Monday, November 4, 2024
spot_img

మెడ్ ప్లస్.. ఇచ్చట దగా, మోసం, దోపిడీ చేయబడును

Must Read

అస‌లు ఈ మందులు నకిలీనా.. ఓరిజిన‌లా.. అధిక ధరలకు ఎలా విక్రయిస్తుంది..?

  • మావద్ద అన్ని రకాల మందులు ఎక్కువ ధరలకే..
  • అందరూ మా మెడికల్ షాపునకు వచ్చి మోసపొండి
  • సరికొత్త రకంగా దందా చేస్తున్న మెడ్ ప్లస్ సంస్థ‌
  • 50 నుంచి 80% రాయితీ అంటూ మాయమాటలు
  • సేమ్ ఫార్ములా, సేమ్ మెడిసిన్, కంపెనీ మాత్రమే వేరు
  • బహిరంగ మార్కెట్ లో ఓ రేటు.. మెడ్ ప్లస్ లో మరో రేటు
  • ఆఫర్ల పేరుతో అమాయకుల జేబులకు చిల్లు
  • మ్యానుఫ్యాక్చ‌ర్ కంపెనీ నిర్ణ‌యించిన రేటెంత‌..?
  • మెడ్‌ప్ల‌స్ మార్కెట్ చేస్తూ నిర్ణ‌యించిన‌ ధ‌రెంత‌..?

మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఐపీ 500, గ్లిమెపిరైడ్ ఐపీ 2ఎంజీ ఫార్ముల‌తో
గ్లైసిమెప్ జిపి 2 పిఆర్ అనే పేరుతో మెడ్‌ప్ల‌స్ లో రూ. 211 (15 ట్యాబెట్లు)
అదే ఫార్ముల‌తో కె. గ్లిమ్ ఎం 2 ఎంజీ అనే పేరుతో ఇత‌ర ఫార్మ‌సీలో రూ. 69 (15 ట్యాబెట్లు) మాత్రమే

మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఐపీ 500 ఎంజీ, గ్లిమెపిరైడ్ ఐపీ 1ఎంజీ ఫార్ముల‌తో
గ్లైసిమెప్ జిపి 1 పిఆర్ అనే పేరుతో మెడ్‌ప్ల‌స్ ఫార్మ‌సీలో రూ. 150 (15 ట్యాబెట్లు)
సేమ్ ఫార్ముల‌తో కె. గ్లిమ్ ఎం 1 ఎంజీ అనే పేరుతో బయట మార్కెట్ లో కేవలం రూ. 60లు (15 ట్యాబెట్లు)

మెడ్ ప్లస్.. ఇచ్చట దగా, మోసం, దోపిడీ చేయబడును అనే ట్యాగ్ లైన్ ‘మెడ్‌ప్ల‌స్ హెల్త్ స‌ర్వీసెస్ లిమిటెడ్ సంస్థ’కు కరెక్ట్ గా సరిపోతుంది. ఓ వైపు నకిలీ మందులను అధిక ధరలకు విక్రయిస్తుంది. మరోవైపు 50 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ అని ప్రచారం చేసుకుంటూ దగా చేస్తుంది. అంతేకాకుండా మెడ్ ప్లస్ లో మెంబర్ షిప్ కోసం ఏడాదికి రూ.500లు వసూలు చేస్తుంది. ఒక వ్యక్తిని పదే పదే తన మెడికల్ షాపుకే రప్పించేందుకు ఈ కుట్ర చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ‘ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు’ అట్లనే ఉంది మెడికల్ షాపుల దుస్థితి. రోగం వచ్చిందని మందుల దుక్నంకు పోతే షాపుకొచ్చినోడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి ఫార్మసీ కంపెనీలు. తెలంగాణ రాష్ట్రంలో 4వేలకు పైగా ఉన్న మెడ్ ప్లస్ ఫార్మసీల గురించి ఇలా ఒక్కోటి చెప్పుకుంటూ పోతే హనుమంతుడి తోకకన్న పెద్దగనే ఉంటది. ఒంట్లో సుస్తుగా ఉంటే ఓ మందు బిల్లా వేసుకోవడం అందరికీ అలవాటే. రెండు, మూడ్రోజులు అలానే ఉంటే దగ్గరలోని ఎంబీబీఎస్ లేదా ఎండీ దగ్గరకి వెళ్లి చూపించుకుంటారు. కానీ అంతకన్న ముందు మన దగ్గరలోని మెడికల్ షాపుకు వెళ్లి గోలిలు తెచ్చుకొని ట్రై చేస్తారు. ఇదే అదునుగా తీసుకొని ఫార్మసీలు జనాన్ని మోసం చేస్తున్నాయి.

