- జాతీయ రహదారులపై వాహనాల బారులు
- టోల్‌గేట్ల వద్ద గంటలతరబడి క్యూలు
- నగరం నుంచి ప్రత్యామ్నాయా మార్గాల్లో పంపించిన పోలీసులు
- మెట్రో రైళ్లు ఫుల్..బస్టాండ్లు కిటకిట
సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులు వాహనాల్లో సొంతూళ్లకు క్యూకట్టడంతో.. దాదాపు అన్ని రూట్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏటా ఇదేతంతు కనిపించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికితోడు విజయవాడ రహదారిలో రిపేర్లు కూడా వాహనదారులకు పరీక్ష పెట్టాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. శనివారం నుంచి సెలవులు ప్రారంభం కావడంతో ఇటు విజయవాడ, అటు వరంగ్ల, ఇటు నిజామాబాద్రూట్లలో రద్దీ పెరిగింది. సొంత కార్లలో బయలుదేరిన వారికి ట్రాఫక్ జామ్ చీకాకు తెప్పించింది. టోల్‌గేట్ల వద్ద కిలోవిూటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో టోల్‌గేట్ల వద్ద రద్దీ లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను దారి మళ్లించారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో పండగ రద్దీ నివారణకు చర్యలు తీసుకున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరారు. వరుస సెలవులు ఉండటంతో సొంతూళ్లకు తరలివెళ్లారు. మరోవైపు పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మియాపూర్, రాయదుర్గం, జేఎన్టీయూ, అవిూర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు పయనమవుతారు. ఈ క్రమంలో.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వాహనాలు బారులు తీరాయి. ప్రతీసారి ఉన్నట్లే భారీ వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు పయనమైన వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. గత రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా టోల్ గేట్స్ దగ్గర వాహనాల తాకిడి భారీగా ఉంది. జగ్గయ్యపేట దగ్గర చిలకల్లు, నందిగామ దగ్గర కీసర, గన్నవరం దగ్గర పొట్టిపాడు చెక్ పోస్టుల దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. దీంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ గేట్లను అందుబాటులో తెచ్చి వాహనాలను అనుమతి పంపిస్తున్నారు. రోజుకి సాధారణ రోజుల్లో 15 వేల వాహనాలు టోల్ గేట్ల నుంచి బయటకు వెళ్తుండగా.. ఇప్పుడు పండగ సీజన్ కావటంతో వాటి సంఖ్య 40,000 వరకు ఉంటుందని టోల్ గేట్ సిబ్బంది చెబుతున్నారు. వివిధ మార్గాల నుంచి వస్తున్న వాహనాలతో విజయవాడ నగరంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది.. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వైపుకు వస్తున్న వాహనాలతో నగరంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసి పోతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. వారధి వైపు నుంచి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్ హైవే నుంచి నగరంలోకి వచ్చి ఉభయ గోదావరి, విశాఖ వైపుకు భారీగా వాహనాలు తరలి వెళ్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో వాహనాలు నగరం లోకి రావటంతో ట్రాఫిక్ తో రోడ్లు నిండిపోయాయి. ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. అబ్దులాపూర్‌మెట్ ఓఆర్‌ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాన్నాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సిబ్బంది 10 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్‌పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం కూడా రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ కూడలి రద్దీగా మారాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్‌ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే కార్లు, ఇతర వాహనాలతో నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. వంతెన నిర్మాణం, అనుబంధ సర్వీస్ రోడ్డు నిర్మాణం కారణంగా రద్దీ పెరిగింది.