- పేట్ల బురుజు ఆధునీక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి బై అండ్ సప్లయ్‌లో గోల్‌మాల్
- ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలతో కుమ్ముక్కు
- రోగుల కేస్‌షీట్లలోనూ ఇవ్వని మందులు మెన్షన్..!
- కొన్ని మందులు ఆసుపత్రి నుంచి బయట మెడికల్ షాపులకు..
- ఆదాబ్‌కు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ససేమీరా
- చెల్లింపు బిల్లులలో నీకేంతా..? నాకేంతంటున్న అధికారులు
- దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం
- ఆస్పత్రిలో జరుగుతున్న స్కాంపై ప్రభుత్వం దృష్టి సారించాలి
హైదరాబాద్ నయాఫుల్ పేట్ల బురుజు ఆధునీక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కమీషన్ల దందా కొనసాగుతోంది. ప్రభుత్వం స్థానికంగా మందుల కొనుగోళ్ల కోసం కల్పించిన సౌలభ్యాన్ని ఆసరగా చేసుకొని కమీషన్ల బాగోతం సాగుతోంది. నీకింతా..! మరీ నాకెంతిస్తవ్ అన్న చందనంగా ఉంది యవ్వారం. హాస్పిటల్ అధికారులకు, మందులు సప్లై చేసే ఏజెన్సీలకు మధ్య మంచి అవగాహన ఉండడంతో.. వీరి మధ్య వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయాలుగా పరిఢవిల్లుతోంది. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులను వైద్య పరంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మందులను వారికి ఉచితంగా సరఫరా చేస్తుంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా అయ్యే మందులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులను సర్కార్ రెండు విధాలుగా చేస్తుంటుంది. ఇందులో 80 శాతం బడ్జెట్‌ను టీఎస్‌ఎంఎస్ఐడీసీకి కేటాయించగా.. మరో 20 శాతం బడ్జెట్‌ను మాత్రం ఆయా ఆసుపత్రులు స్థానిక కలెక్టర్ అనుమతితో ఆయా హాస్పిటల్స్ అవసరం మేరకు మందులు కొనుగోలు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.
అందులో భాగంగానే నయాఫుల్ పేట్ల బురుజు ఆధునీక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి 20 శాతం కోటా కింద ఈ మందులను మొత్తం పది ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. అమృతా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, స్టార్ మెడికల్ అండ్ సర్జికల్ డిస్ట్రిబ్యూటర్స్, లైఫ్ కేర్ ఫార్మా, తారా ఎంటర్‌ప్రైజెస్, హిందూస్థాన్ మార్కెటింగ్, సుజాత ఫార్మాస్యూటికల్, నేషనల్ సైంటిపిక్ అండ్ కెమికల్, శ్రీసాయి కృష్ణ మార్కెటింగ్, కల్యాణ్ ఎంటర్ ప్రైజెస్, జ్యోతి ఎంటర్ ప్రైజెస్, లార్వీన్ ఫార్మా, హిమాలయ హెల్త్ కేర్ ఏజెన్సీల నుంచి పేట్ల బురుజు ప్రసూతి దవాఖానకు మందులు, సర్జికల్, ఇతరత్రా మెడికల్ సామాగ్రి పంపిణీ జరుగుతోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా… ఆసుపత్రిలోని అధికారులు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ.. అడ్డగోలు దోపిడికి పాల్పడుతున్నారు. కానీ, ఆసుపత్రిలోని పై స్థాయి అధికారులు మెడిసన్స్, ఇతర సామాగ్రికి ఎక్కువ మొత్తంలో బిల్లులు చెల్లిస్తున్నారు. సేమ్ ఫార్ముల కలిగిన మందులను జనరిక్ మెడిసిన్ సప్లయ్ చేసుకోకుంటే భారీ ఎత్తున వత్యాసం ఉంటుంది. జనరిక్ మెడిసిన్ వాడకంపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసిన దాఖాలు కూడా ఉన్నాయి.. సుమారు 80శాతం బిల్లులు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు.. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీ మొత్తంలో ఖర్చు భారం తగ్గుతుంది. ఈ క్రమంలో కొందరు ఆస్పత్రి అధికారులు ఏజెన్సీలతో పొత్తు కూడి, చెల్లించిన బిల్లులలో నీకేంతా..? నాకేంతా..? అంటూ.. వచ్చిన సోమ్మును పంచేసుకుంటూ.. సోమ్ము చేసుకుంటున్నారు.