తెలంగాణలో డ్రగ్ మాఫియా దందా జోరుగా కొనసాగుతుంది. ‘కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే’ అన్నట్టు ఫార్మాసీ కంపెనీలు అన్నీ ఏకమై పేద ప్రజల వద్ద రక్తాన్ని జలగల్లా పట్టి పీల్చుతున్నాయి. ఒకటికి బదులు రెండు ట్యాబెట్స్ వేసుకునేలా, రూపాయి అయితే.. మూడు రూపాయలు వసూలు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నాయి. పలు ఫార్మాసీ కంపెనీలు ఇలానే దగా చేస్తున్నాయి. డ్రగ్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అండదండలతోనే వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. మెడ్‌ప్ల‌స్ హెల్త్ స‌ర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సీఈఓ జి. మ‌ధుక‌ర్ రెడ్డి మందు గోలిలు అమ్ముకుంటూ కోట్లకు పడగలెత్తాడనే ఆరోపణలు ఉన్నాయి. అమాయకుల వద్ద ట్యాబెట్ల ద్వారా వేలకు వేలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. సేమ్ ఫార్ములా, సేమ్ మెడిసిన్, కంపెనీ మాత్రమే వేరు కానీ వాటి రేట్లు ఎవరికీ నచ్చిన విధంగా వాళ్లు ముద్రించుకుంటారు. కానీ ఎన్‌పీపీఏ, డ్ర‌గ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డ‌ర్‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం ధ‌ర నిర్ణ‌యించ‌డం జ‌రుగుతుంది. ఇలా ఎవ‌రు ప‌డితే వారు ఇష్టం వ‌చ్చిన ధ‌ర‌లు నిర్ణ‌యించ‌డానికి లేదు..

Medplus Photo 1

ఈ విధంగా రిటైల్ ప్రైస్ నిర్ణ‌యించ‌డం జ‌రుగుతుంది. అలాంట‌ప్పుడు ఉత్ప‌త్తి చేసిన కంపెనీ ఓ ధ‌ర నిర్ణ‌యించిన అనంత‌రం మార్కెటింగ్ చేస్తున్న మెడ్‌ప్ల‌స్ సంస్థ భారీ ఎత్తున అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించ‌డం గ‌మ‌నార్హం.. ఈ విష‌యంపై మ‌రో క‌థ‌నం ద్వారా పాఠ‌కుల‌కు పూర్తి స్థాయిలో వివ‌రిస్తాం..

ఎమ్మార్పీలను ఇష్టారీతిగా ఫ్రింట్ చేసుకోవడం ఓ వైపు, ఆఫర్స్ పేరుతో జనాల్ని తమ షాపులకు రప్పించుడు మరోవైపు మెడికల్ దందా చేస్తున్న మెడ్ ప్లస్, ఇత‌ర‌ ఫార్మాసీ కంపెనీలు నకిలీ మెడిసిన్ సేల్ చేస్తూ భారీ మోసానికి తెరదీస్తున్నాయి. అయినా డ్రగ్ అండ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకే ఫార్ములా, ఎమార్పీ రేట్లు వేరు :

చైన్ ఫార్మసిల ద్వారా 50 నుండి 80 శాతం భారీ డిస్కౌంట్ పేరుతో అమాయకులను నిండా ముంచుతున్నారు. ఒకవైపు చేంజ్ ఫార్మసీలు ఔషధాలను తగ్గింపు ధరలకు విక్రయిస్తూ కొన్ని ఇతర ఔషధాలపై (ఎన్.పి.పి.ఏ) నిబంధనలను తుంగలతోక్కి అధిక ధరలకు మందులను విక్రయిస్తున్నా పట్టంచుకునే నాధుడే కరువయ్యాడు. ఒకే ఫార్ములా, ఒకే మెడిసిన్ ను వేర్వేరు కంపెనీలు తయారు చేస్తున్నట్టు చూపించి రకరకాల ఎంఆర్పీలకు అమ్ముతూ ఫార్మసీ కంపెనీలు దోపిడి చేస్తున్నాయి. మెడ్ ప్లస్ లో అమ్మే ప్రతి మెడిసిన్ బహిరంగ మార్కెట్ లో వేరే ఉంటుంది. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఒకటికి మూడు రెట్లు అదనంగా ఉంటుంది. ఉదాహరణకు మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఐపీ 500, గ్లిమెపిరైడ్ ఐపీ 1ఎంజీ ఫార్ముల గ్లైసిమెప్ జిపి 1 పిఆర్ ట్యాబెట్లు మెడ్‌ప్ల‌స్ ఫార్మ‌సీలో ఎమ్మార్పీ రూ. 150లు, 10శాతం డిస్కౌంట్ తో రూ.135 ల‌కు అమ్మ‌డం జ‌రుగుతుంది. అదే విధంగా మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఐపీ 500 ఎంజీ, గ్లిమెపిరైడ్ ఐపీ 2ఎంజీ ఫార్ముల‌తో గ్లైసిమెప్ జిపి 2 పిఆర్ ట్యాబెట్లు మెడ్‌ప్ల‌స్ ఫార్మ‌సీలో ఎమ్మార్పీ రూ. 211లు, 10శాతం డిస్కౌంట్ తో రూ.189.90 పైస‌ల‌కు విక్రయిస్తున్నారు. ఇదే ఫార్ముల‌తో షుగ‌ర్ వ్యాధికి సంబంధించిన కె. గ్లిమ్ ఎం 1 ఎంజీ ఇత‌ర ఫార్మ‌సీలో 15 ట్యాబెట్లు రూ. 60 లు, కె. గ్లిమ్ ఎం 2 ఎంజీ ఇత‌ర ఫార్మ‌సీలో 15 ట్యాబెట్లు రూ. 69 లకు మాత్ర‌మే విక్ర‌యిస్తున్నారు.

