Wednesday, January 15, 2025
spot_img

సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థలపై చ‌ర్య‌లు ఎక్క‌డ‌..?

Must Read
  • చెరువులు, నాల‌లు క‌బ్జాకు గుర‌వుతున్న.. ప‌ట్టించుకోని అధికార‌లు
  • దేవరయంజాల్ చెరువులో 3కాల్వలు, పంట కాల్వలు పూడ్చి లే అవుట్
  • 10ఎక‌రాల‌కు ఎన్ఓసీ, 82ఎక‌రాల‌కు పైగా వెంచ‌ర్‌
  • గుడ్లకుంట‌ చెరువును క‌బ్జా చేసి, య‌ధ‌చ్చేగా ప్లాట్లు..
  • డబ్బులు దండుకొని నిర్మాణ సంస్థ‌ల‌కు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖల అండ‌
  • ఇరిగేషన్ అధికారుల వెరిఫికేషన్ లో తేటతెల్లం
  • ఆదాబ్ ఫిర్యాదుతో క‌దిలిన ఇరిగేష‌న్ శాఖ‌
  • ఫైన‌ల్ లే అవుట్ అనుమ‌తులు నిలిపివేయాల‌ని హెచ్ఎండీఏకు లేఖ‌
  • కానీ చ‌ర్య‌లు తీసుకోని హెచ్ఎండీఏ అధికారులు..?

ప్రభుత్వ, చెరువుల‌ భూములను అక్రమార్కులు కొల్లగొడుతుంటే వాటిని కాపాడాల్సిన అధికారులు డబ్బులకు అమ్ముడు పోయి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. చెరువులు, కుంట‌ల‌ను, కాలువ‌ల‌ను య‌ధేచ్ఛ‌గా క‌బ్జా చేసి లేఅవుట్‌లు చేస్తున్నా వారికి అండగా నిలుస్తుండడం గమనార్హం. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సపోర్టుతో బిజినెస్ చేసుకుంటున్నారు. వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్స్ చేసుకోమని భేషరతుగా హెచ్ఎండీఏ అధికారులు లే అవుట్ల‌కు అనుమ‌తులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వడం గమనార్హం.

అసలే అగ్రికల్చర్ ల్యాండ్ ను అక్రమార్కులకు అప్పగించిర్రని ఫిర్యాదు చేస్తే వెరిఫికేషన్ ఆఫీసర్లు సైతం డబ్బుకు అమ్ముడు పోయ్యిర్రు. గవర్నమెంట్ నౌకర్ చేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ రియాల్ట‌ర్స్ ఇచ్చే సొమ్ముకు ఆశపడడం సిగ్గుచేటు. వివరాల్లోకి వెళితే.. దేవర యంజాల్ చెరువులో మూడు కాల్వలు, పోతాయపల్లిలో ఓ కాల్వ, మందాయిపల్లి చెరువు ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ కబ్జా చేసి పంట కాల్వలు పూడ్చి, గుడ్లకుంట చెరువును సైతం చెర‌బ‌ట్టి అక్రమంగా లే అవుట్ ఏర్పాటు చేస్తున్న సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థపై చర్యలు తీసుకోవాలెనని అధికారులపై ఒత్తిడి తెస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నవంబర్ లో ఆదాబ్ హైదరాబాద్ లో ముడుపులిచ్చుకో.. కాల్వలు పూడ్చుకో అనే శీర్షికతో ఆదాబ్ వార్తతో రియాక్ట్ అయిన అధికార యంత్రాంగం స్పందించినట్లుగానే నటించారు. వెరిఫికేషన్ ఆఫీసర్లు కూడా అధికారులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. తామంతా సర్కారు ఉద్యోగులమే కదా అనుకున్నారో ఏమో గానీ చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు. ఈ నేపథ్యంలో పూర్తి ఆధారాల‌తో ఇరిగేష‌న్ ఉన్నతాధికారుల‌కు కంప్లైంట్ చేయడం జరిగింది. కాగా, అధికారులు మేల్కొని హెచ్ఎండీఏ అధికారుల‌కు సుచిరిండియా, వాస‌వి సంస్థల‌కు ఇచ్చిన ఫైన‌ల్ లే అవుట్ అనుమ‌తుల‌ను నిలిపివేయాల‌ని హెచ్ఎండీఏకు ఇరిగేష‌న్ శాఖ అధికారులు లేఖ రాశారు. కానీ, హెచ్ఎండీఏ అధికారులు ఇరిగేష‌న్ శాఖ ఇచ్చిన అనుమ‌తుల ర‌ద్దుపై ఇంకా చ‌ర్య‌లు తీసుకోక పోవడం శోచనీయం. పైగా హెచ్ఎండీఏ అధికారులు ఇరిగేష‌న్ శాఖ వారు ఎన్ఓసీ ర‌ద్దు చేయాల‌ని కోరిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలుస్తుంది..

