ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని,ఏపీలో రాష్ట్రపతి విధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.జగన్ చేపట్టిన ఈ దీక్షకు ఇండియా కూటమి నేతల నుండి మద్దతు లభించింది.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యి మద్దతు ప్రకటించారు.కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎవరు కూడా జగన్ కి మద్దతు ప్రకటించలేదు.ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ చేసిన వ్యాఖ్యల పై షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు.మీరు చేస్తున్న నిరసనకు ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు.పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? ఎందుకు మీ నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని నిలదీశారు.మీ పాలనలో ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు.మణిపూర్ లో జరిగిన అల్లర్ల పై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు..?? ఘటనపై ఒక్కసారి కూడా నోరెత్తి మాట్లాడని మీరు,ఉన్నట్టుండి మణిపూర్ పరిస్థితుల పై మాట్లాడడం విడ్డురంగా ఉందని
అన్నారు.జగన్ చేస్తున్న దీక్షలో నిజం లేదని కేవలం పార్టీ స్వలాభం కోసమే దీక్ష చేస్తున్నారని,అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.