మరోవైపు మెడ్‌ప్ల‌స్ మార్ట్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయాలంటే మెడ్‌ప్ల‌స్‌లో స‌భ్య‌త్వం ఉన్న వారికి మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఐపీ 500 ఎంజీ, గ్లిమెపిరైడ్ ఐపీ 1ఎంజీ ఫార్ముల గ్లైసిమెప్ జిపి 1 పిఆర్ ట్యాబెట్లు రూ. 69.90 పైస‌లు, స‌భ్య‌త్వం లేని వారికి రూ. 150లు, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ఐపీ 500 ఎంజీ, గ్లిమెపిరైడ్ ఐపీ 2ఎంజీ ఫార్ముల‌తో గ్లైసిమెప్ జిపి 2 పిఆర్ ట్యాబెట్లు స‌భ్య‌త్వం ఉన్న వారికి రూ. 85.95 పైస‌లు, స‌భ్య‌త్వం లేనివారికి రూ.211 ల‌కు అంటూ మోసానికి తెర‌లేపారు. పై విష‌యాన్ని గ‌మ‌నించిన‌ట్ల‌యితే మెడ్‌ప్ల‌స్ సంస్థ వినియోగ‌దారునికి డిస్కౌంట్ ఇచ్చిందా.. లేదా డిస్కౌంట్ పేరుతో దోపిడి చేసిందా.. అనే అంశాన్ని వినియోగ‌దారులు గ‌మ‌నించాల్సిన అవసరం ఉంది.

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ప్రేక్షకపాత్ర:


రాష్ట్రంలో మెడ్‌ప్ల‌స్ సంస్థ మందులపై ఎమ్మార్పీ రేట్స్ ఇష్టారీతిన వేసుకొని జనాల్ని మోసం చేస్తుంది. 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ ప్ర‌జ‌ల‌ జేబుకు చిల్లులు పెడుతుంది. లక్షలాది మందినీ అమాయ‌కుల‌ను చేసి దోచుకుంటున్నది. బ‌హిరంగంగానే బ‌రితెగించి ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుంటే ఇప్ప‌టి వ‌ర‌కు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వెనుక ప‌లు అనుమాలు రేకెత్తిస్తున్నాయి. జనాన్ని మోసం చేస్తున్న ఫార్మసీ కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారించి మెడ్ ప్లస్ ప్రతి బ్రాంచిలను క్షుణ్ణంగా త‌నిఖీలు చేస్తే అస‌లు బాగోతాలు బ‌హిర‌గ‌తం అవుతాయని కాబట్టి సామాన్య ప్రజానికం బాగోగుల కోసం తనిఖీలు చేయాలని ప్రజలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంత భారీ ఎత్తున ధ‌ర వ్య‌త్యాసంలో బ‌హిరంగంగా మందుల అమ్మ‌కాలు చేస్తున్న మెడ్‌ప్ల‌స్ సంస్థ మందులు నిజ‌మైన‌వా.. లేక బ‌హిరంగ మార్కెట్‌లో త‌క్కువ ధ‌ర‌ల‌కు అమ్మ‌కాలు చేస్తున్న ఇత‌ర ఫార్మ‌సీల మందులు నిజ‌మైన‌వా అనే అయోమ‌యంలో ప్ర‌జ‌లు ఉన్నారు.. దీనిపై పూర్తి స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన బాధ్య‌త తెలంగాణ ప్ర‌భుత్వం, వైద్యారోగ్య శాఖ, డ్ర‌గ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేష‌న్ వారిపై ఉంది.

ఇకనైన తెలంగాణలో జరుగుతున్న ఈ డ్ర‌గ్ మాఫియాపై మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. ప్ర‌జ‌ల నుండి దోపిడి చేస్తున్న మెడ్‌ప్ల‌స్ సంస్థ‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొని, దోపిడికి గురైన ప్ర‌జ‌ల సొమ్మును రిక‌వ‌రీ చేయాల‌ని ఆదాబ్ కోరుతుంది. ఎల్ల‌వేళ‌లా ఆదాబ్ ప‌త్రిక ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటూ.. వారి స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూనే ఉంటుంది… మా అక్ష‌రం.. అవినీతిపై అస్రం…

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS