- ప్రమాద ఘంటికలు మోగిస్తున్న టీ.ఎస్.బి.పాస్
- దొంగలకు సద్దికడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
- వెబ్ సైట్ లో పారదర్శకత ఆప్షన్ మాయం
- తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు
- అన్ని సక్రమంగా ఉన్నా వసూళ్లకు పాల్పడుతున్న వైనం
- టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే అధికార కాంగ్రెస్ కు కష్టకాలమే
- ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజిక వేత్తల డిమాండ్
- పరిశోధనాత్మక పాత్రికేయలు ఎం.వేణుగోపాల్ రెడ్డి
సంపన్నుడు, సామాన్యుడు చట్టానికి అందరూ సమానులే అంటూ నిర్మాణదారులు అది చిన్న నిర్మాణమైనా, పెద్దదైనా ప్రతి ఒక్కరు అధికారులతో సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారా నిర్మాణ అనుమతులు పొంది.. తమ నిర్మాణ పనులు అత్యంత సులభంగా జరగాలని.. పారదర్శకత కనబడాలని.. ఎంతో దూరదృష్టితో నిపుణుల ద్వారా సమాలోచనలు చేసి టి.ఎస్.బి.పాస్. చట్టాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించారు. కానీ ఇలాంటి చట్టానికి గ్రహణం పట్టిందా..? కొందరు అవినీతి అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారా..? అసలు ఇలా చేయడానికి ఆస్కారం ఉందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
గత టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టి.ఎస్.బీ. పాస్ చట్టాన్ని ఎంతోమంది మెచ్చుకున్నారు.. పక్క రాష్ట్రాల వారు కూడా ఈ టిఎస్ బిపాస్ చట్టం చాలా బాగుంది అని.. దీనిపై క్లాసులు, సెమినార్లు ఏర్పాటు చేసుకొని ట్రైనింగ్ కూడా తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ టిఎస్ బిపాస్ చట్టం పటిష్టమే అయినా పూర్తిగా అమలుకు నోచుకోక అధికారుల చేతిలో కీలుబొమ్మగా మారింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.. ఈ టిఎస్ బిపాస్ చట్టం పట్టణ ప్రణాళిక అధికారులకు బ్రహ్మాస్త్రంగా.. మంత్రదండంలా తయారై అప్పనంగా కోట్లు దోచుకోవడానికి మార్గంగా తయారైంది అనడంలో అతిశయోక్తి లేదు.. కోర్టును సైతం పక్కదారి పట్టించి ఇష్టం వచ్చినట్లుగా.. మేమే రాజులం.. మేము చేసిందే చట్టం.. మేము గీసింది ప్లాను.. వేసింది రోడ్డు.. అన్నట్లుగా రక్షణ నిబంధనలు, ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలు.. జీవో ఎంఎస్ 168 మున్సిపల్ యాక్ట్ ను తుంగలో తొక్కి.. వారికి నచ్చినట్లుగా.. ఇష్టం వచ్చినట్లుగా 20 ఫీట్ల రోడ్డుకి టీడీఆర్ అనుమతులు.. భారీ భవనాలకు ఎన్ఓసి సర్టిఫికెట్లు, ఫైర్ అండ్ సేఫ్టీ చట్టాలకు విరుద్ధంగా ఉన్న భారీ భవనాలకు ఆక్యుపేన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి అవినీతిని ప్రోత్సహిస్తున్నారు పట్టణ ప్రణాళిక అధికారులు..
టీ.ఎస్.బి.పాస్ కొత్త మున్సిపల్ చట్టంలో పారదర్శకత కరవు..!
టి.ఎస్.బి పాస్ సైట్ మొదలైన కొత్తలో కొంతవరకు పారదర్శకంగా ఉండేది.. అంటే సమాచారం సిటిజన్ సర్చ్ లో కనపడేది.. కానీ కాలం గడిచే కొద్దీ పారదర్శకత లోపించింది.. అంటే సైట్ ఇన్స్పెక్షన్ ఎవరు చేశారు.? క్షేత్రస్థాయి సందర్శన ఏ అధికారి చేశాడు.? ఏమి తప్పిదాలు వెతికి సైట్ లో పొందుపరిచాడు..? అనే వివరాలు కనపడేవి.. కానీ ఈ ఆప్షన్ ని నేడు పూర్తిగా తొలగించారు పర్యవేక్షణాధికారులు..
పారదర్శకత లేకపోవడం వల్ల అధికారుల్లో జవాబుదారితనం లోపించి.. అవినీతి పెరిగే ఆస్కారం ఎంతైనా ఉంది. అవినీతికి ఆజ్యం పోస్తున్నారు టిఎస్ బిపాస్ చట్టం వెబ్ సైట్ ని పర్యవేక్షించే పట్టణ ప్రణాళిక అధికారులు.. ఈ విషయంపై లోతుగా పరిశీలిస్తే.. చెరువుల్లో, కుంటల్లో, నాళాల పైన, నిషేధిత స్థలాలలో, ప్రభుత్వ స్థలాల్లో, ఓపెన్ స్పేస్ జోన్లలో పర్మిషన్లు.. అలాగే ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణ అనుమతులు.. ఎన్నో అక్రమ నిర్మాణాలు.. వాటిని సక్రమం చేయడానికి దొంగతనంగా ఎన్.ఓ.సి. ఆక్కుపెన్సి సర్టిఫికెట్లు అధికారులు ఇచ్చి ఉన్నారు . ఇలా అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు కోసం అధికారులు లంచాల రూపంలో కోట్లల్లో అవినీతి సొమ్మును మూట కట్టారు.. ఈ అవినీతి అంతా కనపడుతుంది అనే భయంతో సైట్ విజిట్ ఆప్షన్ ని తొలగించడం.. దీని వెనుక ఆంతర్యం ఏమిటంటే దొంగలకు సద్ధి కట్టడమే అవుతుంది..
టీ.ఎస్.బి.పాస్ కొత్త మున్సిపల్ చట్టంలో పారదర్శకత కరువైంది. టీ.ఎస్.బి.పాస్ సైట్ నిర్వహణ అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా మారడం.. ఉన్నత స్థాయి అధికారులు, ప్రభుత్వ పెద్దలు, పాలకులకు దీనిపై అవగాహన లేకపోవడం.. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు అవినీతికి ఆజ్యంపోస్తోంది అనడంలో అనుమానం లేదు.. ఈ పాపాలకు మూల్యం ఎవరు చెల్లించుకుంటారు..? పాప కర్మం వెంటాడుతుంది అనే సత్యాన్ని ఇలాంటి అధికారులు గ్రహించాలి..
గతంలో నిర్మాణ అనుమతులు ఇచ్చే డి.పి.ఎమ్మెస్ సైట్లో ఏ నిర్మాణ అనుమతులు ఇచ్చినా.. ఎన్వోసీలు ఇచ్చినా ప్రతిదీ పొందుపరిచేవారు. పబ్లిక్ డొమైన్ లో సిటిజన్ సర్చ్ లో కనబడేది.. కానీ నేడు సిటిజన్ సర్చ్ ను నామమాత్రానికే ఉంచి ఎలాంటి సమాచారం దొరకనివ్వకుండా అవినీతి అధికారులు జాగ్రత్త పడుతున్నారు అనే అభియోగం వాస్తవమైనదే…! ఆధారాలను దొరకనీయకుండా తప్పులు చేస్తున్నారు.. ఇష్టం వచ్చినట్లుగా భూమి ఒకరిదైతే.. ఇంకొక వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నిర్మాణ అనుమతులకు వస్తే.. అధిక మొత్తంలో ముడుపులు ఇస్తే.. నిర్మాణ అనుమతులు, లేఔట్ వెంచర్ అనుమతులు ఇస్తున్నారు.. ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలు తుంగలోకి తొక్కి వేలల్లో నిర్మాణాలు.. వేలల్లో అక్రమ ఆక్యుపేన్సి సర్టిఫికెట్లు.. అక్రమ లేఅవుట్లు..
ఇన్ని అక్రమాలకు ఆధారం ఉంటుంది.. అయితే మీరు ఫిర్యాదు కూడా చేయొచ్చు.. న్యాయస్థానానికి వెళ్లొచ్చు.. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలవుతుంది.. అదేమిటో మీరు ప్రత్యక్షంగా గ్రహించవచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే.. తప్పుడు సమాచారంతో నెలల తరబడి అర్జీ దారులను ఇబ్బందులకు గురి చేయడం ఈ అవినీతి అధికారులకు పరిపాటిగా మారింది.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఎక్కువ కాలయాపన.. ఈ అవినీతిపై పోరాడే సామాజిక ఉద్యమకారులు అలసిపోయి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు..
దొంగ చేతికి తాళం చెవులు :
దండిగా సంపాదించుకుంటున్నా. పట్టణ ప్రణాళిక అధికారులు..!