కాగా, క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించగా ఇరిగేష‌న్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ కేవ‌లం 10 ఎక‌రాల‌కు మాత్ర‌మే.. కానీ రియాల్ట‌ర్స్ సుమారు 82 ఎక‌రాల‌కు పైగా వెంచ‌ర్ చేశారు. ఇరిగేష‌న్ అధికారులు ఆ వెంచ‌ర్‌పై ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం వెనుక అనుమానాల‌కు తావిస్తుంది. హెచ్ఎండీఏ అధికారులు, ఇరిగేష‌న్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ కి విరుద్దంగా సుమారు 82 ఎక‌రాలకు అనుమ‌తులు ఇవ్వ‌డ‌మే కాకుండా, పూర్తి స్థాయిలో వెంచ‌ర్ చేయ‌కున్నా, కొంత‌మేర భూమి ఇప్ప‌టికి కూడా కొంద‌రు రైతులు సాగు చేస్తున్న‌, పైన‌ల్ లేఅవుట్ అనుమ‌తులు ఇవ్వ‌డం లోపాయికారి ఒప్పందానికి నిద‌ర్శనం. హెచ్ఎండీఏ డైరెక్ట‌ర్ 1 విద్యాద‌ర్‌, అప్ప‌టి ప్లానింగ్ ఆఫీస‌ర్ య‌శ్వంత్ రావు, జూనియ‌ర్ ప్లానింగ్ ఆఫీస‌ర్ న‌వ‌ళిక‌, ఇరిగేష‌న్ అధికారులు సీఈ ధ‌ర్మ‌, ఎస్ఈ హైద‌ర్‌ఖాన్‌, డిప్యూటి ఇంజ‌నీర్, ఏఈలు.. భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే చెరువుల‌ను, కాల్వ‌ల‌ను రియాల్ట‌ర్ పొతం పెడుతుంటే అధికారులకు వారికి ఒత్తాసు పలుకడం సిగ్గుచేటు. పంట కాల్వలను పూడ్చి మరీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసినట్టు కండ్లకు కనపడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదో అంతుచిక్కడం లేదు. ‘ముడుపులిచ్చుకో.. కాల్వలు పూడ్చుకో’ అనే వార్తను మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా తూముకుంట మున్సిపాల్టీలోని దేవర యంజాల్ లో సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థ ఆగడాలపై ఆదాబ్ లో కథనం ప్రచురణ అయింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అధికారులు అక్కడికి వెళ్లి వచ్చి పంట కాల్వల పూడ్చివేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు పరిశీలించి వచ్చి అంతే వదిలేశారు. ఇన్స్ఫెక్షన్ కు వెళ్లినప్పుడు దేవర యంజాల్ చెరువులో మూడు కాల్వలు, పోతాయపల్లిలో ఓ కాల్వ, మందాయిపల్లి చెరువు ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ కబ్జా పంట కాల్వలు పూడ్చి, గుడ్ల‌కుంట చెరువులో అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేశారని తెలిసి కూడా కామ్ గా ఉండడం వెనుక ఆంతర్యమేంటో తెలియడం లేదు.

దేవ‌ర‌ యంజాల్‌కు సంబంధించిన కాలువ స‌ర్వే నెంబ‌ర్ 268, 276, 277, 278, 282, 286లతోపాటు దేవ‌ర‌ యంజాల్‌లోని చిన్న‌బంధం కుంట స‌ర్వే నెంబ‌ర్ 294, 303, 304, 361, 364ల భూములకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే క్షేత్ర‌స్థాయిలో మండ‌ల స‌ర్వేయ‌ర్ నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం నాలా యొక్క స‌హ‌జ ప్రవాహం స‌ర్వే నెంబ‌ర్ 294, 303, 304, 361, 364ల మీదుగా కాల్వ పోతుంది. కానీ, ఈ నాలాను దారి మ‌ళ్లించి స‌ర్వే నెంబ‌ర్ 288, 289, 290, 291, 292, 305, 306, 308, 309, 311, 312, 313, 322, 323, 326, 327, 328, 329, 331, 332, 362ల మీదుగా నాలాను పూడ్చివేసి, అండ‌ర్‌గ్రౌండ్ పైప్‌లైన్‌ను రోడ్డు మ‌ధ్య‌లో వేయ‌డం విచిత్రంగా ఉంది. ఇంతచేసినా అనుమతులు తీసుకొని చేశారా అంటే ఈ పైప్‌లైన్‌ కోసం అసలు ఇరిగేష‌న్ శాఖ నుండి పర్మిషన్ కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యం. అక్రమ లేఅవుట్ లు నిర్మిస్తున్నా రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా బిల్డర్లు, బిల్డర్ల వద్ద భారీగా ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. వ్యవసాయ కాల్వలు, చెరువులను చెరబట్టి వాళ్లకు ఎన్ఓసీ, అక్రమ పర్మిషన్లు ఇచ్చిన అధికారులను విధుల్లో నుంచి తొలగించి, చట్టరిత్యా చర్యలు తీసుకొని, వారి అక్రమ ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాల్సిందిగా డిమాండ్ వ్యక్తమవుతోంది. అదే విధంగా పంట పొలాలు, వ్యవసాయ భూములలో వెంచర్లు చేసి చెరువు, కాల్వలు కబ్జాచేసి నిర్మాణం చేపడుతున్న సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.

YouTube player
Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS