- విభజన సమస్యల పరిష్కారానికి భేటీ
- హైదరాబాద్ లో కీలక సమావేశం
- ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ
- అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇద్దరూ సమావేశం అవుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. విభజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరువాత ఇప్పుడు అడుగు పడబోతోంది. ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు అడుగులు వేయడం గమనార్హం. తెలంగాణ సీఎం రేవంత్ తో కలసి చర్చించాలన్న నిర్ణయానికి వచ్చారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ విషయంలో ఎక్కడ ఆ చొరవ చూపలేదు. దీంతో అనేకానేక సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించుకోవడం ద్వారా ప్రజల్లో భరోసా కల్పించాల్సి ఉంది. ప్రజలుగా అంతా ఒక్కటిగానే ఉన్నారు. ప్రాంతాలు విడిపోయి నా విభేదాలు రాకూడదు. ఇప్పుడు ఇదే ప్రయత్నం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాయడంపట్ల ఆసక్తి నెలకొంది.
విభజన సమస్యలపై గత పాలకులు విఫలం:
ఉమ్మడి ఆంధప్రదేశ్ రెండు తెలుగు రాష్టాల్రుగా విడిపోయాక విభజన సమస్యలను పరిష్కరించుకోవడంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారు. తెలుగు రాష్టాల్ర ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని.. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని చంద్రబాబు తెలిపారు. తనదైన ముద్ర వేస్తూ పరిపాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందుకు సిద్దంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సీఎం రేవంత్ కూడా చర్చల ద్వారా విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్న సన్నద్దతను గతంలోనే వెల్లడించారు. దీనికోసం కసరత్తు కూడా మొదలు పెట్టారు. అధికారులు, మంత్రులతో చర్చించి ఎజెండా ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇలా చేయడం తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై ఆసక్తి :
రెండు రాష్టాల్ర సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం పరస్ఫరం సహకారం అందించు కోవాలని చంద్రబాబు కూడా సంకల్పం ప్రకటించారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయి. పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటి కారణంగా మన రెండు రాష్ట్రాల సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోంది. వీటన్నింటిని మనం కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం జూలై 6న శనివారం మధ్యాహ్నం మీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుందామని నేను ప్రతిపాదిస్తున్నట్లు చంద్రబాబు లేఖలో తెలిపారు. రెండు రాష్టాల్ర మధ్య ఉన్న కీలకమైన సమస్యలు ఇలా ముఖాముఖి సమావేశంలో కూర్చొని చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. ఇరు రాష్టాల్రకు లబ్దికలిగే విధంగా పరస్పరం సహకరించుకోవాలి. మన భేటీ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను అని చంద్రబాబు లేఖలో రాశారు. దీంతో తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులు భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు రాష్టాల్ల్రో సీఎంల సమావేశంపై చర్చ జరుగుతుంది.