టీఎస్ బి పాస్ వెబ్ సైట్ లో నిర్మాణదారుడు నిర్మాణాన్ని నిర్మించుకొనుటకు నిబంధనలనుసారం ప్లాన్ వేసి, శాంక్షన్ ప్లాన్ కోసం ఫ్రీ డిసిఆర్ లో ఆటోక్యాడ్ డ్రాయింగ్ చేసి, అప్లోడ్ చేస్తారు.. డ్రాయింగ్ జీ.వో.ఎం.ఎస్ 168 ప్రకారం కరెక్ట్ గా ఉంటే డ్రాయింగ్ ఆమోదించబడుతుంది.. సెక్యూరిటీకి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఏమైనా తప్పిదం ఉంటే డ్రాయింగ్ ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోతుంది. ఒకవేళ డ్రాయింగ్ ఆమోదించబడి సెక్యూరిటీకి వచ్చినా కూడా అధికారులకు ముడుపులు అందకపోతే రిజెక్ట్ చేస్తున్నారు.. ఒకసారి డ్రాయింగ్ ఫెయిల్ చేస్తే మళ్లీ డ్రాయింగ్ సెట్ చేసి అప్లోడ్ చేయడానికి నెలలు సమయం వృధా అవుతుంది.. ఇలా టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణదారులన్నీ సవ్యంగా ఉన్నా కూడా ముడుపుల కోసం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి..
నిర్మాణ అనుమతుల కోసం అర్జీ పెట్టుకున్న నిర్మాణదారుడు అన్ని దస్తావేజులు న్యాయపరంగా పొందుపరిచినా.. ఎన్ఓసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకురావాలంటూ.. ఎమ్మార్వో రెవెన్యూ శాఖ నుండి, ఇరిగేషన్, యు.ఎల్సి, ల్యాండ్ అక్వేజేషన్ శాఖల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తేవాలంటూ నిర్మాణదారుల్ని తిరిగి పంపుతూ ముప్పు తిప్పలు పెట్టి.. కాలుకు వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలుకు.. ఇలా ఇబ్బందులు పెట్టి.. ముడుపులు చెల్లించకపోతే మోక్షం రాదు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. సోకాల్డ్ అవినీతి అధికారులు.. ఇలాంటి అధికారుల భాగోతం వర్ణనాతీతం..
జి.ఓ.ఆర్.టి నంబర్ 731 తేదీ 20/ /11/2017 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ శాఖ నుండి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఏం చెబుతుంది అంటే.. నిర్మాణ అనుమతుల కోసం అర్జీ పెట్టుకున్న నిర్మాణదారుడి ప్రమేయం లేకుండా ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ ప్రణాళిక అధికారులే.. పలు శాఖల నుండి అనుమతులు తెప్పించుకుని.. నిర్మాణ అనుమతులు ఇవ్వాలని ఈ జీవో చెబుతున్న కూడా.. డబ్బులు ఇస్తేనే అనుమతులు.. లేకుంటే లేదు అన్నట్లుగా వ్యవహరించి ముక్కు పిండి ముడుపులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు.
టి.ఎస్.బి.పాస్ కొత్త మున్సిపల్ చట్టం చాలా పటిష్టమైన దృఢమైన చట్టమే కావడం.. మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారుల చేతిలో కీలుబొమ్మగా మారడం.. అధికారులకు వరంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు..
టి.ఎస్.బి.పాస్ కొత్త మున్సిపల్ చట్టం.. పర్యవేక్షణ అధికారులు దొంగలు కావడంతో దొంగలకే సద్దికట్టే పరిస్థితి నెలకొంది..
గత మున్సిపల్ చట్టం డి.పి.ఎం.ఎస్ సైట్ లో అప్రూవ్ కాని, రిజెక్ట్ అయిన ఎన్నో తప్పులు ఉన్న వివాదాస్పదమైన ఫైల్లు అన్ని నేడు మున్సిపల్ ఉన్నత స్థాయి అధికారులు అధిక మొత్తంలో ముడుపులు అందుకుని అప్రూవ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి…
డి.పి.ఎమ్మెస్ పాత మున్సిపల్ నిర్మాణ అనుమతుల సైట్ లో రిజెక్ట్ అయిన ఫైళ్ల డాటా టి.ఎస్.బి పాస్ లో ఎంట్రీ చేస్తే ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తాయి…
డి.పి.ఎమ్మెస్ లో రిజెక్ట్ అయిన ఫైల్లను అధిక మొత్తంలో బేరం మాట్లాడుకుని అప్రూవ్ చేసిన వైనం ఇది అతి దారుణం.. వీటిపై ఎన్నో కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.. హైకోర్టు, జిల్లా కోర్టు ఎన్నోసార్లు మొట్టు కాయలు వేసినా అధికారులకు బుద్ధి రాకపోవడం.. అధికారులపై దృఢమైన చర్యలు లేకపోవడం.. అవినీతి పరాకాష్టకు దారి తీసింది.. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.. కొందరు మున్సిపల్ అధికారుల అవినీతి తంతు ఇంకా దారుణంగా ఉంది.. ముడుపులు ఇస్తే ఎంతకైనా తెగిస్తామని.. టిడిఆర్ నిబంధనలను తుంగలో తొక్కి 20,ఫీట్లకు 25 ఫీట్ల రోడ్డుకు టి.డి.ఆర్ అన్వయించి ఎక్కువ ఫ్లోర్లకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతోంది.. భవిష్యత్తులో ఆ బిల్డింగ్ ఫైర్ ప్రమాదాలకు గురికావడానికి ఆజ్యం పోస్తున్నారు..
