Friday, September 20, 2024
spot_img

విశ్వ క్రీడా వేదికపై ఇద్దరు మిత్రుల పతకాల స్ఫూర్తి

Must Read

దేశాల మధ్య,ప్రజల మధ్య స్వార్థపూరిత , సంకుచిత రాజకీయాలతో కూడిన విద్వేషాలు,యుద్ధాలతో సామాన్య ప్రజల ఆకలి చావుల ఆర్తనాదాలు, రక్తపుటేరులు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడక్కడ అప్పుడప్పుడు పరిపక్వతతో కూడిన మానవ సంబంధాలు కుల,మత, లింగ ,ప్రాంత,సంస్కృతులకు అతీతంగా మనందరికీ మనిషి తాలూకు ఉనికి గురించి ఎన్నో పాఠాలు చెబుతుంటాయి.అలాంటిదే ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో ఇద్దరు మిత్రుల కథ.ఆ నిజజీవిత హీరోలకు ఓ సెల్యూట్ చేద్దాం పదండి ముందుకు..!

1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ప్రముఖ విశ్వ విఖ్యాత భారతీయ తత్వవేత్త వివేకానంద ప్రసంగిస్తూ “వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి కల్గిన నా దేశం మత సామరస్యానికి,పరమత సహనానికి మారుపేరని,అన్ని మతాలలోని మానవత్వమే తమ సందేశమని అంటే యావత్ ప్రపంచం స్ఫూర్తి పొందింది.నేటికీ ఆయన చూపిన మార్గాన్నే అనుసరిస్తుంది.ఇదే విషయాన్ని పారిస్ ఒలింపిక్స్ 2024 లో జావెలిన్ త్రో విభాగంలో సిల్వర్ పతకం సాధించిన భారత యువతరానికి ప్రేరణ అథ్లెట్ నీరజ్ చోప్రా,స్వర్ణ పతకపు విజేత పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పరస్పరం ప్రదర్శించి అందరూ చూస్తుండగానే ఆటలో ఏమాత్రం తగ్గకుండా గెలవాలనే క్రీడా సమరపు పోటీతో పాటు,ఆట అనంతరం మానవత్వపు నవ్వులతో యావత్ ప్రపంచానికి స్నేహపు పరిమళాలను వెదజల్లారు.

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో టోక్యో ఒలింపిక్స్ లో ఐదవ స్థానానికే పరిమితమైన పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్ ఒలింపిక్స్ లో రికార్డు స్థాయిలో 92.97మీటర్లు బల్లెం విసిరి సరిక్రొత్త చరిత్ర సృష్టించాడు.దాదాపు 40 ఏళ్లుగా ఒలింపిక్ స్వర్ణం కోసం నిరీక్షించిన పాకిస్థాన్ ప్రజలకు తన పతకంతో ఆ దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.క్రికెట్, సినిమాలు తప్ప మిగతా వాటికి పెద్దగా ఆదరణ లేని భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో జావెలిన్ త్రో ఆటనే జీవితాటగా మార్చుకొని ఒలింపిక్స్ లో దేశానికి స్వర్ణమే జీవితాశయంగా చేసుకొని కొన్ని సంవత్సరాలు అలసట లేని కృషితో టోక్యో ఒలింపిక్స్ లో యావత్ భారతానికి స్వర్ణపతకం అందించి భారతీయ క్రీడా సమరంలో అసామాన్యమైన విప్లవాత్మక మార్పును సృష్టించిన నీరజ్ ఈసారి 89.45మీటర్లు బల్లెం విసిరి సిల్వర్ మెడల్ మనందరికీ కానుకగా యిచ్చారు.అనంతరం పతకాలు స్వీకరిస్తున్న సందర్భంగా నీరజ్ మరియు నదీమ్ ల మధ్య దృశ్యాలు నేడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభినందనలు పొందుతున్నాయి.వీరిద్దరూ తమ ఆటతోనే కాక వ్యక్తిత్వ వికాసపు పోటీలో బంగారమని నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఆట ముగిసాక నదీమ్ మీడియాతో మాట్లాడుతూ తనకు నీరజ్ మంచి స్నేహితుడని, ఆటలో పోటీని ఆస్వాదిస్తూనే ఇద్దరం కలిసి వుంటామని అన్నారు.గ్రామీణ నిరుపేద కూలీ కుటుంబం నుంచి వచ్చిన నదీమ్ తన గ్రామ ప్రజల చందాలు వేసుకుని పరికరాలు కొనిస్తే కఠోర శ్రమతో,ఎన్నో ఒడిదుడుకులతో చివరికి ఎన్నో శారీరక మానసిక గాయాలను అధిగమించి తన దేశానికి స్వర్ణ పతకాన్ని బహుమతిగా ఇచ్చారు.ఉగ్రవాదం, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో కొన్ని దశాబ్దాలుగా సతమతమవుతూ ఆగని ఆకలి కేకలు నిరంతరం వినపడే పాకిస్థాన్ వంటి దేశం నుంచి జావెలిన్ త్రో విభాగంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించడమే అసాధారణ విజయపు మహా ప్రస్థానం.అలాంటి స్థితిలో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవడం నిజంగా అనితరసాధ్యం.అభినందనీయం.గతంలో నదీమ్ వాడే బల్లెం పాతదని గ్రహించిన మన నీరజ్ సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ ప్రభుత్వం నదీమ్ కు సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని కోరి తన “భారతీయ బంగారు పతక” హృదయాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు.2014 లో కూడా ఇలాంటి ఆదర్శం నోబెల్ కమిటీ ప్రదర్శించింది.ఆ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని మన దేశం నుంచి బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి మరియు పాకిస్తాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ కి సంయుక్తంగా ప్రకటించి ప్రపంచానికి మానవతపు శాంతి సందేశాన్ని వినిపించారు.

