- తెలంగాణతో ఆయనది ప్రత్యేక అనుబంధం
- రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కెసిఆర్ ప్రకటన
- మన్మోహన్ అంత్యక్రియల్లో బిఆర్‌ఎస్ నేతలు
- ఘనంగా నివాళి అర్పించనున్న కెటిఆర్ బృందం
- కెసిఆర్ ఆదేశాలతో హస్తినకు పయనం
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు భారత రాష్ట్ర సమితి నేతలు హాజరు కానున్నారు. భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ ఎంపీలు, ప్రతినిధులు నివాళులర్పించనున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరు కావాలని కేటీఆర్, ఎంపీలను ఆ పార్టీ అధినేత ఆదేశించారు. ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టుగా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారన్నారు. ఆయనతో తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు మన్మోహన్ అందించిన సహకారం తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ కోసం పోరాడిన సమయంలో ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగింది. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో ఆయన అందించిన సహకారం మరువలేనది. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్‌కు భారాస తరఫున ఘన నివాళులు‘ అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీకి బయల్దేరారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ ఎంపీలు, పలువురు నాయకులు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, నాయకుల బృందం ఘన నివాళులర్పించనుంది. అంత్యక్రియల్లో పాల్గొని మన్మోహన్ సింగ్‌కు బీఆర్‌ఎస్ నేతలు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని కేసీఆర్ పేర్కొన్నారు. దాంతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్‌తో ఉంది. వారి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధముంది. వారెంతో స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టీఆర్‌ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారందించిన సహకారం మరువలేను. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను, ఎంపీలను ఆదేశించాను. ఈ మేరకు వారు హాజరుకానున్నారు అని కేసీఆర్ తెలిపారు.