- గ్రామసభల్లో నిలదీసినా కప్పిపుచ్చుకునే యత్నం
- హావిూల అమలుకు ఏడాదైనా పూర్తి చేయని వైనం
- మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలపై గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ సర్కారును ప్రజలు అనేకచోట్ల నిలదీసారని, ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో పాలకులు లేరని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల సర్కస్ ఫీట్లు, లోకల్ బాడీ ఓట్ల కోసం కాంగ్రెస్ పడుతున్న పాట్లు అని ఎద్దేవా చేశారు. కేవలం స్థానిక ఎన్నికల్లో పట్టుకోసం చేస్తున్న కసరత్తు తప్ప ప్రజల మేలుకోరి చేసే పనులు మాత్రం కావన్నారు. అమలు కాని ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు. గ్రామసభల్లో ప్రజలు తిరగబడు తున్నారని తెలిసి కూడా బుకాయించారని అన్నారు. ఏడాది దాటినా ఆరు గ్యారంటీలకే గతి లేదని, ఇక ఇండ్లు, రేషన్ కార్డు ఇస్తామంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల మంజూరు పేరుతో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువెత్తు నిదర్శనమని వేముల పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలకే ఉప్పు పాతరేసి కొత్తగా ఈ డ్రామాలేమిటని ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. అక్కడక్కడ హావిూల అమలుపై ఎమ్మెల్యేలను ప్రజలు నిలబెట్టి అడిగారని అన్నారు. ఇండ్లు ఎప్పుడు కట్టిస్తారంటూ మహిళలు తిరగబడ్డారని గుర్తుచేశారు. అబద్దాలు చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలవాలని మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ జీరో కాక తప్పదన్నారు. గ్రామసభల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే లేరని, మంత్రులు పత్తా లేకుండా పోయారని, ఎమ్మెల్యేలను గ్రామాలకు రానివ్వడం లేదన్నారు. హావిూలు అమలు చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగలేరన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తిరగబడ్డా రని వేముల అన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పుట్టి పెరిగిన గ్రామాల్లో ఎన్నికల హావిూలు నూరు శాతం అమలు జరిగాయని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయాల నుం చి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. హావిూల అమలులో ప్రజలకు సర్కారు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను మండలానికి ఒక గ్రామం చొప్పున, జిల్లాలోని 35 మండలాల్లో కేవలం 35 గ్రామాల్లో ప్రారంభించారని తెలిపారు. ఏ ఊరికైనా వెళ్లి, నూరుశాతం హావిూలు అమలవుతున్నాయని ప్రజలు చెబితే రాజకీయాలను వదిలేస్తానని, లేకుంటే కాంగ్రెస్ నాయకులు, రాజకీయాలు వదిలేసి ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలవి తుగ్లక్ రాజకీయాలని ఆయ న విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల వీరంగాలు, అక్రమ కేసులకు బీఆర్‌ఎస్ భయపడే రకం కాదన్నారు. తాము పోరాడుతూనే ఉంటామని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజలను మోసగిస్తున్నదని, అందుకే ఎక్కడ చూసినా జనాగ్రహజ్వాలలే కనిపిస్తున్నాయన్నారు. ఇది ప్రజాపాలన కాదని, తుగ్లక్ పాలన అని విమర్శించారు. ఎన్నికల హావిూల అమలులో ఘోర వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికే రోజుకో నాటకం వేస్తున్నారని మండిపడ్డారు. పథకాల అమలుకు సంక్రాంతి పోయిందని, ఇప్పుడు శివరాత్రికి అంటున్నారని ఎద్దేవా చేశారు.