తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.
దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనున్నది. ఆయా కంపెనీలు.. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తుతో పాటు సెల్ఫ్ సర్టిఫికేషన్ జతపరచాలని టీజీబీసీఎల్ తెలిపింది. అయితే.. నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఇదిలాఉంటే.. గతంలో తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్మకోవడానికి టీజీ బీసీఎల్అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు పొందిన సోమ్ డిస్టిలరీస్ పై పలు ఆరోపణలు రావడంతో ఈ కొత్త విధానానికి ప్రభుత్వం నాంది పలికింది. సోమ్ డిస్టిలరీస్ పై వచ్చిన ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కొత్త బ్రాండ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. కొత్తగా అనుమతులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం టీజీబీసీఎల్ ను ఆదేశించింది.
ఈ మేరకు బెవరీస్ కార్పోరేషన్ తెలంగాణలో టీజీబీసీఎల్ నందు రిజిస్టర్ కాని కొత్త సప్లయిర్స్ కు అనుమతులు ఇవ్వడానికి ప్రకటన జారీ చేసింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పది రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులపై వచ్చె అభ్యంతరాలపై విచారణ జరిపి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నారు. టీజీబీసీఎల్ లో రిజిస్టర్ కాబడి, సరఫరా చేస్తున్న సప్లయిర్స్ ప్రస్తుతం ఉన్న పద్దతుల్లోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. తెలంగాణ బెవరీస్ కార్పోరేషన్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ.. కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.