అంతటితో ఆగకుండా కేస్ షీట్ల లోనూ గోల్ మాల్‌కు పాల్పడుతున్నారు ఆస్పత్రి అధికారులు.. ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి అయినా.. రోగికి చికిత్స అందించేటప్పుడు కేస్ షీట్‌ను మెయింటెన్ చేస్తుంటాయి. అందులోనే రోగికి ఇచ్చిన మందులు, తదితర వివరాలను రాస్తారు. అయితే ఇక్కడే పేట్ల బురుజు ఆసుపత్రిలో గోల్‌మాల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేస్ షీట్లో గర్భీణులకు కొన్ని మందులు ఇవ్వకున్నా…ఇచ్చినట్లు రాసి.. వాటిని తిరిగి బయట మెడికల్ షాపుల్లో అమ్ముకొని సోమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇదొక్క రకంగా మెడికల్ ప్రాక్టీస్‌లో మాల్ ప్రాక్టీస్ వంటిదైనప్పటికీ.. కాసుల కక్కుర్తి కోసం ఈ తంతు కొనసాగిస్తుండడం గమనార్హం.
ఇక ఇదే విషయం ఆదాబ్ దృష్టికి రావడంతో..అసలు ఏజెన్సీల నుంచి సరఫరా అవుతున్న మందులు, ఇతరత్రా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద కోరగా.. అది సెక్షన్ 8 (1) (డి), (11) కింద ఇవ్వలేమని చేతులు దులుపుకోవడం విశేషం. అందువల్ల పేట్ల బురుజు ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి దందాపై కనుక రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి పెడితే దవాఖానలో జరిగే అన్ని రకాల అవినీతి తంతు వ్యవహారాలు బయట పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అవినీతి బట్టబయలు అవుతుందని సమాచారం ఇవ్వని ఆస్పత్రి అధికారి
ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి 22-06-2024 తేదీన సమాచార హక్కు చట్టం ప్రకారం ఆధునిక ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల పేట్లబురుజు వారికి ఆస్పత్రికి సర్జికల్ మరియు మెడిసిన్ ఇతరత్రా మెడికల్ సామాగ్రి సప్లయ్ చేస్తున్న ఏజేన్సీ పూర్తి వివరాలను, టెండర్ ద్వారా కానీ, కోటేషన్‌ల ద్వారా కానీ సప్లయ్ ఏజేన్సీలకు కేటాయించినచో వాటికి సంబంధించిన వివరాలను, జనవరి 2023 నుండి జూన్ 2024 వరకు ఆస్పత్రికి సప్లయ్ ఏజేన్సీలు సప్లయ్ చేసిన మెడిసిన్, ఇతర సామాగ్రి వివరాలను మరియు వారికి చెల్లించిన బిల్లుల వివరాలను కోరడం జరిగింది. ఈ సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రి అధికారులు చేస్తున్న చీకటి ఒప్పందాలు అవినీతి బట్టబయలు అవుతుందని ఆదాబ్ ప్రతినిధి కోరిన సమాచారాన్ని (లెటర్ నెం. ఆర్‌సి నెం. ఆర్‌టీఐ/ఎంజీఎంహెచ్/2024/2508, తేది 08-07-2024) ఇవ్వకుండా సెక్షన్ 8(1)(డి), (11) ప్రకారం సమాచారాన్ని ఇవ్వలేమని చట్టాన్ని సైతం ఉల్లంఘించారు.
సమాచార హక్కు చట్ట పక్రారం సెక్షన్ 8(1)(డి), (11) ప్రకారం వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధోసంపత్తికి సంబంధించిన సమాచారం వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షానికి హాని కలిగేటట్లయితే అలాంటి సమాచారం. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాలను వెల్లడి చేయాల్సిందేనని సమర్ధాధికారి భావించిన పక్షంలో మాత్రం వెల్లడి చేయవచ్చునని స్పష్టంగా సెక్షన్ పేర్కొంటుంది… అదేవిధంగా (11) వాణిజ్య వ్యాపార రహస్యాలను మినహాయించి ఏదైనా సమాచారం వెల్లడి తృతీయ పక్షానికి కలిగించే హానికన్నా ప్రజా ప్రయోజనాలకు చేకూర్చే మేలు ఎక్కువని భావించినపుడు ఆ సమాచారాన్ని వెల్లడి చేయవచ్చునని స్పష్టంగా 2005 సమాచార హక్కు చట్టంలో పేర్కొనబడింది.
ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి కోరిన సమాచారం టెండర్, కోటేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సర్జికల్, మెడిసిన్, ఇతర సామాగ్రి సప్లయ్ చేయుటకు కేటాయించిన ఏజెన్సీల యొక్క వివరాలు, వాటికి సంబంధించిన బిల్లుల వివరాలు కోరడం జరిగింది. అంతేకాకుండా 3వ వ్యక్తికి సంబంధించిన సమాచారం కోరలేదు.. ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్, ఇతరత్రా సామాగ్రి సప్లయ్ చేస్తున్న ఏజెన్సీ యొక్క వివరాలు కోరడం జరిగింది.
విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాలను కోరడం జరిగింది. అధికారులు ఈ సమాచారం ఇవ్వడంతో వారి యొక్క అవినీతి బట్టబయలు అవుతుందని సమాచారాన్ని ఇవ్వకుండా.. ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు.
చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉద్యోగి చట్టాన్ని అతిక్రమించి విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి, చట్ట ప్రకారం ఆ అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం.