Saturday, December 14, 2024
spot_img

ఈపీఎఫ్ జమలో,కాంట్రాక్టర్ కక్కుర్తీ

Must Read
  • శ్రీరాంపూర్ ఓసీపీలో భారీ అవినీతి
  • సీఆర్ఆర్ జాయింట్ వెంచర్ సంస్థ మోసం
  • ఈపీఎఫ్ జమ చేయడంలో ఇష్టారాజ్యం
  • గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం
  • కాంట్రాక్టర్‌కు సహకరిస్తున్న అధికారులు
  • 18నెలల్లో సుమారు రూ.55 లక్షలు స్వాహా
  • ఈపీఎఫ్ జమలో మోసాలకు పాల్పడ్డట్లు కార్మికుల ఆరోప‌ణ‌

సింగరేణిలో ఉద్యోగాలంటేనే భయం.. భయం.అసలు ఇంటినుంచి బయల్దేరిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడా లేదా అని ఎదురుచూస్తుంటారు ఇంట్లోళ్లు.అంత డేంజర్ గా ఉన్నా సింగరేణిలో పనిచేసేందుకు వేలాది మంది కార్మికులు వెనుకాడడం లేదంటే వాళ్లు ఎంతో గ్రేట్.అలాంటి వారి డబ్బులను కాజేస్తున్నారు కొందరు బద్మాష్ గాళ్లు.’మనిషి మర్మం,మాను చేవ బయటకి తెలియవు’ అన్నట్టు వాళ్లు రోజు పనికి వెళ్లి రావడమే తెలుసు.నెల అయిన తర్వాత జీతం తీసుకెళ్లి ఇంట్లో వాళ్లకు ఇవ్వడం,సరిపడ సరుకులు, ఇతర ఖర్చులు పెట్టుకుంటారు.కానీ ఈపీఎఫ్,ఈఎస్ఐ వంటి ఇతరత్రా కటింగ్ ల గురించి వాళ్లకు అస్సలే తెలియవు.సింగరేణి సంస్థ కోసం కష్టపడి పనిచేసే కార్మికుల సంక్షేమానికి సంస్థ పెద్ద పీట వేస్తుంది.దసరా,దీపావళి బోనస్ లు,లాభాల్లో వాటాలు ఇలా చెప్పుకుంటూ పోతే కోల్ మైనింగ్‌లో దేశంలో ఏ సంస్థ కల్పించనన్ని సదుపాయాలను సింగరేణి సంస్థ కార్మికులకు అందిస్తున్న‌ది.కాగా,సింగరేణిని కాంట్రాక్ట్ పనులు తీసుకున్న కొన్ని సంస్థలు లాభాపేక్షతో చేసే పనులు.. ఆ సంస్థను అభాసుపాలు చేస్తుండడం గమనార్హం.

సింగరేణిలోని శ్రీరాంపూర్ ఓసీపీలో పనులను కొన్ని ప్రైవేటు రంగ సంస్థలకు ప్రభుత్వం కాంట్రాక్ట్ కు ఇవ్వడం జరిగింది. మట్టి తవ్వకాలకు సంబంధించి డ్రిల్లింగ్, ఎక్సావేక్షన్, లోడింగ్, ట్రాన్స్‌పోర్టేష‌న్, డంపింగ్, స్ప్రెడ్డింగ్, లెవలింగ్ మొదలైన ఓవర్ బర్డెన్ పనులు చేసేందుకు సింగరేణి సంస్థ సిఆర్ఆర్ జాయింట్ వెంచర్ అనే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. 48 నెలల కాలానికి ఈ పనులు చేసేందుకు సదరు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు 18 నెలలు పూర్తయ్యింది. కాగా, ఈ కాంట్రాక్టర్ సంస్థ నియమించుకున్న కార్మికులకు ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) జమ చేయడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈపీఎఫ్ చట్టాన్ని అనుసరించి కార్మికులకు ఇచ్చే వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ కట్ చేసుకుని, మరో 12 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌ను సంస్థ ఈఫీఎస్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ కాంట్రాక్ట్ సంస్థ అలా చేయకుండా, ఈపీఎఫ్ డిపార్ట్‌మెంట్ వారికి కార్మికుల జీతాన్ని తక్కువగా చూపిస్తూ, కార్మి కులకు మోసానికి పాల్ప‌డుతోంది. కార్మికులకు దక్కాల్సిన డబ్బులను కాంట్రాక్ట్ సంస్థ మిగుల్చుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ప్రతినెలా మూడున్నర లక్షలు స్వాహా :

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ వేజ్ సీలింగ్ లిమిట్ రూ.15 వేలుగా ఉంది. ప్రస్తుతం శ్రీరాంపూర్ ఓసీపీలో కాంట్రాక్టర్ సంస్థలో పని చేసే కార్మికులకు రూ.20 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. వేజ్ సీలింగ్ లిమిట్ కంటే ఎక్కువ వేతనాలు ఇచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం 12 శాతం ఈపీఎఫ్ జమ చేయడం లేదు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 450 మంది వరకు పని చేస్తున్నట్లు తెలిసింది. కానీ, అధికారిక సమాచారం చూసుకుంటే 396 మంది కార్మికులకు ఈపీఎఫ్ జమ చేస్తున్నట్లు తెలిసింది. సుమారు 400 మంది అనుకుంటే ఈ 400 మందికి ఒక్కొక్కరికి రూ.15 వేల జీతం ఇచ్చినా, 12 శాతం ఈపీఎఫ్ రూ.1800 కట్టాల్సి ఉంటుంది. కానీ, గడిచిన 18 నెలల్లో ఏ ఒక్క నెల కూడా రూ.1800 జమ చేయలేదని ఇక్కడ పనిచేసే కార్మికులు వాపోతున్నారు. ప్రతి నెల రూ.800 నుంచి రూ.1000 మాత్రమే ఈపీఎఫ్ కడుతున్నారని చెప్తున్నారు. ఈ లెక్కన నెలకు ఒక్కో కార్మికుడిపై రూ.800 మిగుల్చుకుంటున్న సంస్థ ప్రతి నెల రూ. 3 లక్షల నుంచి రూ. 3.20 లక్షలు కార్మికులకు న్యాయంగా రావాల్సిన సొమ్మును అప్పనంగా నొక్కేస్తుండడం దారుణం. ఈ విధంగా ఏడాదిన్నరకు చూస్తే సుమారు రూ. 54.60 లక్షల నుంచి రూ.57.60 లక్షల కార్మికుల కష్టం సదరు సంస్థ కొట్టేసినట్లు తేటతెల్లం అవుతుంది.

పట్టించుకోని అధికారులు :

కార్మికుల పేరుమీద కాంట్రాక్ట్ సంస్థ ఈపీఎఫ్ డబ్బులు పే చేస్తుందా లేదా అని సంస్థ పట్టించుకోవాలి. కానీ అధికారులు ఏ మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించక పోవడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి కాంట్రాక్ట్ సంస్థ కార్మికులు/ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ వివరాలను బిల్స్ తీసుకునేప్పుడు, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సమర్పించి క్లియరెన్స్ తీసుకోవాలని సింగరేణి కంపెనీ ఇచ్చిన వర్కర్ లో క్లీయర్ గా వెల్లడించబడింది. అయితే క్లియరెన్స్ ఇచ్చే ముందు సంబంధిత అధికారులు నిబంధనలను అనుసరించి వేతనాలు ఇచ్చారా? ఈపీఎఫ్ ఇచ్చారా? అని వెరిఫై చేసుకున్నాకే బిల్లులు మంజూరు చేయాలి. ఈ కాంట్రాక్టర్ సంస్థ అలాంటివి ఏం చేయడం లేదని తెలిసినప్పటికీ శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి, జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బిల్లులు ఎలా మంజూరు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు కావాలనే సదరు కాంట్రాక్టర్ సంస్థకు అనుకూలంగా బిల్లులు ఇచ్చారని ఓపీసీలో పని చేసే కార్మికులు ఆరోపిస్తున్నారు. విషయం బయటికి చెప్తే ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అన్న భయంతో ఎవరికీ చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పని చేసిన కాంట్రాక్ట్ సంస్థ నెలకు రూ.1700 నుంచి రూ.1800 ఈపీఎఫ్ ఇచ్చిందని, మరి ఈ సంస్థ అంత ఎందుకు ఇవ్వలేదనేది బిల్లులు విడుదల చేసేముందు అధికారులు ఆలోచించాలి కదా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా సింగరేణి సంస్థ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటారా.. బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.

సింగరేణి సంస్థ అయినటువంటి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ చేస్తున్న అవినీతిపై, సహకరిస్తున్న సింగరేణి అధికారులపై, ముఖ్యమంత్రి కార్యాలయం, సింగరేణి సి అండ్ ఎండి కార్యాలయం, ఈపీఎఫ్ హైదరాబాద్ కార్యాలయం, సింగరేణి విజిలెన్స్, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు సామాజిక కార్యకర్త నహీం పాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు..

బిల్లును రికవరీ చేయాలి..

సింగరేణి సంస్థ ఇచ్చిన వర్క్ ఆర్డర్ నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి. కార్మికులకు న్యాయం రావాల్సిన ఈపీఎఫ్ లో కోతలు పెట్టి లక్షలు మిగుల్చుకోవడం హేయమైన చర్య. సదరు కాంట్రాక్టర్ పై సింగరేణి వర్క్ ఆర్డర్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి, చెల్లించిన సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలి. ఇందుకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన సింగరేణి అధికారులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

  • నహీం పాషా,సామాజిక కార్యకర్త.

నిజ నిర్ధారణ అయితే చర్యలు తప్పవు :

కార్మికుల ఈపీఎఫ్ కట్టకుండా కాంట్రాక్టర్ కొట్టేసినట్లు మా దృష్టికి వచ్చింది. సామాజిక కార్యకర్త వేసిన ఆర్టీఐలో అన్ని విషయాలపై మా అధికారులు క్లారిటీ ఇచ్చారు. విచారణలో నిజమని తేలితే సదరు కాంట్రాక్టర్ బిల్లుల్లో ఆ మొత్తాన్ని కట్ చేస్తాం. పూర్తి వివరాలపై నాకు స్పష్టత లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

  • శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్, శ్రీరాంపూర్ ఓసీపీ.
Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS