Friday, September 20, 2024
spot_img

ప్లేట్ల బుర్జు ప్రసూతి ఆస్పత్రిలో భారీ స్కాం.!

Must Read
  • బై అండ్ స‌ప్ల‌య్ ఏజెన్సీల వివ‌రాలు కోరిన ఆదాబ్‌
  • ఆర్టీఐ చ‌ట్టాన్ని ఉల్లంఘించి ఆ స‌మాచారాన్ని ఇవ్వ‌లేమ‌ని రిప్లైయ్‌
  • వివరాలు వెల్లడిస్తే అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు అవుతుంద‌ని ఆందోళ‌న‌
  • బై అండ్ స‌ప్ల‌య్ ఏజెన్సీల‌తో లోపాయికారి ఒప్పందాలు
  • జ‌న‌రిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆస్ప‌త్రి
  • పేషెంట్ల కేసు షీట్ల‌ను ప‌రిశీలిస్తే అస‌లు బాగోతం తెలుస్తుంది..
  • క‌మీష‌న్ల కొర‌కు ఇన్‌స్టాంట్ కొనుగోలు.. బిల్లుల్లో చేతివాటం..!
  • మందులు తిరిగి మెడిక‌ల్ షాప్‌లో అమ్ముకుంటున్న వైనం
  • తన అనుకున్న వారికే టెండ‌ర్ల అప్పగింత
  • మంత్రి సఫోర్ట్ ఉందంటూ అవినీతికి పాల్ప‌డుతున్న సూపరింటెండెంట్
  • దామోద‌ర రాజ‌న‌ర్సింహ దృష్టి సారించాలంటున్న బాధిత రోగులు

‘ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం’ అన్నట్టు వైద్య ఆరోగ్య శాఖలో దోపిడికి పాల్పడ్డ అలవాటున్న వారు ఎక్కడ, ఎలా, ఎంత డబ్బు కొట్టేయోచ్చు ఈజీగా తెలిసిపోతుంది. ఓ పక్క ప్రభుత్వం నుంచి లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటూ మరోపక్క కమీషన్ల కోసం ఎదురుచూస్తుంటరు. వైద్య‌శాఖ‌లో నాలుగు చేతులా సంపాదిస్తుంటారు అంటే అతిశయోక్తి కాదు. కోడలికి బుధ్ధి చెప్పి.. అత్త ఇంకా ఏదో చేసింది.. అన్న చందంగా బయటకి నీతులు చెప్పే వైద్యులే ఇంత దారుణానికి పాల్పడుతున్నరా అంటే ఈ వార్త చదివితే మీకే తెలుస్తుంది. గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అలవాటు పడ్డ పానం ఊరుకుంటుందా… అందుకే ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ లో కూడా అదే తంతు కొనసాగుతుందనీ చర్చ నడుస్తోంది. మంత్రులు, ప్రభుత్వ పెద్దల అండదండలతో వీళ్ల దందా మూడు పువ్వులు, ఆరుకాయాలుగా విరాజిల్లుతుంది.

పేదోడికి ఆపద వస్తే వెంటనే సర్కారు ఆస్పత్రి ఉరుకచ్చి.. తనకొచ్చిన రోగం నయం చేసుకునేటందుకు ఆరాటపడుతాడు. ఇందుకోసమే గవర్నమెంట్ కూడా నిధులు మంజూరు చేసేటందుకు వెనుకాడదు. ఇదే అదునుగా తీసుకుంటున్న కొందరు అవినీతిపరులు దాన్నే క్యాష్ చేసుకుంటున్న దాఖలాలు కనపడుతున్నాయి. హైదరాబాద్ లో అతిపెద్ద ప్రసూతి ఆస్పత్రి పేట్ల బుర్జు. సిటీ నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాల గర్భిణీలు, బాలింతలు సైతం ఇక్కడికే వచ్చి చూపించుకుంటారు. అలాంటి నెం.1 దవాఖానాలో ఎంతో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఆస్పత్రికి అవసరమైన మందులు, ఇతర ముఖ్యమైన సామాగ్రి వెంట వెంటనే కొనుగోలు చేస్తుంది. అయితే దీనికోసం ఆయా కంపెనీలను పిలిచి టెండర్లు అప్పగిస్తుంది. ఇక్కడే మొదలైతుంది అసలు కథ.

