- మా కాలేజీ అడ్మిషన్లు మా ఇష్టం..
- నిబంధనలు లెక్కచేయని ప్రయివేట్ కాలేజీలు
- కాలేజీలు అడ్మిషన్లు నిర్వహిస్తుంటే బోర్డు ఎం చేస్తున్నట్లు
- అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య , నారాయణ కాలేజీలలో అడ్మిషన్లు పూర్తి
- పెద్దలతో తమ పలుకుబడిని వాడుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యం
- ముందస్తు ప్రవేశాలపై ఇంటర్ బోర్డు చేసింది లేదు …చేసేదేమిలేదు ..
- అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యిందని ప్రకటనల వర్షం కురిపిస్తుంటే
- కాలేజీ యజమాన్యాలపై ఇంటర్ బోర్డ్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు
ఇంటర్ బోర్డు దీవెనలతో, ప్రభుత్వ పెద్దల సహకారంతో కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుఅదుపులేకుండా పోయింది.. ఇప్పటికే అల్ఫోర్స్, శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు “నో అడ్మిషన్స్” బోర్డు పెట్టినట్లు సమాచారం..
పదవతరగతి పరీక్షలు, ఇంటర్ బోర్డు పరీక్షలు పూర్తి కాకుండానే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకూడదని నిబంధన ఉన్నప్పటికీ ప్రయివేట్ కార్పొరేట్ కాలేజీలు ఇవేమి లెక్క చేయకుండా.. అందమైన ప్రకటనలతో అడ్మిషన్లు నిర్వహిస్తుంటే ఇంటర్ బోర్డు చూసి చూడనట్లు వ్యవహరించడం నిజంగా మన దౌర్బగ్యమే.. యథేచ్ఛగా దర్జాగా బహిరంగంగా కార్పొరేట్ కాలేజీలు ప్రతి ఏడాది ఇష్టానుసారంగా అడ్మిషన్లను నిర్వహిస్తున్నాయి.. కోర్టులు మొట్టికాయాలు వేసినా.. విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెట్టినా.. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం తమ పద్దతిని మార్చుకోవడంలేదు.. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై మార్చి 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలు ఇంకా ముగియకముందే పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు చేపట్టసాగాయి. దీంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డును ఆశ్రయించారు… దీనిపై స్పందించిన బోర్డు తాజాగా ప్రకటన జారీ చేసింది..
ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు క్యూ కట్టాయి:-
నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ ప్రవేశాలు చేపడితే చర్యలు తప్పవని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి జూనియర్ కాలేజీల ఇంకా షెడ్యుల్ ఇవ్వలేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అనుబంధ కాలేజీల గుర్తింపు అయ్యాకే అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్ధుల పేరెంట్స్‌కు సూచించింది. బోర్డు అడ్మిషన్ల షెడ్యుల్ విడుదల చేయకముందే కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపట్టొద్దని జూనియర్ కాలేజీల యాజమన్యాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి తాము ఇంకా షెడ్యూల్ జారీ చేయలేదనీ, విద్యార్ధులు- తల్లిదండ్రులు షెడ్యూల్‌కు ముందే ప్రవేశాలు చేపట్టరాదని సూచించింది. షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కూడా ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కొత్త అకడమిక్ సెషన్‌కు ఇంటర్ బోర్డు ఇచ్చే షెడ్యూల్ ప్రకారంగానే ప్రవేశాలు చేపట్టాలని, ఇందుకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కాలేజీలు అడ్మిషన్లు నిర్వహిస్తుంటే ఇంటర్ బోర్డు ఎం చేస్తున్నట్లు .?
నిబందనలకు విరుద్ధంగా ఇంటర్ కాలేజీలు యథేచ్ఛగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి.. మహాప్రభో అని విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే ఇంటర్ బోర్డు విచిత్రంగా కాలేజీలకు సీరియస్ వార్నింగ్ లు ఇచ్చి సరిపెట్టుకోవడం విచిత్రమనిస్తుంది.. ఇన్ని ఏండ్లలో ఇప్పటివరకు ఇంటర్ బోర్డు ఒక్కటంటే ఒక్క కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పైగా ప్రతి ఏడాది రొటీన్ గా చర్యలు తీసుకుంటామని కబుర్లు చెబుతూ వస్తుంది.. రైళ్లలోని జర్నల్ బోగీల మాదిరిగా కార్పొరేట్ కాలేజీల వసతి గృహాలు మారిపోయినా.. కాలేజీలు పెట్టె హింసలకు తట్టుకోలేక విదార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బాద్యులైన కాలేజీలఫై మాత్రం ఇంటర్ బోర్డ్ చర్యలు తీసుకోవడంలేదు.. కాలేజీలు నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా.. ఇంటర్ బోర్డు ప్రేక్షక పాత్ర వహించడంపై కూడా పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి..
మహిళా కమిషన్ కాలేజీల బాగోతాన్ని బహిర్గతం చేసిన బోర్డు ప్రేక్షక పాత్రే ..
ఇటీవల మహిళా కమిషన్ కార్పొరేట్ కాలేజీలలో జరుగుతున్న అరాచకాలను బహిర్గతం చేసినా ఇంటర్ బోర్డు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు..నేటికీ కార్పొరేట్ కాలేజీలు దొంగ పేర్లతో అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థుల బతుకులను చిదిమేస్తుంటే ఇంటర్ బోర్డు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సరయ్యిందో బోర్డ్ నిర్వాకులే చెప్పాలి.. ఒక విధ్వంసకారి సృష్టించే అరాచక పరిస్థితులకన్నా.. ఒక మేధావి మౌనం సమాజానికి చేటని ఇంటర్ బోర్డు నిర్వహకులు ఇకనైనా గుర్తిస్తే మంచిది..