స్మార్ట్ ఫోన్ లేని వాడు నేటి డిజిటల్ యుగపు మనిషే కాడు అనే విపరీతమైన రోజులు వచ్చాయి. ఇంటర్నెట్ వాడకపోతే మానసిక దిగులు పెరుగుతుంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు చూడకపోతే ముద్ద దిగడం లేదు. స్మార్ట్ ఫోన్ జేబులో లేక పోతే క్షణం గడవడం లేదు. స్మార్ట్ ఫోన్‌ను ఇంట్లో మరచిపోతే ఊపిరి ఆగినంత పని అవుతుంది. అన్నింటి కన్నా స్మార్ట్ ఫోన్ మిన్న అయిపోయింది. ఇటీవల విదేశీ విశ్వవిద్యాలయం చేసిన సర్వేలో ఆసక్తికరమైన, ప్రమాదకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. తమ ఆప్త మిత్రుల కన్న స్మార్ట్ ఫోన్ మిన్న అని 37 శాతం మంది అభిప్రాయపడగా, తమ తల్లిదండ్రుల కన్న స్మార్ట్ ఫోన్ ముఖ్యమని 29 శాతం యువత తెలుపడం మన స్మార్ట్ ఫోన్ బలహీనతను స్పష్టం చేస్తున్నది. మూడు నెలల పిల్లాడు సహితం స్మార్ట్ ఫోన్ బొమ్మ చూపకపోతే ముద్ద మింగడం లేదు. మన ముఖ్యమైన విధులను సహితం పక్కన పెట్టి స్మార్ట్ ఫోన్ సామాజిక మాధ్యమ సాగరంలో ఈదుతున్నాం. నేడో రేపో స్మార్ట్ ఫోన్ సొరచేపగా మారి మన భవిష్యత్తును మింగేయ చూస్తున్నది.
స్మార్ట్ ఫోన్ ఎంత పని చేస్తున్నది !
స్మార్ట్ ఫోన్ ఎంత మాయ చేస్తున్నది ? నాతో నేను మాట్లాడడమే ఎప్పుడో మానేసా. అమ్మనాన్నలతో ముచ్చట్లు లేవు, స్నేహితులు పలుచబడుతున్నారు. ఒంటరితనం మానసిక వ్యాధిగా మారుతున్నది. చికాకు పెరుగుతున్నది. అన్నం తినాలని పించదు. మైదాన ఆటలు అంతరించి పోతున్నాయి. ఏకాగ్రత మంటగలుస్తున్నది. మానవ సంబంధాలు పలుచబడి పోతున్నాయి. భార్య సహితం పరాయి స్త్రీగా మిగిలి పోతున్నది. భార్యను భర్తకు, తల్లిని పిల్లకు, తండ్రిని కొడుక్కు, విద్యార్థిని చదువుకు దూరం చేస్తున్నది. తల్లితండ్రులు అవసరాలను తీర్చే యంత్రాలుగా మారిపోయారు. స్మార్ట్ ఫోన్ ప్రమాదకరంగా మారి మానసిక, సమయ ఒత్తిడిని పెంచుతూ, ఆదుర్దా, నిరాశ, అనవసర ఆవేశాలకు ఆజ్యం పోస్తున్నది. మన సాధారణ ప్రవర్తనను కొన్ని మాసాల్లో మార్చివేయగల అతి తెలివిగల ఎలక్ట్రానిక్ సాధనంగా స్మార్ట్ ఫోన్ ఫోజులు కొడుతున్నది. ముఖ్యమైన పనిలో నిమగ్నమైన మరు క్షణమే ఫోన్ రింగ్ లేదా సామాజిక మాధ్యమ అలెర్ట్స్ మన దృష్టిని లాగేసుకుంటున్నాయి. “ఆలిని వదలగలను కాని నా అందాల ఫోన్ సుందరిని వదలలేను” అనే అకాలాలు వచ్చాయి. మనీ పర్సు కూడా అవసరం లేదంటూ స్మార్ట్ ఫోన్ కాలర్ ఎగరేస్తున్నది, మనిషిని కట్టు బానిసను చేస్తున్నది.
స్మార్ట్ ఫోన్‌కు దూరం జరగండి, విజయానికి దగ్గరుండి:
మన స్మార్ట్ ఫోన్ హిత శత్రువును జేబులో, టేబుల్ మీద, కప్ బోర్డులో లేదా చాలా దూరంగా పెట్టి మీ పనులు చేయడం ప్రారంభించండి. మీకే అర్థం అవుతుంది, ఏది మనకు విజయాన్ని, అధిక ఉత్పాదకతను పెంచుతుందో లేదా ఏది వైఫల్యాలను అంటకడుతుందో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ జేబులో ఉన్నపుడు పని అసలే జరగదు. జేబుపై పెడితే 25 శాతం జరుగుతుంది. డ్రాలో వేస్తే 40 శాతం ఫలితాలు నమోదు అవుతాయి. దూరం పెడితే మన సామర్థ్యానికి తగిన గరిష్ట ఉత్పాదకత రికార్డు అవుతుంది, విజయాలను వెంట వెంటనే బహుకరిస్తుంది. అనగా ఫోన్ దూరం అయిన కొద్దీ విజయాలు మనకు దగ్గరవుతాయి.
