- గత 20ఏళ్లుగా ఇదే తంతు
- 13సార్లు మూసివేత.. 27సార్లు ఉత్పత్తులకు అనుమతులు
- ఫిర్యాదులపై చర్యలు శూన్యం
- ఎన్టీటీలో కూడా కేసు నమోదు
- రూ.45 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు
కాలుష్య కాసారాలను వెదజల్లె పరిశ్రమలూ రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ప్రజలు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతుంటే, రైతులు పంటలు పండక దిగాలు చెందుతున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి సహా నల్గొండ జిల్లాల పరిధిలో కాలుష్య కంపెనీలు ద్వారా దుర్గంధం వెదజల్లుతుంది. తద్వారా గాలి, నీరు, వాతావరణం కలుషితమై సకల జనులు నష్టపోతున్నారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. కనీసం మంచినీళ్లు తాగలేని, స్వచ్చమైన ఆహారం భుజించలేని ధీనస్థితిలో ఈ ప్రాంతాల జనం అల్లాడిపోతున్నారు. పీసీబీ నిబంధనలను ఏ మాత్రం లెక్కచేయకుండా కంపెనీలు నడుపుతున్న చర్యలు తీసుకోవడం లేదు. బృందావన్ లాబోరేటరీ ఈ కోవకు చెందినదే. ఒక్కటేంటి ఇలాంటి పాపాలను కట్టుకునే కంపెనీలు చాలానే ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా, మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ లాబోరేటరీ పరిశ్రమ 2002లో కంపెనీ చట్టంలో నమోదు 2005నుండి పరిశ్రమ ప్రారంభం అయింది. ఈ పరిశ్రమ ప్రారంభించిన నాటినుండి పరిశ్రమ నుండి వెలువడే వ్యర్ధాల నిర్వహణ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతుంది. అంతేకాదు పరిశ్రమ వ్యర్థాలను బహిరంగంగా ట్యాంకర్ల ద్వారా తరలిస్తూ పట్టుబడ్డాయి. బృందావన్ ల్యాబ్స్ యాజమాన్యం పరిశ్రమ వ్యర్ధాలను భూగర్భంలోకి విడుదల చేస్తుంది. దీంతో పరిసర గ్రామాల భూగర్భ జలాలు కలుషితం కావడం జరుగుతుంది. కాగా రైతులు పంటలు పండగ, పెట్టిన పెట్టుబడులు రాక ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారు. తాము నమ్ముకున్న భూమిలో పంటలు పండడంలేదని ఆవేదన చెందుతున్నారు. బృందావన్ లాబోరేటరీస్ పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థాలను పూర్తిస్థాయిలో పరిశ్రమ పరిధిలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టం ద్వారా శుద్ధి చేయవలసి ఉండగా అక్రమంగా అడ్డదారులలో విడుదల చేయడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. వ్యర్ధాల శుద్ధి ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్న నిబంధనలు పాటించడం లేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు తెలిసిన పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కై ప్రజాప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు. పీసీబీ నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అధికారులు మీన మేశాలు లెక్కిస్తున్నారు.
కొన్నేళ్లుగా బృందావన్ ది ఇదే తంతు :
బృందావన్ లేబరేటరీస్ పరిశ్రమ స్థాపించిన నాటినుండి గత 20 సంవత్సరాలుగా నిబంధనలు పాటించిన పాపాన పోలేదు. బృందావన్ లాబోరేటరీస్ పరిశ్రమ విస్తరణ చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించారు. అయినా కాలుష్య నియంత్రణ మండలిలోని ఎస్ఈఐఏఏ కమిటీ కన్సల్టెన్సీ తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణ అనుమతులు జారీ చేసి ప్రజాభిప్రాయాన్ని మంటగలుపడం జరిగింది. ఇలాంటి వారి వళ్లే కొన్నేళ్లుగా ఈ కంపెనీ ఇష్టారాజ్యం సాగుతుంది.
13సార్లు బృందావన్ పరిశ్రమ మూసివేత:
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బృందావన్ లాబ్స్ పరిశ్రమ వ్యర్ధాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడడం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ప్రజల నుండి ప్రజాసంఘాల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తప్పనిసరి పరిస్థితులలో బృందావన్ లాబోరేటరీస్ పరిశ్రమలో ఉత్పత్తుల నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బృందావన్ లాబ్స్ నిబంధనలు అమలు చేయకపోయినా తిరిగి అనుమతులు ఇవ్వడం దారుణం. యాజమాన్యం నిబంధనలు తుంగలో తొక్కిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉత్పత్తులు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మళ్లీ జారీ చేసిన అధికారులు తర్వాత తిరిగి వారే ఉత్పత్తులు చేసుకునేలా చేస్తున్నారు. ఉత్పత్తులు ప్రారంభించడానికి సుమారు 27సార్లు అధికారులు అనుమతులు ఇచ్చారంటే బృందావన్ పరిశ్రమ యాజమాన్యం ఏ స్థాయిలో పర్యావరణ చట్టాలను పాతరేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సుప్రీం కోర్టు నిబంధనలకు పాతర :
బృందావన్ లాబ్స్ పరిశ్రమ యాజమాన్యం నిలువునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని రైతులు పర్యావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దీనిపై కోర్టు కాలుష్యం వెదజల్లుతూ ప్రజాప్రయోజనాలు దెబ్బతీస్తూ యాజమాన్యాల ఫోటోలు పత్రికలలో ప్రచురించాలని ఆదేశించింది. అంతేకాకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయినా అధికారులు మాత్రం మూసివేత తిరిగి ఉత్పత్తులకు అనుమతులు ఇస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తూట్లు పొడుస్తున్నారు.
ఎన్జీటీ కేసులో జరిమానా :
బృందావన్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యంతో పంటలు పండక నష్టపోయిన రైతులు యాదాద్రి జిల్లా కలెక్టర్ కు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదులు చేసిన కేవలం టాస్క్ ఫోర్స్ మీటింగ్ కు పిలిచి సూచనలు జారీ చేస్తున్నారు తప్ప వాటిని అమలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విసిగిపోయిన రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది. కేసు నెంబర్ 97/2021-15/2022 గా నమోదై విచారణ సందర్భంగా బృందావన్ లాబరేటరీస్ పరిశ్రమ యాజమాన్యానికి రూ.45 లక్షల వరకు జరిమానా విధించింది. అధికారులు జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు అమలు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో నేటికీ న్యాయస్థానం విధించిన జరిమానా నేటికీ పరిశ్రమ యజమాన్యం చెల్లించలేదు. దీనిపై అధికారులు ఏ స్థాయిలో పరిశ్రమ యజమాన్యానికి సహకరిస్తున్నారో క్లీయర్ గా తెలిసిపోతుంది. కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పరిసర గ్రామమైన అంతమ్మగూడెం ప్రజలు నిరాహార దీక్ష చేస్తున్నారు. బృందావన్ ల్యాబ్స్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.