అధికారులకు ముడుపులిస్తే 30 ఫీట్ల రోడ్డును 60 ఫీట్లుగా చూపించి.. 11, 12 ఫ్లోర్లు నిర్మాణ అనుమతులు ఇస్తున్న వైనం దారుణం..
మా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం.. మమ్మల్ని అడిగే వారే లేరు.. అంటూ అధికారులు రోజుకు లక్షల్లో ముడుపులను సంపాదించి ఇంటికి తీసుకెళుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తోంది.. కోట్లకు పడగలెత్తిన అవినీతి అధికారులు కళ్ళముందు కనిపిస్తున్నారు..
ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై విచ్చలవిడిగా.. ఇష్టమొచ్చినట్లుగా ఫీజుల మోత మోగిస్తున్నారు.. అడిగే వారు లేరనే ధీమాతో టౌన్ ప్లానింగ్ అధికారులు వారికి నచ్చినట్లు ఎక్కువ మొత్తంలో ఉన్న దానికంటే ఎక్కువ ఫీజు వేసి.. ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తమకు నచ్చినంత అధిక మొత్తంలో ఫీజులు ఝుళిపిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు..
ఒక సామాన్యుడు 150 గజాల స్థలంలో రెండు అంతస్తుల పర్మిషన్ తీసుకుంటే.. 80 వేల నుండి లక్ష రూపాయల వరకు ఫీజు వస్తుంది దీనిలో సి.ఆర్.ఎం.పి కాన్ఫరెన్సీ, రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 150 గజాలకు పన్నులు వేయడం అవసరమా..? ఇవన్నీ నచ్చని వారికే వేస్తున్నారు.. ముడుపులు చెల్లిస్తే ప్రభుత్వానికి చెల్లించే ఫీజులో కూడా తక్కువ ఫీజు వేసి.. నీకు 10 లక్షలు తక్కువ చేశాము మాకు ఐదు లక్షలు ఇవ్వండి.. అని బేరం కుదుర్చుకొని నొక్కేసే ప్రయత్నాలు ఎన్నెన్నో.. ఇవన్నీ కట్టడి చేసే ఉన్నత అధికారి లేకపోవడం విచారించదగిన అంశం..
టి.ఎస్.బి.పాస్ కొత్త మున్సిపల్ చట్టం పర్యవేక్షించే కొందరు ఉన్నత స్థాయి అధికారులు.. హాస్పిటల్ నిర్మాణం చేపడితే హాస్పిటల్ అనుమతులు తీసుకోవాలి.. వారి నుండి భారీగా ముడుపులు తీసుకుని సెమీ కమర్షియల్ గా అనుమతులు ఇచ్చి.. ఎన్నో తప్పులు చేసి ఉన్నారు.. ఈ అవినీతి తంతులో భాగంగా పార్కు స్థలాలకు పర్మిషన్లు.. ఓపెన్ స్పేస్ స్థలాలకు పర్మిషన్లు.. నాలాలపై పర్మిషన్లు… ఇలా అక్రమంగా వేలసంఖ్యలో పర్మిషన్లు ఇచ్చి ఉన్నారు.. వీర్ని అడిగే నాథుడు లేడు.. పర్యవేక్షణ కరువు.. అవినీతి అధికారి ఆడిందే ఆట పాడిందే పాట.. ఓ చిన్న స్థాయి టౌన్ ప్లానింగ్ ఉద్యోగి సేకరించిన ముడుపులు.. ఉన్నత స్థాయి అధికారి వరకు చేరుతున్నాయి.. అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ మితిమీరిన అవినీతిపై ఐఏఎస్ స్థాయి అధికారులు దృష్టి సారించాలి..
ఈ అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి టీఎస్ బీ పాసు ప్రక్షాళన చేస్తారా కొత్త సిస్టం తీసుకొస్తారా అనేది వేచి చూడాలి…
టీఎస్ బిపాస్ అవినీతిపై మరిన్ని ఆధారాలతో తదుపరి కథనంలో