తెంపేసి, నీతులు చెప్పేవారు మరికొందరు.ఎందుకిలాంటి మనస్తత్వాలు మనిషిలో వికృతంగా గూడుకట్టుకు పోతున్నాయో అర్ధం కావడం లేదు. పోయిన తర్వాత ఆరడుగుల నేలకూడా మనది కానప్పుడు,అన్నీ తెలిసిన మానవుడు ఎందుకింత స్వార్ధ పరుడౌతున్నాడు? ధనమే ఇంధనమని ఎందుకు ప్రాకులాడుతున్నాడు? ఎందుకు సజావుగా జీవించడం లేదు? కరెన్సీ కట్టలలోనే మోక్షాన్ని వెతుక్కుంటూ, స్వార్ధమే పరమార్ధమని భ్రమిస్తూ,కరెన్సీ చుట్టూ పరిభ్రమిస్తూ, కాలాన్ని కర్పూరంలా హరిస్తూ, పరులను హింసిస్తూ,పైశాచికానందంలోనే వికృతమైన సంతృప్తి పొందే నేటి కాలపు వింత ధోరణులు ధ్వంస జీవన ప్రమాణాలకు పరాకాష్ఠ.ఇలాంటి ధోరణులు విడనాడకపోతే మానవ జీవితం ఆత్మహత్యాసదృశమే!! సద్గుణాలవలనే మనిషి ఉత్తముడు కాగలడు తప్ప తెచ్చిపెట్టుకున్న డాంభికాల వలన కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షికాగలదా? మనలోని మంచితనం వలనే మనకు విలువ పెరుగుతుంది. ఓర్వలేనితనం తో కొంతమంది మనల్ని అందరికీ దూరం చేసినా దీర్ఘకాలంలో అది వారికే ఎదురుతిరిగే ఆయుధం అవుతుంది. ఓర్పు అనేది ఎంతచేదుగా ఉంటుందో,దాని ఫలం దీర్ఘకాలంలో మధురంగానే ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనించి, ప్రతీ వ్యక్తి పరులకు అపకారం చేయకుండా సద్వర్తనం తో మెలగడమే ఉత్తమోత్తమం.

సృజనశీలురు,త్యాగశీలురు,సమాజహితులు,సద్వర్తనులే మానవాళి మనుగడకు మూలస్థంబాలు. అరచేతిలో వైకుంఠం చూపెడుతూ,శూన్యహస్తాలు చూపెట్టే నేటి ఆధునిక సమాజవైఖరి మారకపోతే మానవాళి మనుగడ త్రిశంకుస్వర్గంలా సందిగ్ధావస్థలో పడక తప్పదు.

-సుంకవల్లి సత్తిరాజు.(సామాజిక విశ్లేషకులు,మోటి వేషనల్ స్పీకర్)
మొబైల్ నెంబర్:9704903463.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This