- డీజీపీ నీ కలిసిన రిటైర్డు పోలీస్ అధికారులు.
- డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన!
- కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన!
సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు పోలీసు అధికారులు డీజీపీ కి విన్నవించారు. రిటైర్డు ఐపిఎస్ భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లు శుక్రవారం డీజీపీ జితేందర్ ను కలిశారు. డీజీపీగా నియమితులైనందుకు అభినందనలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు సరైన సమయంలో డీజీపీ గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయనతో మాట్లాడారు. విద్యార్థులు యువత తమకు తెలియకుండానే డ్రగ్స్ బారిన పడుతున్నారని, అక్రమంగా గంజాయి డ్రగ్స్ ను విక్రయిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. వివిధ రూపాల్లో యువతను, స్కూల్ విద్యార్థులకు సైతం డ్రగ్స్ కు అలవాటు చేస్తున్న డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని విన్నవించారు.
మరోవైపు సైబర్ కేటుగాళ్లు అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారని, సైబర్ దొంగల బారిన పడి కష్టపడి సంపాదించి బ్యాంకులలో దాచుకున్న పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నదంతా కోల్పోయి రోడ్డున పడుతున్నారని, బ్యాంకులలో డబ్బు దాచుకుంటే సేఫ్ కాదనే అభిప్రాయం ప్రజల్లో విస్తరిస్తొందని, సైబర్ నేరాలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని వారు డీజీపీ కి విజ్ఞప్తి చేసారు.
తాము పదవీ విరమణ చేసినప్పటికీ అవసరమైనపుడు పోలీసు శాఖకు అన్ని విధాల సేవలు అందించి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజాప్రయోజనాల కోసం తమ శక్తి ఉన్నంత వరకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు డీజీపీ కి స్పష్టం చేసారు.