Wednesday, July 2, 2025
spot_img

శ్యామ్‌ బెనగల్‌ మృతికి కేసీఆర్‌ సంతాపం

Must Read

భారతీయ సినిమా దర్శక దిగ్గజం, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మ భూషణ్‌ శ్యామ్‌ బెనగల్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR) సంతాపం ప్రకటించారు. విస్మరించబడిన మనుషుల సామాజిక నేపథ్యాలకు సినీమా రంగంలో సమాంతర స్థానం కల్పించి, సామాన్యుల జీవన ఇతివృత్తాలకు వెండితెర గౌరవం కల్పించిన గొప్ప దర్శకుడని, భరత మాత కన్న తెలంగాణ ముద్దు బిడ్డ శ్యామ్‌ బెనగల్‌ (బెనగల్ల శ్యామ్‌ సుందర్‌ రావు) అని కొనియాడారు. ఇటు తెలంగాణ జీవన నేపథ్యాన్ని, అటు దేశీయ సామాజిక సంస్కృతిక వైవిధ్యాన్ని ఇరుసుగా చేసుకుని, ఆలోచింప చేసేవిధంగా దృశ్యమానం చేస్తూ, డాక్యుమెంటరీలు సినిమాల రూపంలో వారందించిన సేవలను ఈ సందర్భంగా కేసీఆర్‌ స్మరించుకున్నారు. హైదరాబాద్‌ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చలన చిత్ర రంగంలో తన కృషితో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించి, భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన శ్యామ్‌ బెనెగల్‌ తెలంగాణకు గర్వకారణం అని అన్నారు. దర్శక దిగ్గజం శ్యామ్‌ బెనెగల్‌ సోమవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న 90 సంవత్సరాల శ్యామ్‌ బెనెగల్‌ సోమవారం సాయంత్రం ముంబైలోని వోడ్‌హార్డ్‌ దవాఖానలో తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమార్తె పియా బెనెగల్‌ ధ్రువీకరించారు. ఆయనకు భార్య నీనా బెనెగల్‌, కుమార్తె ఉన్నారు. అంకుర్‌, భూమిక, జునూన్‌, కలియుగ్‌, ఆరోహన్‌, త్రికాల్‌, సుస్మాన్‌, అంతర్‌నాద్‌, మండి, మంథన్‌ తదితర అనేక అవార్డు చిత్రాలకు శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వం వహించారు. 1978లో వాణిశ్రీ, అనంతనాగ్‌లతో ఆయన తీసిన ఏకైక తెలుగు చిత్రం అనుగ్రహం 1979 బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిసెంబర్‌ 14న ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలసి తన 90వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డు, 1991లో పద్మ భూషణ్‌ అవార్డుతో భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఆయన దర్శకత్వం వహించిన విజయవంతమైన చిత్రాలలో మంథన్‌, జుబేదా, సర్దారీ బేగం కూడా ఉన్నాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్‌ ఇండియా ఆధారంగా దూరదర్శన్‌ కోసం ఆయన రూపొందించిన భారత్‌ ఏక్‌ ఖోజ్‌ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS