- అర్థరాత్రి దాటిన తరవాత రాష్ట్రపతి ఉత్తర్వులు
భారత ఎన్నికల సంఘం(Election Commission of India) ప్రధాన కమిషనర్ సీఈసీగా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయనతోపాటు ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌జోషిని నియమించారు. అంతకుముందు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా నూతన కమిటీ నియామకం చేస్తున్నదని, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు ఓపిక పట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయినప్పటికీ నూతన సీఈసీగా జ్ఞానేష్ కుమార్ నియామకానికే కేంద్రం మొగ్గుచూపింది. 2029 జనవరి 26 వరకూ ఆయన సిఇసిగా కొనసాగనున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. జ్ఞానేష్‌కుమార్ కేరళ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. అంతకుముందు ఆయన హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలోని సహకార, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖల కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌తోసహా అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించిన విషయాలను చూసేందుకు హోం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి ఆయన నేతృత్వం వహించారు.