గవర్నమెంట్ లెక్కల ప్రకారం కాంట్రాక్ట్ అంటే ఎక్కువ నాణ్యత గల సరుకు, తక్కువ ధరకు ఎవరైతే అందజేస్తామని చెబుతారో వారికే ఆ టెండర్ దక్కాల్సి ఉంటుంది. కానీ ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న చందంగా వైద్య అధికారులు టెండర్లు ఇచ్చే ఏజెన్సీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఎవరూ ఎక్కువ కమీషన్ ఇస్తారో వారికే దక్కేలా లోలోపల పావులు కదుపుతున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతుంది. టెండ‌ర్ రావ‌డానికి సీల్ టెండ‌ర్ లో కూడా జిమ్మిక్కుల చేస్తార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీల్ టెండ‌ర్ యొక్క విష‌యాల‌ను వారికి అనుకూల‌మైన కాంట్రాక్ట‌ర్‌కు అంద‌జేసి వారికంటే త‌క్కువ ధ‌ర‌కే మందులు స‌ప్ల‌య్ చేసే విధంగా కోటేష‌న్లు తీసుకొని టెండ‌ర్ ఖ‌రారు చేస్తున్న‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

గవర్నమెంట్ టెండర్ల విధి విధానాలు :

బై అండ్ స‌ప్ల‌య్ ద్వారా మెడిసిన్ సప్ల‌య్ చేయ‌డానికి సంవ‌త్సర కాల ప‌రిధికి టెండ‌ర్ కాల్ ఫ‌ర్ చేస్తారు. టెండ‌ర్ ఫైన‌లైజ్ క‌మిటీ పూర్తిగా ప‌రీశిలించిన అనంత‌రం త‌క్కువ ధ‌రకు మందులు స‌ప్ల‌య్ చేస్తామ‌న్న‌ స‌ప్ల‌య‌ర్స్ / ఏజెన్సీ కి ఎల్ 1 (లోయెస్ట్ టెండ‌ర్‌)ను కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్ర‌భుత్వ నుండి డ్ర‌గ్స్ స‌ప్ల‌య్ లేని డ్ర‌గ్స్‌ మాత్ర‌మే బై అండ్ స‌ప్ల‌య్ ఏజెన్సీ / స‌ప్ల‌య‌ర్స్ నుండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్లేట్ల బుర్జు ప్రసూతి ఆస్పత్రిలో మాత్రం ఎక్కువగా బ‌య‌టి నుండి డ్ర‌గ్స్ కొనుగోలు చేస్తున్నారు. పద్దతి ప్రకారం బై అండ్ స‌ప్ల‌య్ టెండ‌ర్ ఖరారు చేసిన అనంత‌రం ప్ర‌తి మెడిసిన్ వారి ద్వారానే కొనుగోలు చేయాలి. కానీ ఆస్ప‌త్రి సూపరింటెండెంట్ అలా కాకుండా ఇన్‌స్టాంట్ (త‌క్ష‌ణ/అత్య‌వ‌స‌ర‌) కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి. అట్టి మెడిక‌ల్ షాప్ నుండి అధిక బిల్లులు పెట్టి అక్ర‌మ మార్గంలో డ‌బ్బు కొట్టేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదే అత్యవసర సమయంలో కొనుగోలు చేసిన మెడిసిన్స్ ను అదే మెడిక‌ల్ షాప్‌కు తిరిగి అప్పగించి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కమీషన్ల కోసం సూపరింటెండెంట్ కక్కుర్తీ :

‘అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో’ అన్న సామెత ఊరికనే రాలేదు. మెడిసిన్ కోసం టెండర్లు ఇచ్చినప్పటికి ఇన్ స్టాంట్ పేరుతో మరో రూట్ లో తన అనుకునే వారి ద్వారా అత్యవసర మందులు తెప్పికుంటున్నారు ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్. అందులో కమీషన్ రూపంలో పెద్ద మొత్తంలో డ‌బ్బులు దండుకుంటున్నట్లు సమాచారం. ఇన్‌స్టాంట్‌లో స‌ప్ల‌య్ చేసినందుకు అధిక రేటులో బిల్లులో వ‌చ్చిన క‌మీష‌న్‌, అదేవిధంగా తిరిగి మందులను అదే మెడిక‌ల్ షాప్‌కు ఇచ్చినందుకు వ‌చ్చిన డ‌బ్బులు… ఇలా రెండు విధాలా సూపరింటెండెంట్, వైద్య అధికారులు, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ల జేబులు ఫుల్ గా నిండుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇన్‌స్టాంట్‌లో కొనుగోలు చేసిన మందులు, బై అండ్ స‌ప్ల‌య్ ద్వారా కొనుగోలు చేసిన మందులు నిజంగా వాడారా.. లేదా.. అనేది తెల్వదు. ఆస్పత్రికి వచ్చిన ఏ పేషెంట్ల‌కు ఏ మందులు వాడారో అనేది పేషెంట్ల కేసు షీట్ల‌ను ప‌రిశీలిస్తే అస‌లు బాగోతం బయటపడుతుందనీ దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

అదే విధంగా ఇన్‌స్టెంట్ మందుల కొనుగోలు, బై అండ్ స‌ప్ల‌య్ కొనుగోలు అధిక శాతం జ‌న‌రిక్ మెడిసిన్ కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేయ‌డం మనేది మరో పెద్ద మిస్టేక్. దీని ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వంపై 90శాతం అధనపు భారం పడుతుంది. అనగా ఏడాదికి రూ. ల‌క్ష‌ల్లో సర్కార్ ఖజానాకు న‌ష్టం వాటిల్లితుందని లెక్కలు తెలుపుతున్నాయి. ఇదీలా ఉండగా కొంత‌కాలం అనంత‌రం స‌ప్ల‌య‌ర్‌కు మందుల ధ‌ర‌లు పెంచ‌డానికి విన‌తి ప‌త్రం ద్వారా మందులు ధ‌ర‌లు పెంచ‌డం జ‌రుగుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఆర్టీఐలో వివరాలు అడిగిన ఆదాబ్ :

బై అండ్ స‌ప్ల‌య్ మ‌రియు ఇన్‌స్టెంట్ కొనుగోలులో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై పూర్తి స‌మాచారం కావాలని ఈ జూన్ 22 తేదిన ఆదాబ్ హైద‌రాబాద్ ఆర్టీఐ వేసింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం 2005 ప్ర‌కారం పేట్ల బుర్జు ఆధునిక‌ ప్రసూతి ఆస్పత్రి బై అండ్ స‌ప్ల‌య్ చేస్తున్న ఏజెన్సీ పూర్తి వివ‌రాలు, ఒక‌వేళ టెండ‌ర్ ద్వారా కానీ, కొటేష‌న్ ద్వారా ఏజెన్సీలు కేటాయించిన‌చో వాటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు, జ‌న‌వ‌రి 2023 నుండి ఈ రోజు వ‌ర‌కు ఏజెన్సీ స‌ప్ల‌య్ చేసిన మందుల వివ‌రాలు, వారికి చెల్లించిన బిల్లుల‌కు సంబంధించిన వివ‌రాలు దృవీక‌రించిన ప‌త్రాల‌తో సహా కావాల‌ని ఆదాబ్ డిటైల్స్ కోరింది. ఈ వివ‌రాలు ఇస్తే అవినీతి చిట్టా బ‌ట్ట‌బ‌య‌లు అవుతుంద‌న్న భ‌యంతో, స‌మాచార హ‌క్కు చ‌ట్టం 8 (1) (డి) & (11) ప్ర‌కారం స‌మాచారాన్ని ఇవ్వ‌లేమంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. అట్టి స‌మాచారం ఇవ్వ‌డంతో వాణిజ్యప‌ర‌మైన గోప‌త్య‌, వ్యాపార ర‌హ‌స్యాలు మేదోసంప‌త్తికి సంబంధించిన స‌మాచారం వెల్ల‌డి కావ‌డం వ‌ల్ల పోటీ రంగంలో తృతీయ ప‌క్షానికి హానీ క‌లుగుతుంద‌ని, కాబ‌ట్టి అలాంటి స‌మాచారాన్ని అందించ‌లేమ‌ని, థర్డ్ పార్టీకి మేము ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేమ‌ని స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని అవమానపరచడం గమనార్హం. ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం ద్వారా తనకు కావాల్సిన డేటాను అడిగే అర్హత ఉంది. ఈ చ‌ట్టంలో విశాల ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు ఉన్న‌చో అట్టి స‌మాచారాన్ని వెల్ల‌డించ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టంగా ఉంది. కానీ, అధికారులు చ‌ట్టాన్ని ఉద్దేశ‌పూర్వకంగా ఇవ్వలేమంటూ దానికి విరుద్దంగా పనిచేయడం బాధ‌క‌రం. ప్ర‌భుత్వ అధికారి చ‌ట్టాన్ని ఉల్లంఘించి విధుల‌ను నిర్వ‌ర్తించినందున సీసీఏ రూల్స్ ప్ర‌కారం వారిపై చ‌ర్య‌లు తీసుకొని ఉన్న‌తాధికారులు ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్రంగా విచారణ జరిపించి, అవినీతికి పాల్ప‌డిన సూపరింటెండెంట్ పై, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ప్లేట్ల బుర్జు ఆధునిక‌ ప్రసూతి ఆస్పత్రిలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు, వైద్యఆరోగ్యశాఖ అంతా సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ చ‌ట్టాన్ని ఉల్లంఘించి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ, ఎవ‌రైన ప్ర‌శ్నించినచో నాకు మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా అండ‌గా ఉన్నార‌ని, ఈ అవినీతి సొమ్ములో అంద‌రికి స‌మాన వాటాలు అందుతున్నాయ‌ని, న‌న్ను ఎవ్వ‌రూ ఏం చేయ‌లేర‌ని వారి స‌న్నిహితులో చెప్పుకోవ‌డం కొసమెరుపు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This