టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్
బీఆర్ఎస్ గత పాలనలో చేసిన తప్పిదాలు, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారికి శాపంగా మారిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఇప్పటికే ప్రభుత్వం ఈ దిశగా ఐఏఎస్‌ల కమిటీని ఏర్పాటు చేసి సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించిందని చెప్పిన దయాకర్, “అశోక్ అనే వ్యక్తి రాజకీయ శిఖండి లా వ్యవహరిస్తూ, నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని కోర్సులు అమ్ముకొని డబ్బులు సంపాదించడమే కాకుండా, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుంటాడు. ఆయన అసలైన రూపం బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్‌ది” అని విమర్శించారు.
గాంధీ భవన్ ముట్టడి వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించిన ఆయన, ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు గాంధీ భవన్‌ను దేవాలయంగా భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ద్వారానే తెలంగాణలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడుతుంది. రాబోయే రోజులు నిరుద్యోగుల కోసం కొలువుల జాతరలా మారనున్నాయని దయాకర్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.