నీరజ్ చోప్రా తల్లి తన కొడుకు గత ఒలింపిక్స్ లో స్వర్ణం,నేటి ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పతకాలు ఏవైనా ఆట వరకే అని,అందరూ కష్టపడుతారని అర్షద్ నదీమ్ కూడా తన కొడుకు లాంటి వాడని చెప్పడం మన భారతీయ సంస్కృతిలోని మాతృ దేవోభవ గొప్పతనాన్ని ఆ తల్లి మనందరికీ గుర్తుచేశారు.వెంటనే నదీమ్ తల్లి నీరజ్ గెలుపు కోసం తాను కూడా ప్రార్థించానని,నీరజ్ తనకు బిడ్డ వంటి వాడని, ఇద్దరు సోదరులని అనడం అందరికీ గూస్ బంప్స్ తెప్పించే విషయం.సహజంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆట అంటేనే అదో ప్రభంజనం.అందరికీ ఆసక్తికరం.అట్లాంటి సందర్భాల్లో ఆటగాళ్ళ మధ్య ఆటపై గెలవాలనే పోటీ మాత్రమే మైదానంలో కనిపించాలి.ఆ తర్వాత అందమైన స్నేహంతో భవిష్యత్తు తరాలకు పాఠం బోధించాలి.ఇలాంటి ఆలోచనలతో ప్రపంచదేశాల మధ్య యుద్ధాలు లేని శాంతి సమాజం నిర్మించాలి.

దిగ్గజ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు “నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా..!
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా..!”
నేడు యావత్ ప్రపంచం వ్యక్తిగతంగా నీరజ్ చోప్రా మరియు అర్షద్ నదీమ్ లు సాధారణ స్థాయి నుంచి విశ్వవిజేతలుగా ఎదిగిన తీరును స్ఫూర్తిగా తీసుకుంటూనే వారి స్నేహాన్ని ఆదర్శంగా చూడాలి.భారత్, పాకిస్థాన్ వంటి దేశాలనుంచి వచ్చి అథ్లెటిక్స్ లో విశ్వ క్రీడా సమరంలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఓడించి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఆసక్తికరం,ఆదర్శం.
భారతరత్న అబ్దుల్ కలాం గారు అన్నట్లు “యువత పెద్ద పెద్ద కలల కనాలి.అవి నిజమయ్యే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తుండాలి.”
ఈ సందర్భంగా నీరజ్ చోప్రా మరియు అర్షద్ నదీమ్ లకు మనస్ఫూర్తిగా మనమంతా మానవత్వపు మనస్సుతో మన చిరునవ్వుల పుష్పాలను అందించి అభినందనలు తెలుపుదాం.

ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This