Friday, September 20, 2024
spot_img

బ‌రితెగించిన పంచాయ‌తీరాజ్‌ అధికారులు

Must Read

(మొయినాబాద్ మండ‌లంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు)

  • యధేచ్చగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు
  • పట్టించుకోని పంచాయతీ రాజ్ అధికారులు
  • ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు
  • సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీవో, కార్య‌ద‌ర్శులు
  • పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతున్న ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి
  • నిర్మాణ పనులు పూర్త‌వుతున్న ప‌ట్టించుకోని అధికారులు
  • అవినీతి అధికారులపై పంచాయ‌తీ రాజ్ క‌మీష‌నర్ చ‌ర్య‌లు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. లక్షలకు లక్షలు లంచంగా తీసుకొని అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు. 111 జీవోకు వ్యతిరేకంగా సురభి హెవెన్ లో అక్రమ నిర్మాణాలు యధేచ్చగా చేపడుతున్నారు. వీళ్లకు ఎంపీవో, గ్రామ కార్య‌ద‌ర్శులు మాముళ్ల మత్తులో తూగుతు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దర్జాగా బహుళ అంతస్థుల భవనాలు కడుతున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు చేసివారికి పంచాయ‌త్‌రాజ్ అధికారులు అంటకాగుతున్నట్లు స్థానికంగా జోరుగా చర్చ జరుగుతుంది. గవర్నమెంట్ భూములు, ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు అక్రమార్కులకు అంటగడుతుండడం సిగ్గుచేటు. వేలకు వేలు జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు కనీసం గవర్నమెంట్ నిబంధనలు పాటించకుంటే ఎలా అని మేథావులు ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుండడం చూస్తే ప్రభుత్వాలు, పాలకులు మారిన అధికారుల తీరు మారడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. రాజకీయ ఒత్తిడిలకు, పైసలకు కక్కుర్తి పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న సర్కారు అధికారులపై చర్యలు తీసుకోవాలని స‌ర్వ‌త్రా డిమాండ్ వస్తుంది. సురభి హెవెన్ కు ఎంపీవో, సెక్రటరీలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతూ ఉద్యోగానికి మాయ‌ని మ‌చ్చ తీసుకొస్తున్నార‌ని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అధికార యంత్రాంగం తీరు చూస్తుంటే సిగ్గనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 111 జీవోకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన పంచాయ‌తీరాజ్ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొయినాబాద్ మండలంలో 111 జీవో అమలులో ఉన్నప్పటికీ అనతికాలంలోనే వెలసిన వందల కొద్దీ ఫాం హౌస్ లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు అధికారుల బాధ్యతా రాహిత్యానికి నిలువుటద్ధంగా నిలుస్తున్నాయి. జీవో 111 కు రక్షణగా ఉండాల్సింది పోయి కొంద‌రు అధికారులు తమ విధులను మరిచి పైసలకు కక్కుర్తి పడుతున్నారు. దీనిపై రైతులు, మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న సురభి వెంచర్ కు ఆనుకుని ఉన్న ఓ ఎకరా ప్రభుత్వ భూమిని సదరు వెంచర్ పార్కు పేరుతో కబ్జాకు విఫలయత్నం చేయగా విషయం తెలుసుకున్న ఆదాబ్ హైదరాబాద్ రంగంలోకి దిగి కాపాడింది. తీరా సుర‌భి వెంచ‌ర్‌కు స‌బంధించిన ఆర్చ్ కూడా ప్ర‌భుత్వ భూమిలో నిర్మించిన‌ట్లు అధికారికంగా వెలుగులోకి వ‌చ్చింది.

అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోకనే అనేక మంది పుట్టకొస్తున్నరని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన ఎంపీవో వెంక‌టేశ్వ‌ర రెడ్డి, మొయినాబాద్ కార్య‌ద‌ర్శి సుద‌ర్శ‌న్‌, సురంగ‌ల్ కార్య‌ద‌ర్శి సుహాసిని, చిలుకూరు కార్య‌ద‌ర్శి వెంక‌టేష్‌, అక్రమార్కులతో అంటకాగుతూ అందినకాడికి దండుకుంటూ పై అధికారుల‌కు వాటా చేరవేస్తున్నందుకే అక్రమ నిర్మాణాలు బాహాటంగా కొనసాగుతున్నాయన్న వార్తలూ మండలంలో గుప్పుమంటున్నయి. పాలకులు ప్రభుత్వ భూములను చెరబడుతుంటే అధికారులు వంతపాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ లో మండల కార్యాలయానికి ఎదురుగా చిలుకూరు, సురంగల్ గ్రామ రెవిన్యూలో, సురభి హెవెన్ వెంచర్ లో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు యధేచ్చగా సాగుతున్నాయి. బీజాపూర్ రహదారిని ఆనుకుని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సురభి హెవెన్ వెంచర్ లో హైటెక్ సిటీలో మాదిరి బహుళ అంతస్తులు అపార్ట్మెంట్ లు నిర్మిస్తున్నారు. వచ్చిన కంప్లైంట్ లకు కంటి తుడుపు చర్యగా ఒకటి రెండు నోటీసులిచ్చిన అధికారులు మంతనాల అనంతరం అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతుండడం గమనార్హం. సుర‌భి హెవెన్ వెంచ‌ర్ వారు 111 జీవో కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన‌ట్లు డీఎల్‌పీవో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి పూర్తి నివేదిక‌ను జిల్లా పంచాయతీ రాజ్ అధికారికి ఇచ్చిన అనంత‌రం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇకనైనా సుర‌భి హెవెన్ వెంచ‌ర్ అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకోని, అవినీతికి పాల్ప‌డి, విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించిన ఎంపీవో వెంక‌టేశ్వ‌ర రెడ్డి, మొయినాబాద్ కార్య‌ద‌ర్శి సుద‌ర్శ‌న్‌, సురంగ‌ల్ కార్య‌ద‌ర్శి సుహాసిని, చిలుకూరు కార్య‌ద‌ర్శి వెంక‌టేష్‌ల‌పై వెంట‌నే చ‌ట్ట‌రిత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి అధికారుల అక్ర‌మ ఆస్తుల‌పై అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) దృష్టి సారిస్తే వారి అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు అవుతుంది.. ఏఏ అక్ర‌మ నిర్మాణాదారుల నుండి ఎంతెంత అవినీతి సొమ్ము తీసుకున్నారో.. ఏఏ వెంచ‌ర్లు అనుమ‌తులు లేకుండా స‌హ‌క‌రిస్తున్నారో పూర్తి ఆధారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This