స్మార్ట్ ఫోన్‌ను సక్రమంగా వాడడం ఎలా !
విధి నిర్వహణ లేదా చదుకునే సమయాల్లో స్మార్ట్ ఫోన్/సందేశాలు/కాల్స్ అందనంత దూరంగా, ఆఫ్ చేసి పెట్డండి. సన్నిహిత వాట్సాప్ గ్రూపుల మినహా ఇతర అనవసర గ్రూపుల నుండి తొలగిపోదాం. వార్తల యాప్‌లను సాయంత్రం వరకు దూరం పెడదాం. అతి ముఖ్యమైన కాల్స్ మాత్రమే చేద్దాం లేదా రిసీవ్ చేసుకుందాం. విడియో గేమ్స్, ఆడియో వ్యర్థ సమాచారాలకు దూరంగా ఉందాం. మనకు అత్యవసరం అనుకున్నపుడు మాత్రమే అవసర సమాచారం కోసం గూగులమ్మ తలుపులు తెరుద్దాం. ప్రతి అనవసర ప్రకటనలు లేదా సూచనలకు సమాధానాలు ఇవ్వవద్దు. అవసరమైన ఆడియో లేదా వీడియోలను మాత్రమే ఉపయోగిద్దాం. సామాజిక మాధ్యమాలు మన మెదడును తినేస్తున్నాయి. మనల్ని బుద్దిహీనులుగా మారుస్తున్నాయి.
స్మార్ట్ ఫోన్ రోజుకు ఎన్ని గంటలు మింగుతోంది !
స్మార్ట్ ఫోన్ సాధనానికి స్వల్ప విరామమిచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, వ్యాయామానికి సమయం ఇవ్వడం, స్నేహితులతో అప్పుడప్పుడూ మాట్లాడడం, అమ్మనాన్నల ఆప్యాయతను రుచి చూడడం, భార్యతో కాలక్షేపం చేయటం, ఏకాగ్రతతో చదవడం లాంటివి చేసి చూడండి, మీకే తెలుస్తుంది మీ మనసు ఎంత తేలిక అవుతుందో, మానసిక ఒత్తిడి దిగిపోతుందో. అందరికీ రోజుకు 1440 నిమిషాలు, 86,400 సెకన్ల సమయం మాత్రమే ఉంది. మీరు దీనిలో ఎంత సమయం స్మార్ట్ ఫోన్ వినియోగానికి వెచ్చిస్తున్నారో అంచనా వేయండి. కొంత మంది 500 నుండి 600 నిమిషాల వరకు ఫోన్‌తోనే సంసారం తేస్తున్నారు. వీరికి అపజయాలు నిర్ధారణ అయినాయి. ఫోన్‌ను పక్కన పెట్టి పనిపై ఏకగ్రత పెంచండి.
ఫోన్లో వ్యాసాలు/పుస్తకాలు చదవండి, విద్య విషయాలు సేకరించండి, ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొండి. స్మార్ట్ ఫోన్ అంటే అందరికీ ఇష్టమే, కాని అది మన భవిష్యత్తును పాతాళంలోకి నెట్టకుండా చూసుకొండి. ఫోన్ యాప్ ఆవిష్కర్తలు చాలా తెలివైన వారు. మన ఏకాగ్రతకు తెలియకుండానే గాలం వేసి లాగేసుకోగలవు. స్మార్ట్ ఫోన్ పై పరిమిత ప్రేమను పెంచుకోండి. మన ఉత్పాదకత మన ధ్యాస మీదనే ఆధారపడుతుంది. మన ధ్యాసను ఫోన్ ధ్వసం చేసి మనల్ని చేతగాని వాడిగా మారుస్తుంది. మన ధ్యాసను మన అదుపులో పెట్టుకోవడానికి స్మార్ట్ ఫోన్‌కు పని వేళల్లో తాత్కాలికంగా విడాకులు ఇవ్వండి. జీవితాలను విజయ తోరణాలతో నింపేయండి. స్మార్ట్ ఫోన్ సాధనాన్ని స్మార్ట్‌గా వాడండి, స్మార్ట్‌గా సమాజంలో/చదువుల్లో/విధి నిర్వహణలో పేరు తెచ్చుకోండి.
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037